గురవయ్యకు బట్టలు,బొంతలు కుట్టి అమ్మే వ్యాపారం ఉంది. ఆ వ్యపారం బాగానే జరుగుతున్నది.
గురవయ్యకు ఆనందుడనే కొడుకు ఉన్నాడు.వాడు చదువుకుంటున్నాడు. ఒకరోజు ఆనందుడు పాఠశాలనుండి ఇంటికి వస్తుంటే కళాక్షేత్రం లో పేరుమోసిన పాపయ్య చిత్రకళా ప్రదర్శన జరుగుతోంది.ఆనందుడు ఎంతో ఆసక్తితో లోపలికి వెళ్ళి ఆ అధ్బుత చిత్రాలను చూడసాగాడు. ఆ చిత్రాలు ఆనందుణ్ణి ఎంతో ఆకర్షించాయి.
తనుకూడా చిత్రాలు వేసి మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నాడు ఆనందుడు.
అక్కడే ఉన్న పాపయ్యను కలసి తనను తాను పరిచయం చేసుకుని తనుకూడా మంచి చిత్రాలు వెయ్యాలనుకుంటున్నట్లు,అందుకు పాపయ్య వద్ద శిష్యరికం చేయాలను కుంటున్నట్లు చెప్పాడు.
"కృషిచేస్తే నీవు మంచి చిత్రాలు వేయగలవు,ఎందుకంటే నీకు చిత్రకళ అంటే బాగా ఇష్టం ఉంది.పక్క ఊరు కశింకోటే మాది నీకు వీలు చిక్కినప్పుడల్లా రా,నేను నీకు చిత్రకళలో మెళకువలు నేర్పిస్తాను"చెప్పాడు పాపయ్య.
ప్రతి ఆదివారం ఆనందుడు కశింకోటకు వెళ్ళి పాపయ్యవద్ద చిత్రకళ అభ్యసించసాగాడు.మంచి చిత్రాలే వెయ్యసాగాడు.
ఒకసారి ఆనందుడి తండ్రి గురవయ్య జబ్బున పడి కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది.ఈ విషయం తెలిసిన పాపయ్య ఆనందుడి ఇంటికి వచ్చి గురవయ్యకు ధైర్యం చెప్పాడు.
అప్పుడే బొంతలు,బట్టలు కుట్టగా కత్తిరించి మిగిలిన రంగురంగు గుడ్డ పేలికల గుట్టను చూశాడు పాపయ్య.
"చూడు ఆనందు నీవు కొద్ది రోజులు మీ నాన్న దగ్గరే ఉండి ఆయన ఆరోగ్యం చూసుకో ఈ కత్తిరించిన బట్టలు చూశాక,నాకొక ఆలోచన వచ్చింది,ఇందులోనుండి రకరకాల రంగుల బట్ట ముక్కలు తీసి వేరొక బట్టమీద కళాత్మకంగా పక్షులు,చెట్లు,పువ్వులు మొదలైనవి కుడితే ఈ బట్టముక్కలు మిగిలిపోవు,పైగా వీటిని అమ్మితే మీకు లాభం వస్తుంది ఆలోచించు సృజనాత్మకతకు అంతులేదు.మనసుండాలే కానీ మార్గం కనబడుతుంది"చెప్పాడు పాపయ్య.
ఆ మాటలు విన్న గురవయ్యకూడా ఎంతో సంతోషించాడు.ఎందుకంటే ఆనందుడు తన కుట్టుపనిలో అప్పుడప్పుడూ సహాయం చేస్తూ కుట్టులో మెళకువలు తెలుసుకున్నాడు.
"తప్పకుండా మీరు చెప్పినట్టు బట్ట ముక్కలను కళాత్మకంగా కుడతాను,ఈ కళలో కూడా కృషి చేస్తాను" నమస్కారం పెట్టి చెప్పాడు ఆనందుడు.
ఆ మాటలకు పాపయ్య,గురవయ్యలు ఎంతో సంతోషించారు.
సృజనాత్మకత;-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి