హరివిల్లు-నెలవంక:- సత్యవాణి

  ముంబాయిలో ఉండే ఏడేళ్ళ  శుశృత్ అమ్మా నాన్నలతో కలసి ఊహ వచ్చేకా నానమ్మగారి ఊరు రావడం యిదే మొదటిసారి.
     అసలు ఆ పల్లెటూరేకాదు,నానమ్మను తాతయ్యనూ శుశృత్కి చూపించడంకూడా ఇదే మొదటిసారి.
        శుశృత్ తల్లితండ్రులు  హరి,హరితలవి ముంబాయిలో మంచి మంచి ఉద్యోగాలు.హరిత తల్లితండ్రులుకూడా ముంబాయిలో ఉద్యోగస్తులే.
     హరి,హరిత ఒకే ఆఫీసులో పనిచేస్తున్న సందర్భంలో అయిన పరిచయం ,పెళ్ళివరకూ దారితీసి,శుశృత్ని భూమిపైకి తెచ్చేదాకా వెళ్ళింది.
       హరి గ్రామీణ వాతావరణంనుండి బాగా చదవుకుని ,ఉద్యోగార్ధంముంబాయికి చేరాడుకానీ,హరిత పుట్టుక,పెరుగుదల,ఉద్యోగం,చివరకు హరిని పెళ్ళిచేసుకొన్న తరువాత కాపురం కూడా ముంబాయే. ఆమె పెళ్ళైన ఎనిమిదేళ్ళలో ఒకేఒకసారి భర్త హరితో కలిసి పల్లెటూరైన ఆత్తవారూరు వచ్చిందికానీ,ఆమెకు ఆపల్లె, అశుభ్రంగా కనిపించింది. అత్తమావలతోపాటు ,ఆ ఊరి జనులంతా అనాగరికంగా,మోటుగా కనిపించడంవలన మరలా ఎన్నడూ పల్లెటూరైన అత్తవారింట కాలుపట్టలేదు.హరే వీలైనప్పుడల్లా పల్లెకువెళ్ళి,తల్లితండ్రులను చూసిరావడమేకాకుండా,వారి అక్కరలు కూడాతీర్చివస్తాడు.మనవడిని చూడలేదనే మచ్చటను ,వీడియోలద్వారా,ఫోటోలద్వారా తీరుస్తున్నాడు హరి తన తల్లితండ్రులకు..
      అయితే శుశృత్ కి మాత్రం  కథచెప్పమన్నప్పుడల్లా తనపల్లె గురించీ,అక్కడవున్న తన తల్లిదండ్రులగురించీ,తమవాకిట్లో చెంగుచెంగున గంతులేసే లేగదూడలగురించీ చెప్పగా, ఆసక్తిగా వింటున్న శుశృత్ ఏదోఒకరోజు తప్పక పల్లెకు వెళదామంటాడన్న హరి   ఆశ తొందరలోనే నెరవేరింది.
         కొడుకు శుశృత్ మంకు పట్టుపట్టడంతో హరితకూడా కాదనలేక పల్లెకు వచ్చింది.తనకొడుకూ,కోడలూ,మనవళ్ళరాక హరితల్లితండ్రులకు అమితమైన ఆనందంకలిగించింది.
       హరితకూడా బాగానే కొడుకుతోపాటుగా పల్లెసొగసులను ఆస్వాదిస్తోంది.లేగదూడల ఉరుకులు పరుగులు చూసి
ముచ్చట పడుతోంది.
         ఎండ ,ఎండ లాకాస్తుండగానే వాన పడుతుంటే,ఉసిరి కాయలంత వగళ్ళు పడడం ,ఆవానలో తడవడం బలేవుంది శుశృత్ కి.కొడుకును వద్దు, తడవద్దంటూనే హరి, హరితా కూడా తడసి ముద్దవుతూనే ,వడగళ్ళు ఏరడం మొదలుపెట్టారు.
        అంతలోనే ",నాన్నా !
అటు చూడు,కలర్స్  కలర్స్ 
 గా ఎంతబాగుందో!" ఉద్వేగంగా కొడుకు చూపించినవైపుగా చూసిన హరి "చిన్నా!దాన్ని 'హరివిల్లంటారు.వర్షం చినకులపైన సూర్యుడి కిరాణాలు పడినప్పుడు ఇలాంటి హరివిల్లు వస్తుందన్నమాట"హరి చెపుతున్నాడు.
       "నాన్నా! హరివిల్లులూ-నెలపొడుపులూ మన ఊరిలో ఎందుకు రావు?"అడిగాడు శుశృత్ బుంగమూతి పెట్టి.
      "వస్తాయి చిన్నా! ఎందకురావు?మనం భూమిపైన కాకుండా,ఆకాశమంతెత్తులోవున్న అపార్ట్ మెంటులో వుంటాము కదా!అందుకనే మనకు హరివిల్లులూ,నెలపొడుపులూ కనిపించవు.అంతేకాదు కన్నా!మనకు నిండుపున్నమిలూ,పండువెన్నెలలూ కూడా కనిపించవు."అంటూ హరి హరిత మొఖంవంక చూశాడు.హరిత తలవంచుకొంది.
   
               
కామెంట్‌లు