చెల్లెలి కోసం (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు

  రంగ 9వ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి చదువులో బాగా వెనుకబడేవాడు. అల్లరి బృందంతో తిరుగుతూ ఆటలతో కాలక్షేపం చేస్తూ చదువును నిర్లక్ష్యం చేసేవాడు. తల్లిదండ్రులు నిరుపేదలు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది. రంగ చెల్లెలు లలిత అదే పాఠశాలలో 6వ తరగతి చదువుతుంది. తరగతిలో అందరికంటే తెలివైన విద్యార్థిని. క్రమశిక్షణతో ఉపాధ్యాయుల మన్ననలను అందుకుంది. 
       రంగ తల్లి రంగను ఎన్నో రకాలుగా బతిమాలింది. చదువుకుని మంచి ఉద్యోగం సాధిస్తే మన కష్టాలన్నీ గట్టెక్కుతాయని బతిమాలింది. అయినా కొడుకులో మార్పు శూన్యం. రంగ ఇప్పుడు 10వ తరగతిలోకి వచ్చాడు. రంగ తల్లి తన కూతురిని చదువు మానిపించి కూలి పనిలో పెట్టింది. ప్రతిరోజూ చెల్లెలితో కలిసి వెళ్ళే రంగకు ఇప్పుడు చెల్లెలు వెంట లేకపోయేసరికి చాలా వెలితిగా అనిపించింది. విచారం ఎక్కువైంది. పైగా ఉపాధ్యాయులు అంతా ప్రశ్నిస్తున్నారు. లలిత ఎందుకు పాఠశాలకు రావడం లేదని. లలిత స్నేహితులు కూడా అడుగుతున్నారు. పైగా లలిత లేకపోతే తమకు చాలా బాధగా ఉందని కూడా చెప్పారు. ప్రతిరోజూ చెల్లెలి గురించి అందరూ అడగడంతో తన చెల్లెలు పాఠశాలలో ఎంత మంచిపేరు సంపాదించిందో అర్థం అయింది.
       "అమ్మా! చెల్లెలిని ఎందుకు బడి మానిపించావు?" అని ప్రశ్నించాడు రంగ. "నువ్వు కష్టపడి చదివి, మంచి మార్కులు తెచ్చుకుంటే వచ్చే సంవత్సరం మంచి కాలేజీలో ఎక్కువ ఫీజు చెల్లించే అవసరం లేకుండా సీటు వస్తుంది. కానీ నువ్వు ఇలాగే చదివితే బాగా ఫీజు కట్టాల్సి వస్తుంది. దాని కోసం డబ్బులు కూడబెట్టాలి కదా! అందుకే పరిస్థితి అర్థం చేసుకొని నీ చెల్లెలు కూడా నాతో కూలిపనికి వస్తుంది." తన నిర్లక్ష్యపు చదువుతో ఉద్యోగం సాధిస్తానన్న నమ్మకం లేదు. తన చదువు కోసం చదువులో సరస్వతి అయిన తన చెల్లెలు తన చదువునే త్యాగం చేసిందా అని అనుకున్నాడు రంగ. తన మీద తనకే అసహ్యం వేసింది. "అమ్మా! ఇప్పటి నుంచి బాగా కష్టపడి చదువుతా. నువ్వు మంచి కాలేజీలోనే నన్ను చేర్పించే విధంగా మంచి మార్కులు తెచ్చుకుంటా. చెల్లెలిని బడికి పంపమ్మా! లేకపోతే నేను చెల్లెలి చదువు కోసం నీతో పాటు కూలి పనికి వస్తా." అన్నాడు రంగ. "మా నాయనే! చెల్లెలిపై ప్రేమతో నీలో ఎంత మార్పు వచ్చింది? రేపటి నుంచి లలిత నీతో పాటు బడికి వస్తుంది." అన్నది తల్లి. సంతోషించాడు రంగ.  

కామెంట్‌లు