తమిళ సినిమాలో తొలి నేపథ్యగాయని-పెరియనాయగి;-- యామిజాల జగదీశ్
 తమిళ సినిమాలో మొట్టమొదటి నేపథ్య గాయనిగా చరిత్ర పుటలకెక్కినవారు పి.ఎ. పెరియనాయగి (తమిళంలో క అక్షరాన్నే గా కూడా పలుకుతారు. పెరియనాయకి అని రాసినా పలికేటప్పుడు పెరియనాయగి - பெரியநாயகி అంటారు)
1927 ఏప్రిల్ 14వ తేదీన తమిళనాడులోని 
కడలూర్ జిల్లా బన్రుట్టి సమీపాన గల తిరువదిగై అనే గ్రామంలో ప్రముఖ గాయకురాలు ఆదిలక్ష్మికుమార్తెగా జన్మించారు పెరియనాయగి. ఈమె తల్లిని ఆరోజుల్లో బన్రుట్టి అమ్మాళ్ అని పిలిచేవారు. పెరియనాయగి చివరిబిడ్డ. ఈమెకు ఒక అన్నయ్య (బాలసుబ్రమణ్యన్), అక్కయ్య (రాజామణి) ఉన్నారు.
ఆదిలక్ష్మి తన ముగ్గురు పిల్లలతో కలిసి కొంతకాలం శ్రీలంకలో నివసించి కచ్చేరీలు చేశారు. అయితే అరోగ్యం దెబ్బతిని ఆదిలక్ష్మి  తన పిల్లలతో శ్రీలంక నుంచి చెన్నై చేరారు.
చెన్నై తిరువల్లిక్కేణిలో సిఎస్ఎం పాఠశాలలో ఏడవ తరగతి వరకూ చదువుకున్న పెరియనాయగి తన తల్లి దగ్గర, పత్తమడై సుందర అయ్యర్ దగ్గర కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించి వేదికపై కచేరీలు చేశారు.
1940లో తన సోదరి రాజామణి నటించిన ఊర్వశియిన్ కాదల్ అనే సినిమాలో పెరియనాయగికి కూడా నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమాలో పెరియనాయగి గంధర్వ కన్య పాత్రలో నటించారు. అనంతరం, సభాపతి, పంచామృతం, ఎన్ మనైవి, వేదాళ ఉలగం, గూండుక్కిళి, మనోన్మణి, మగమాయ, ప్రభావతి, కృష్ణభక్తి, గీత కాంతి, ధర్మవీరన్, శివలింగ సాట్చి, తదితర సినిమాలలో నటించారు.
ఏవీఎం వారు ఎ.టి. కృష్ణసామి దర్శకత్వంలో నిర్మించిన సభాపతి సినిమాలో ఒక వేదికమీద కచ్చేరీ చేస్తున్నట్టు ఓ సన్నివేశం. ఈ సినిమాలో పెరియనాయగి రెండు పాటలు పాడే అవకాశమిచ్చారు.
రుక్మింగధన్ సినిమాలో పెరియనాయగి నారదుడి పాత్ర పోషించారు. కృష్ణభక్తి చిత్రంలో సత్యభామగా నటించారు.
1947లో ఏకంబవానన్ చిత్రంలో కథానాయికగా నటించిన పెరియనాయగి ఊహించని రీతిలో నేపథ్యగాయనిగా మారారు.
ఆరోజుల్లో సినిమాలలో ప్రత్యేకించి నేపథ్యగాయకులంటూ ఎవరూ లేరు. ఎవరికివారు పాడవలసిందే. నకనుక నటీనటులకు రాగయుక్తంగా పాడటం తెలిసుండాలనేది ఆరోజుల్లో ఓ ప్రత్యేక అర్హత. అయితే ఈ దశలో పెరియనాయగి నేపథ్యగాయనిగా అవతరించాల్సి వచ్చింది.
ఎవిఎం సంస్థ 1945లో  "శ్రీవల్లి" అనే సినిమాను నిర్మించింది. ఈ సినిమాలో టి.ఆర్. మహాలింగం, రుక్మిణీదేవి జంటగా నటించారు. సినిమా అంతా ముగిసిన తర్వాత ఎ.వి.మెయ్యప్ప చెట్టియార్ మొత్తం సినిమాను చూసారు. అయితే ఆయనకు తృప్తిగా అనిపించలేదు. టి.ఆర్. మహాలింగం స్థాయిలో కథానాయిక రుక్మిణీదేవి పాడలేకపోయారని ఆయనకు అన్పించింది. దాంతో ఏం చేయాలని ఆలోచించారు. ఆ సమయంలోనే సభాపతి అనే సినిమా విడుదలైంది. ఈ సినిమాలో పెరియనాయగి పాట పాడారు. అదీనూ నటిగా కాక కచేరీ చేస్తున్నటువంటి సన్నివేశంలో పెరియనాయగి రెండు పాటలు పాడారు. ఆ సన్నివేశమూ, పాటలు రెండూ జనం మధ్యలో ప్రసిద్ధిపొందాయి. దాంతో మెయ్యప్ప చెట్టియార్ శ్రీవల్లి సినిమాలో  ఆమెతో పాడించాలని నిర్ణయించుకున్నారు.
కథానాయిక రుక్మిణి గొంతుకు బదులు పెరియనాయగి స్వరంతో పాడించాలనుకున్నారు. అయితే ఎందుకైనా మంచిదని రుక్మిణి స్వరానికి పెరియనాయగి స్వరం సరిపోతుందా అనే శ్రీనాసన్ తో చర్చించారు.
అప్పుడే ముందుగానే రికార్డయిన స్వరాన్ని చెరిపి దాని మీద మరొక స్వరం నమోదు చేసే సాంకేతిక పరిజ్ఞానం ముంబైలో ప్రవేశపెట్టిన విషయం మెయ్యప్ప చెట్టియార్ కి తెలిసింది. అంతే, అనుకున్నదే తడవుగా శ్రీనివాసన్ ని ముంబైకి పంపించి ఆ సాంకేతికత గురించీ తెలుసుకురమ్మని పంపించి, రుక్మిణి పాడిన పాటను చెరీపి దానికి బదులు పెరియనాయగితో పాట  పాడించి రికార్డు చేశారు. ఈ విధంగా తమిళంలో మొట్టమొదటి నేపథ్యగాయనిగా పెరియనాయగి పేరు చరిత్రపుటలకెక్కింది. 
పెరియనాయగి 1990 జూన్ ఎనిమిదో తేదీన కన్నుమూశారు.
కామెంట్‌లు