ఏనుగు వైద్యం (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు
     ఆ అడవిలో ఏనుగు కొత్తగా వైద్యం నేర్చుకుంది. కానీ పూర్తిగా నేర్చుకోకుండా వచ్చీరాని వైద్యంతో అడవి జీవులకు వైద్యం మొదలు పెట్టింది. లాభాపేక్షతో ఎక్కువ ప్రతిఫలం ఆశిస్తూ వైద్యం చేసేది. దాని వచ్చీరాని వైద్యంతో కొన్ని జంతువులు ప్రాణాలను కోల్పోయాయి. దానికి ఏనుగు "జబ్బు ముదిరినాక వస్తే ప్రాణాలు పోకుండా ఉంటాయా?" అని కఠినంగా సమాధానం చెప్పేది. గత్యంతరం లేక జంతువులు గజరాజుతోనే వైద్యం చేయించుకునేవి.
       ఆ అడవి జీవుల దుస్థితిని గమనించిన జింక పేరున్న పెద్ద అడవికి వెళ్ళి, అక్కడ గొప్ప గురువు వద్ద అన్ని రకాల జబ్బులకు వైద్యం పరిపూర్ణంగా నేర్చుకుంది. తన అడవిలోకి వచ్చి, వైద్యం మొదలు పెట్టింది. క్రమంగా జింక వైద్యంపై అన్ని జీవులకూ నమ్మకం ఏర్పడింది. తక్కువ ప్రతిఫలంతో నాణ్యమైన వైద్యం చేసే జింక వద్దకు వచ్చే జీవుల సంఖ్య పెరిగిపోయింది. ఇది సహించలేని ఏనుగు జింక వైద్యంపై దుష్ప్రచారం చేస్తుంది. జింక ఇచ్చే మందులు నాణ్యమైనవి కావని, జబ్బు త్వరగా నయం అయినట్లే ఉంటుందని, మళ్ళీ తిరగబెట్టి ప్రాణాలు పోవడం ఖాయం అని ప్రచారం చేస్తుంది. దాని ప్రచారం కొంతవరకు పని చేస్తుంది. కానీ తన వైద్యం నాసి రకమని, జింక వైద్యం చాలా నాణ్యమైనదని ఏనుగుకు తెలుసు.
      ఒకరోజు ఏనుగుకు పెద్ద జబ్బు చేసింది ‌‌కదలలేని, మాట్లాడలేని స్థితికి వచ్చింది. ఏనుగు వైద్యాన్ని అప్పుడప్పుడు గమనిస్తున్న ఏనుగు కుమారుడు ఏనుగుకు వైద్యం మొదలు పెట్టాడు. ఏనుగుకు మాత్రం జింక వద్ద వైద్యం చేయించుకుంటేనే తన ప్రాణాలు నిలుస్తాయి అనిపించింది. కానీ చెప్పడానికి మాటలు రావు కదా! జింక వైద్యంపై ఏనుగు చేసిన దుష్ప్రచారం వల్ల ఏనుగు కుటుంబ సభ్యులకు జింక వైద్యంపై నమ్మకం లేదు. ఏనుగు ఆరోగ్యం మరింత విషమించడంతో ఏనుగు కుమారుడు మంచి వైద్యుని కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఈలోపు ఏనుగు ప్రాణాలు పోయాయి. ఏనుగు తాను తీసుకున్న గోతిలో తానే పడింది. 

కామెంట్‌లు