మహేంద్రజాలం (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు
   మహేంద్ర ఆ తరగతిలో మొదటి ర్యాంకు విద్యార్థి. ఎప్పుడూ చదువు ధ్యాసలోనే ఉంటాడు కానీ ఆటల జోలికి వెళ్ళడు. తోటి మిత్రులు కొంతమంది ప్రతిరోజూ సాయంత్రం వేళ రెండు గంటలు, సెలవు రోజుల్లో రోజంతా ఆటల ఆడేవారు. మహేంద్రను కూడా తమతో ఆడమని ఎంతగానో బతిమాలేవారు. కానీ మహేంద్ర ఆడకపోయేవాడు. 
       ఒకరోజు మహేంద్ర తాను ఆడకున్నా మిత్రులు ఆడే ఆటను చూడటానికి వెళ్ళాడు. డబ్బులు పెట్టి ఆడుతున్నారని తెలిసి అది తప్పని చెప్పాడు. "నువ్వు ఆడటం లేదు కదా! నీకు అనవసరం." అన్నాడు నితీశ్. అందరూ పగలబడి నవ్వారు. ఒకరోజు మహేంద్ర తాను కూడా ఆడతానని అన్నాడు. తానూ డబ్బులు పెట్టి ఆడతానని ఓడిపోతే డబ్బులన్నీ ఇస్తానని, గెలిస్తే డబ్బులతో పాటు తనతో ఆడేవారంతా వచ్చే రెండవ శనివారం, ఆదివారం తాను చెప్పిన ఆటలన్నీ ఆడాలని షరతు పెట్టాడు. ఎప్పుడూ ఆడని మహేంద్రను చిత్తుగా ఓడించవచ్చు అనే ఆలోచనతో అందరూ ఒప్పుకున్నారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ మహేంద్ర అందరి మీద గెలిచాడు. అందరూ డబ్బులు ఇచ్చుకోవాల్సి వచ్చింది.
         మహేంద్ర ఆ డబ్బులతో ఒకనాడు బాగా ప్రాచుర్యం పొంది, ఇప్పుడు ఎవరూ పట్టించుకోని గ్రామీణ క్రీడలకు సంబంధించిన ఆట వస్తువులను కొనుక్కుని, తయారు చేసుకొని వచ్చాడు. ఆ రెండు సెలవు రోజులూ గిల్లిదండ, సీసం గోళీలు, తాడు బొంగరం, కోతి కొమ్మచ్చి ఇంకా చాలారకాల ఆటలను ఆడించాడు. మిత్రుల అందరికీ భలే వినోదం కలిగింది. అందరూ మహేంద్రకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ప్రతిరోజూ ఈ ఆటలనే ఆడుదాం అన్నారు. అప్పుడు మహేంద్ర "ఆడుదాం కానీ కొన్ని షరతులు ఉన్నాయి. ప్రతిరోజూ గంటసేపు మాత్రమే ఆడాలి. సెలవు రోజుల్లో ఓ రెండు మూడు గంటలు ఆడుదాం. కానీ డబ్బులు పెట్టి ఆడవద్దు. చదువును అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ముందు చదువుకు ప్రాధాన్యత ఇద్దాం. శారీరక మానసిక వికాసం కోసం ఆటలు ఆడుదాం." అన్నాడు మహేంద్ర. సరేనన్నారు అందరూ.

కామెంట్‌లు