మనసుతో కూడా పాఠాలు చెప్పే పంతులమ్మ ఉమాదేవి గారు; పద్మ . ఎం . వి. ఎస్.


 పల్లెలెప్పుడూ ప్రభుత్వం చేత దగా పడుతూనే ఉన్నాయి. పట్టించుకునే నాథుడే లేక చిన్నబోతున్నాయి. పట్టణాల పక్కనే ఉన్న పల్లెల పరిస్థితే అలా ఉంటే, ఎక్కడో దూరంగా ఉండే తండాల పరిస్థితి? ఎలా ఉంటుదో మనం ఊహించుకోవచ్చు. ఎన్నికల వేళ అయినా, రా.నా లకు తండాల ప్రజలు గుర్తుకొస్తారో లేదో మరి. అక్కడి ప్రజలు--వారేమో, వారి బ్రతుకేమో.. అంతటా కమ్ముకున్న నిరక్షరాస్యత, నైరాశ్యత.  తండా బ్రతుకుల్లో ఎప్పటికీ చీకట్లే. అటువంటి రోజుల్లో భాసిత్ నగర్ తండాలో ఒకానొక ఉదయం,-- ఉషోదయం కాదు, "ఉమోదయం" అయింది. ఆ పల్లెకు వెలుగొచ్చింది. అక్కడి పిల్లల జీవితాలకు ఒక గతి తెచ్చింది. 
మనందరం ఆదాయం కోసం పని చేస్తున్నాం. మనందరిలో అమ్మ ఉంది. అమ్మ మనసు ఉంది. జీతం తీసుకుని పనిచేస్తే టీచర్ అంటారు. మనసు పెట్టి పనిచేసి, విద్యార్థుల భవిష్యత్తును తీర్చి దిద్ది, వారి బాగోగులను చూసే ఉపాధ్యాయురాలిని "టీచరమ్మ" అంటారు. మరి బడి పిల్లల్నీ, వారి బ్రతుకులనీ, వారితో పాటు వారి తల్లితండ్రుల బాగోగులనూ, ఊరి బాగు కోసం కూడా పరితపించే వ్యక్తిని" ఉమాదేవి" అంటారు. 
ఉమాదేవి గారు ఆమె సర్వీస్ అంతా చిన్న చిన్న పల్లెటూర్లు, తండాలలోనే పని చేసారు. ఆవిడ వృత్తి బోధనే. ప్రవృత్తి "అమ్మతనం". ఆ బడి పిల్లలను ఆవిడ ఎంత ప్రేమిస్తారో అనడానికి నిదర్శనం, ఆ బడి పిల్లల తో ఆవిడ ప్రయాణం గురించిన విశేషాలు కలబోసుకున్న "మా పిల్లల ముచ్చట్లు" పుస్తకం. చూడండి, పేరులో కూడా బడిపిల్లలు అనే మాట కాకుండా,  'మా పిల్లలు' అనే చెప్పారు. ఆ పిల్లలను తన సొంత పిల్లల్లాగా అంతగా ప్రేమించారు. అదీ ఆవిడలో విశేషం. 
ఇక పుస్తకం విషయానికి వస్తే, దాదాపు 240 పేజీల పుస్తకంలో 220 అనుభవాలు--కొన్ని మనసును ఊయలలూగించేవి, కొన్ని కళ్ళు చెమర్చేవీ, కొన్ని మనసును మెలిపెట్టేవీనూ. ప్రతి కథతో పాటు  (వీటిని కథలనొచ్చా, ఇవి కొన్ని జీవితాలతో ముడిపడి ఉన్న జ్ఞాపకాలు.. మనసును తాకిన అనుభవాలు ) పంచుకున్న కొన్ని చాయా చిత్రాలు మనని కూడా భాసిత్ నగర్ కి తీసుకెళ్ళిపోతాయి. పుస్తకం చివరికి ఆ పిల్లలందరూ మనకి పరిచయం అయిపోతారు. వాళ్ళందరూ సిరిసిరి చిరు నవ్వులతో మనింట్లో మన చుట్టే తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. అంతలా ఆ ఊరితో మమేకం అయిపోతాము.  
పల్లె చదువుల గురించి చెప్పేదేముంది? అరకొర సౌకర్యాలు, చాలీ చాలని బ్రతుకులు, తాగుబోతు తండ్రి చేతుల్లో కష్టాలు పడుతున్న అమ్మలు-వారి బాధ చూడలేక, పైకి చెప్పుకోలేక కన్నీళ్ళను దాచుకొని, వెతలను దిగమింగుతున్న పసి జీవితాలెన్నో.. పసివయసులోనే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు, మళ్ళీ గొర్రెతోక ఆదాయాలు, వచ్చిన కొంచెం ఆదాయాన్ని మాయం చేసే వ్యసనాలు.. అక్కడి జీవిత చిత్రం ఇదే.  కానీ బాధల్లో ఉన్న పిల్లలందరికీ వారి వేదన పంచుకోవడానికి బళ్ళో ఒక అమ్మ ఉంది. సాంత్వన ఇచ్చే ఒక మనసుంది.. ఆమే ఆ టీచరమ్మ. తాగుబోతు తండ్రిని చంపేయాలన్నంత కోపం, టీచరమ్మ ఒడిలో సేదదీరగానే ఎక్కడికో పోతుంది. చావుబ్రతుకుల్లో ఉన్న తల్లి గురించిన దిగులు పడే చిన్ని మనసు టీచరమ్మ మాటలతో కుదుటపడుతుంది. ఇలా ఆ పిల్లలకు ఆమే దైవం. ఆమే స్నేహితురాలు. ఆమే తోడూ నీడ. 
ఒక టీచరుగా మెదడుతోనే కాక, మనసుతో కూడా పాఠాలు చెప్పే పంతులమ్మ ఉమాదేవి గారు. పిల్లలలోని ప్రావీణ్యాన్ని గుర్తించడంలో దిట్ట. నిజంగా ఆ పిల్లలు ఎన్ని కళాకృతులు చేస్తారనీ-- పట్నాల్లో దొరికే ఫ్లవర్ బొకేలు ఈ పిల్లలు చేసే పూలగుత్తులకు సాటిరావు. స్థానికంగా దొరికే, దేవదారు మొదలగు పూలగుత్తులతో ముచ్చటైన గుత్తులు తయారు చేసే వారి ప్రజ్ఞను మెచ్చుకొని తీరవలసిందే. స్వాతంత్ర్య దినోత్సవానికి వారి ప్రావీణ్యం బైటపడుతుంది. వారిలో ఎందరో మహా నటులు ఉన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవానికి టీచర్లను అనుకరించి బహుమతులతో వారి మనసులు కూడా గెలుస్తారు. 
తండాలో అందరికీ కొద్దో గొప్పో  చేను ఉంటుంది. ప్రత్తి, మిర్చి అక్కడి ప్రధాన పంటలు. కూలీలను పెట్టుకునే స్థోమత లేక, కుటుంబ సభ్యులే పొలం పని అంతా చూసుకోవాలి. పండిన పంటను కోసి, ఇంటికి తీసుకెళ్ళేవరకు క్షణ క్షణం అప్రమత్తంగా ఉండాలి. పిల్లలకు బడిని వదిలి చేను బాట పట్టక తప్పదు. 
తల్లి తండ్రులు చేనుకు వెళ్ళిపోతే, పసి పాపలను సంరక్షణా భారాన్ని పెద్ద పిల్లలు మోయక తప్పదు. వారందరూ "పసి తల్లులు." 
బళ్ళో జరిగే ఉత్సవమో, వనభోజనాలో, ఒక పిక్నిక్కో ప్లాన్ చేసినప్పుడు, పిల్లలకు ఎదురయ్యే ప్రధాన సమస్య డబ్బు. టీచర్లు కొంతవరకు వారి సొంత డబ్బులు వేసుకున్నా, పిల్లల కంట్రిబ్యూషన్  కూడా తప్పదు. ఆ పిక్నిక్ సరదాను పోగొట్టుకోలేక, పిల్లలు నాలుగు రోజులు  చేనులో పనిచేసాక, ఆ వచ్చే డబ్బులతో పిక్నిక్ వెళదామని ప్లాన్ చేసుకోవడం గుండెను పిండేస్తుంది. మన దగ్గర ఊరికే పడి ఉన్న డబ్బు చిత్తుకాగితాల్లా తోస్తుంది మనకు ఆక్షణం. 
ఇంకా అక్కడ జరిగే స్థానిక తండా పండగలు, బొడ్రాయి,బతుకమ్మ సంబరాలలో పిల్లలతో పాటు పెద్దలు కూడా అక్కడి టీచర్లను భాగస్వామ్యులను చేసే వృత్తాంతాలు మనం చాలా ఆనందాలను మిస్ అయ్యాం అనే భావన కల్పిస్తాయి. 
పిల్లల ముచ్చట్లు చదువుతున్నంత సేపు సిటీ పిల్లలకు, పల్లె పిల్లలకు మధ్య ఉన్న తేడా మనసులో మెదులుతూనే ఉంటుంది. కష్టాల మధ్య పెరుగుతూ, దిగుళ్ళతో సహవాసం చేసే పిల్లలందరూ జీవిత పోరాటాన్ని ఎదుర్కునే సాహసులే. వారి ఆలోచనా సరళి, వారి ఆత్మీయత ప్రత్యేకం. చెల్లినో, తమ్ముడినో, అమ్మానాన్న లాగా ప్రేమగా సాకడం, వారి గురించి తపన పడడం కళ్ళు చెమర్చే అనుభవాలు. ఒక సంపత్, ఒక రోబో, వీరిని మనం తెచ్చుకుని పెంచుకోవాలనిపిస్తుంది. 
పిల్లల గురించి కబుర్లు మాత్రమే చెప్పి వదిలేయలేదు రచయిత్రి. దేశంలోని ప్రతి  మారుమూల పల్లెలోని ప్రతి ఒక్క పిల్ల/పిల్లవాడికి చదువుకునే హక్కు ఉంది. వేదికలపై ఎన్నో వాగ్దానాలు చేసే ప్రభుత్వాలు ఆ చదువు కొనసాగించేందుకు తగిన సౌకర్యాలను ఎందుకు కల్పించరు అని ప్రశ్నిస్తారు ఉమాదేవి. ప్రశ్నించడమే కాదు, ఆవిడ సర్వీసులో ఉపాద్యాయులు, పిల్లలు ఎదుర్కొన్న ఎన్నో సమస్యలకు పరిష్కారం కూడా సూచిస్తారు. కానీ చిత్తశుద్ధితో విని,  అమలు చేసే నాయకులు రావాలి కదా!
సర్వీసులో ఉండగానే, వివిధ సేవాసంస్థల వారిని సంప్రదించి ఆ బడికి, పిల్లలకు ఎన్నో సమకూర్చారు ఉమాదేవి గారు. పదవీ విరమణ చేసి రెండేళ్ళయినా, ఆ సేవాసంస్థలతో ఆవిడ ప్రయాణం ఆపలేదు. ఇంకా పిల్లలకు ఏదో ఒకటి చేయాలనే తపన ఆమెకు తగ్గలేదు. అసలు ఇలాంటి ఉపాధ్యాయులకు పదవీ విరమణ లేకుంటే బాగుంటుంది కదా. కొన్ని తరాలు బాగుపడతాయి. కొన్ని తండాలు బాగుపడతాయి. వృత్తిరీత్యా భాసిత్ నగరే కాకుండా, కాచారం, ముత్యాలంపాడుల్లో కూడా పనిచేసిన ఈ టీచర్, తాను అడుగుపెట్టిన ప్రతి ఊళ్ళోనూ పిల్లలను తన ఆత్మకు దగ్గరగా చేర్చేసుకున్నారు. ఒక కార్యక్రమం కొరకు భాసిత్ నగర్ స్కూల్ కి నేను కూడా వెళ్ళడం జరిగింది. ఖమ్మం నుంచి ఆ ఊరు వెళ్ళేవరకు దారిలో ఉన్న ప్రతి చెట్టూ, పిట్టా జ్ఞాపకమే ఆవిడకు. ఆ పిల్లలతో కొన్ని గంటలు గడిపిన మధురానుభూతి నాకూ దక్కింది.. ఆ భావనామయ సాగరంలో ఒక్క చిన్న గరిటెడు అనుభూతులు నేను కూడా తోడి తెచ్చుకున్నాను. 
ఈ పిల్లల జీవితాల్లో, ఊరిలో జరిగిన కొన్ని సంఘటనలను ఆవిడ తన "రేలపూలు" పుస్తకం లో కూడా ప్రస్తావించారు. చదువరులకు రెండు పుస్తకాలూ రెండు చేతుల్లో పట్టుకుని చదివినట్టు అనుభూతి కలుగుతుంది. 
220 అనుభూతులను ఇలా చిన్నగా ఒక్కసారిగా చెప్పటం అసాధ్యం. అయితే, ఇది పుస్తక సమీక్ష కాదు. పుస్తక పరిచయం మాత్రమే. ఇప్పటికే పనుల ఒత్తిడి వల్ల కొంచెం ఆలస్యంగా పరిచయం చేస్తున్నాను. పుస్తకం తొలి పుటల్లో రచయిత్రి మనందరినీ ఆహ్వానిస్తారు, " కాసేపు మా పల్లె బడిలో విహరిద్దాము, మా పిల్లలతో కాస్సేపు గడుపుదాము" అని. అయితే, ఆ పిల్లలు ఆ కాసేపటిలో వారిని మర్చిపోనివ్వరు. మన హృదయల్లో స్థానం ఏర్పరిచేసుకుంటారు.  వాళ్ళ నవ్వులు మనని వెంటాడుతూనే ఉంటాయి. వాళ్ళ ఆత్మీయతకు మనం కట్టుబడిపోతాము. వాళ్ళలా మనం స్వచ్చంగా లేము ఎందుకని అని మనని మనం ప్రశ్నించుకునే స్థాయికి మనను తీసుకొచ్చేస్తారు ఆ నందివర్ధనాలు. అవును. నందివర్ధనాలే. అదో పూల వనం. మల్లెలూ, కనకాంబరాలు, నదివర్ధనాలు.. నిష్కల్మషమైన నవ్వులు రువ్వే పువ్వులే అన్నీనూ. వారి వద్దకు చేరే అంగన్వాడీ సీతాకోక చిలుకలు కొన్ని.. వారందరినీ చూసి మురిసే ఆ "వనమాలి ఉమాదేవి గారు. అందుకే, రండి, మనం కూడా ఆ పూలతోటలో విహరించి వద్దాం. మనం మనుషులమైతే, ఆ నిష్కాపట్యాన్నీ, ఆ స్వచ్చమైన ఆప్యాయతనీ అలవరుచుకుందాం.
కామెంట్‌లు