దోషం;-డి.కె.చదువులబాబు.తెలుగుఉపాధ్యాయుడు.ప్రొద్దుటూరు.కడపజిల్లా9440703716

 ధర్మవరంలో చలపతి అనే వ్యాపారి ఉండేవాడు.అతనికి గోవిందు, చందు అనే కుమారులున్నారు.
గోవిందు పుట్టిన దినం కొత్త దుస్తులు ధరించాడు. మెడలో వేసుకునే దండ కావాలని అడిగాడు. చాలా రోజులక్రితం చందు మేనమామ చేయించిన గొలుసు అది.అప్పుడప్పుడూ ఆ గొలుసు మెడలో వేసేవారు.తర్వాత తీసి భద్రపరిచేవారు. ఆక్రమంలో గొలుసు కొండి విరిగిపోయింది.
గోవిందు పోరుపడలేక గొలుసు రెండుకొనలనూ దారంతో కట్టి కొడుకు మెడలో వేశాడు చలపతి. బడికి, బంధువులవద్ద కెళ్ళి చాక్ లెట్లు పంచాడుగోవిందు. కొద్దిసేపు ఆడుకుని ఇల్లుచేరాడు.తర్వాత చూసుకుంటే మెడలో గొలుసు లేదు. ఎంతవెదికినా ఆచూకి దొరకలేదు.చలపతి చాలా దిగులుపడ్డాడు.
ఒకరోజు చలపతి కాలులో ముల్లు దిగింది.కాలు చీముపట్టి వాచింది. నడవలేని స్థితికి వచ్చాడు.
విధిలేక వేలు ఖర్చుచేసి ఖరీదైన మందులు వాడి నయం చేసుకున్నాడు.
తర్వాత ఒకరోజు చలపతికున్న రెండుఆవుల్లో ఒక ఆవు కడుపువాచి అయాసంతో చనిపోయింది.
ఆవు చనిపోయిన పదిరోజులతర్వాత చలపతి భార్యకు, గోవిందు, చందుకు జ్వరమొచ్చింది.అంగడిలో అడిగి ఏవో జ్వరం మందులు తెచ్చిఇచ్చాడు. తగ్గలేదు.చేసేదేమీ లేక ముగ్గురినీ ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. రక్తపరీక్షలుచేసి టైఫాయిడు జ్వరమని తేల్చారు. మందులు వ్రాసిచ్చారు.క్రమం తప్పకుండా వాడమన్నారు.
ఇలాఉండగా చలపతి నాన్నకు నోటినిండా పుండ్లు వచ్చాయి. బాగానీరసం పట్టుకుంది. ఈసంఘటనలు చూసి చలపతి బెంబేలెత్తిపోయాడు. తానున్న ఇంటిలో ఏదో దోషముందని అనుమానంతో మధనపడ్డాడు.ఇంటి నిర్మాణంలో మార్పులు చెప్పే నిపుణుడిని ఇంటికి పిలుచుకుని వచ్చాడు. ఆయనకు సకలమర్యాదలు చేశాడు.
తన సమస్యలు చెప్పాడు. తనఇంటిని పరిశీలించమన్నాడు.ఆయన ఇల్లంతటా కలియ తిరిగాడు. ఇంటి నిర్మాణంలో దోషముందన్నాడు.జరుగుతున్న సంఘటనలు దోషప్రభావంతోనే అన్నాడు.దోషం సరిచేయకుంటే ప్రాణాలకే ప్రమాదం రావచ్చన్నాడు. దోషం పోవడానికి ఇంటిలో చేయవలసిన మార్పులను సూచించాడు.ఆమార్పులు చేయడానికి మేస్త్రీని కూడా సూచించాడు. తాను సూచించిన మేస్త్రీని కలిసి తాను వ్రాసిచ్చిన ప్రకారం మార్పులు చేయించమన్నాడు. తన పారితోషికం రెండువేలు తీసుకుని వెళ్ళిపోయాడు.
మేస్త్రీని సంప్రదించాడు చలపతి. ఆయన వచ్చి ఇల్లు చూశాడు. మార్పులు చేయడానికి లక్షరూపాయలదాకా ఖర్చు రావచ్చన్నాడు.
విజయానందుడనే స్వామి పూజలు చేసి దోషాలు తొలగిస్తాడని ఎవరో చెబితే అక్కడకు పరుగెత్తాడు. తన కుటుంబంలో ఒకదానివెనుక ఒకటి జరుగుతున్న సంఘటనలను వివరించి చెప్పాడు.
"మీఇంటిలో పూజ చేయవలసి ఉంటుంది. లేకుంటే మరిన్ని దారుణాలు జరుగుతాయి. పూజాసామాగ్రి వెయ్యి రూపాయలవుతుంది. నాకు వెయ్యిరూపాయలు దక్షిణ ఇవ్వవలసి ఉంటుంది. మర్నాడు వస్తాను" అన్నాడు విజయానందస్వామి.గోరుచుట్టుమీద రోకలి పోటులా మార్పులకు, పూజలకు అయ్యే ఖర్చు తల్చుకుంటూ, దిగులుతో క్రుంగిపోతూ ఇల్లుచేరాడు చలపతి.    
ఇంట్లో చలపతి చిన్ననాటి మిత్రుడు శివరామ్ కనిపించాడు… మిత్రుడిని చూడగానే చలపతి ఆనందంగా "ఏరాశివా!బాగున్నావా?అందరూ క్షేమమేకదా!" అంటూ ఆప్యాయంగా పలకరించాడు. "పనిమీద పట్నానికొచ్చాను. రాక చాలా రోజులయింది కదా! చూసిపోదామని వచ్చాను" అన్నాడు.
కుశలప్రశ్నలయ్యాక భోజనం చేశారు. తర్వాత తీరిగ్గా కూర్చుని కబుర్లలో పడ్డారు.మాటలమధ్యన చలపతి శివరామునికి తనసమస్యలు ఏకరువుపెట్టాడు.గొలుసు పోవడం,తనకాలు చీముపట్టి ఇబ్బందులు పడటం,ఖరీదయిన ఆవు అకస్మాత్తుగా చనిపోవటం,ఇంట్లో అందరికీ జ్వరాలు రావటం,తన నాన్న నోటినిండా పుండ్లు రావడం,బాగా నీరసపడిపోవడం వివరించి చెప్పాడు.తాను చేయించబోయే ఇంటి మార్పులు,పూజల గురించి చెప్పాడు.
శివరామ్ స్వతహాగా తెలివైనవాడు. ఏసమస్యనైనా వాస్తవిక దృష్టితో చూస్తాడు.సమస్య మూలాలను అన్వేషించాడు.చలపతిని ప్రశ్నించి మరికొన్ని వివరాలు తెలుసుకున్నాడు. కళ్ళు మూసుకుని కొద్దిసేపు ఆలోచించాడు.
"ఒరే!చలపతీ వీటన్నింటికీ కారణం నీపిసినారితనమే!నీఇంటిముంగిట పూలచెట్లున్నాయి.పూలు అల్లటానికి నాసిరకం దారంచెండు కొన్నావు. ఆదారంతో బంగారు గొలుసు కొసలు కట్టావు. ఆడుకునే సమయంలో దారం తెగి గొలుసు ఎక్కడో పడిపోయి ఉంటుంది" అన్నాడు. "నిజమేరా!దారం నాసిరకమే!" అన్నాడు చలపతి.
"నీచెప్పులు ఒకసారి చూసుకో. పాతబడి బాగా అరిగిపోయి ఉన్నాయి. పిసినారితనంతో కొత్తచెప్పులు కొనలేకపోయావు.అరిగిన చెప్పుల్లోకి ముల్లు సులభంగా దూరి కాలులో దిగింది. డబ్బుఖర్చవుతుందని స్వంతవైద్యం చేశావు.చీముపట్టి వాచిపోయింది" అన్నాడు శివరామ్.
"నీవుచెప్పింది నిజమేరా!" అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ చలపతి "పిసినారితనంతో ఆవుకు తిండిపెట్టకుండా ఊరిమీదకు తోలేవాడివి. అది ఆకలితీరక ప్లాస్టిక్ కవర్లు తినటం జరిగింది. అవిజీర్ణంకాక క్రమంగా కడుపులో పేరుకుపోయి కడుపు వాచిపోయింది. అయాసంతో చనిపోయింది" అన్నాడు శివరామ్.
"నీవు చెప్పింది నిజమేరా!"అన్నాడుచలపతి
"ఓసారి నీభార్యాబిడ్డలు వాడే దోమతెరలు చూడు.పాతబడి రంధ్రాలు పడున్నాయి. ఆరంధ్రాలద్వారా దోమలు దూరి కుట్టడం వల్ల టైఫాయిడ్ వచ్చింది"  అని వివరించాడు శివరామ్.
"పిసినారితనంతో కొత్త దోమతెరలు కొనలేదు. చిల్లులుపడిన పాతదోమతెరలనే వాడుతున్నారు.నిజమే"అన్నాడు చలపతి.
"మీనాన్ననుంచి నీకు పిసినారితనం వచ్చింది.
మీనాన్న సరైన తిండి తినకపోవడంవల్ల పోషకాలు,బి12 విటమిన్ లోపించి రక్తహీనత ఏర్పడింది. దానికి చిహ్నమే నోటిలో పుండ్లు. నెలరోజులు మందులు వాడి రోజూ గ్రుడ్డు, పాలు వాడితే నయమవుతుంది.మీనాన్నను వైద్యుడికి చూపించు.మారాల్సింది నీబుద్ది. దోషం నీఆలోచనావిధానంలో ఉంది" అన్నాడు శివరామ్.
'వందలరూపాయలతో పోయేదానికి పిసినారితనంతో నిర్లక్ష్యంచేసి వేలు ఖర్చుచేసుకున్నాను.అమాయకంగా లక్షలు ఖర్చుపెట్టడానికి సిద్దపడ్డాను.' అంటూ సిగ్గుపడ్డాడు చలపతి.
మిత్రుడి సునిశిత పరిశీలనకు అబ్బురపడ్డాడు. అవసరమైనచోట పిసినారితనం మంచిది కాదని తెలుసుకున్నాడు.

కామెంట్‌లు