అశ్వనీదత్తుడికి తను ఎంతో తెలివి బలం గల రాజుని అనే గర్వం అహంకారం ఉండేవి. ఒక సారి మారుమూల ప్రాంతం లో చిన్న విద్రోహం జరిగింది. ఇంకేముంది?ఇలాంటి కుట్రకుతంత్రాలు ఆదిలోనే అణచివేయాలి మిగతా సామంతుల గుండెల్లో గునపాలుగుచ్చి తనంటే భయభక్తులు పెరిగేలా చేయాలనుకున్నాడు.అందుకే వర్షాకాలంలో సర్వసైన్యంతో నలువైపులా ముట్టడించాలని బైలుదేరాడు. ఆరాత్రి అతని సైన్యం ఒక అడవిలో బసచేసింది.గుర్రాలు బాగా అలసిపోయాయి.భటులు వాటికి గుగ్గిళ్లు దాణా సిద్ధం చేశారు. కాగడా వెలుగులో రాజు పరిసరాలను పరిశీలిస్తున్నాడు.ఒక కోతి చెట్టుదిగి ఒక గుర్రం ముందున్న గుగ్గిళ్లను గుప్పిటినిండా తీసుకుని చెట్టు ఎక్కుతుండగా చేతిలోని కొన్ని గుగ్గిళ్లు కింద పడ్డాయి.కొమ్మపై కూచుని నోటి లో కుక్కుకోటంలో దాదాపు అన్నీ కింద పడి నోటి లో ఉన్న వాటిని కరకరలాడించసాగింది."చూశావా సేనానీ!ఆకోతి ఎంత తెలివితక్కువదో?అత్యాశకు పోయి గుప్పిటి నిండా గుగ్గిళ్లు తీసుకుని దాదాపు అన్నీ చేజార్చుకుంది.నోటిలో ఉన్నవే నములుతోంది."సేనాని నర్మగర్భంగా అన్నాడు"ప్రభూ!అది ఒక సామాన్య కోతి.
నోటి నిండా గింజలు ఉంచుకుని చెట్టు ఎక్కితే బాగుండేది.కానీ రెండు చేతులనిండా తీసుకుని చెట్టు ఎక్కుతూ ఎక్కినాక అంతాఒలకబోసుకుంది.తన శక్తి సామర్థ్యంని గూర్చి సరైన అవగాహన దానికి లేదు. పూర్తిగా నష్టపోయింది."అతని మాటలోని అంతరార్ధంని మంత్రి గ్రహించాడు. అందుకే రాజుతో ఇలా అన్నాడు "ప్రభూ!మనం వాతావరణం సరిగ్గా లేనప్పుడు దండయాత్ర కి బైలుదేరాము.ఆమారుమూల ప్రాంతాల పై దృష్టి పెడితేచాలు.మిగతా సామంతులను భయపెట్టి లొంగదీసుకోవాలని ప్రయత్నం చేస్తే మనం నష్టపోటం ఖాయం.తెల్లారగానే మన రాజ్యానికి తిరిగివెళ్లిపోదాం"రాజు ఆలోచనలో పడ్డాడు. సరిగ్గా అప్పుడే పెద్ద కొమ్ములున్న దుప్పి రాజు కంట పడింది. దాన్ని వేటాడాలని రాజు ఆవెనుక సేనాని బైలుదేరారు.దుప్పి వేగంగా పరుగుతీస్తోంది."అమ్మో!"అనిగావుకేకవేసి రాజు ఊబిలోకి కూరుకు పోసాగాడు.సేనాని అతన్ని బైటికి లాగే యత్నం లో తనూ ఊబిలో కూరుకు పోతూ చేతికి అందిన చెట్టుకొమ్మ పట్టుకుని పైకి ఎగబ్రాకాడు.అక్కడున్న గట్టి తీగలను రాజు పై విసిరాడు. "ప్రభూ!వీటిని పట్టుకుని పైకి ఎగబాకండి.నేనూ మిమ్మల్ని పైకి లాగుతాను."ఆ ఇద్దరూ ఇలా తంటాలు పడుతుండగా ఆదుప్పి అక్కడ ప్రత్యక్ష మైంది. "రాజా!నీవు నాకు అపకారం తలపెట్టినా నిన్ను కాపాడాలనే వచ్చాను.నీ ప్రాణం ముఖ్యం.నాకొమ్ములను గట్టిగా పట్టుకో!నావీపు పైకి ఎగబాకు". అంతే రాజు అలాగే చేసి తన ప్రాణాలు దక్కించుకున్నాడు.పైనుంచి సేనాని దిగి ఆదుప్పి కి కృతజ్ఞతలు తెలిపాడు.రాజు ని కాపాడిన దుప్పి తన దోవన తాను పోయింది. "ప్రభూ!ఈ పశుపక్ష్యాదులలో ఉన్న జాలి దయ పరోపకారం మనుషుల లోనే కరువు అవుతోంది. ఆదుప్పి నిజంగా పరమాత్మ యే! పర్యావరణం అడవులను కాపాడకపోతే మనిషికి మనుగడ లేదు." రాజు తన తొందరపాటు కి వగచాడు.అడవిజంతువులు నేర్పిన గుణపాఠం తో బుద్ధి తెచ్చుకుని సరిహద్దుల్లో ఉన్న సామంతులతో మంచి గా స్నేహం గా ఉండాలని నిశ్చయించుకున్నాడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి