అన్నయ్య కోసం (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు

  అమరేంద్ర చాలా తెలివైన విద్యార్థి. తరగతిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను ఏకాగ్రతతో వింటూ మొత్తం గుర్తుంచుకుంటాడు. ఇంటికి వెళ్ళాక మళ్ళీ పాఠ్య పుస్తకాలు తిరిగేసే అవసరం లేదు. అయితే అమరేంద్ర తీరిక సమయాల్లో మిత్ర బృందాన్ని తీసుకుని రోజూ రెండు మూడు గంటలు క్రికెట్ ఆడి వచ్చేవాడు. అమరేంద్ర తెలివైన వాడు అయినా అతనితో ఆటలతో కాలక్షేపం చేయడం వల్ల ఇతర విద్యార్థులు చదువు రాని వారు అవుతున్నారు. ఇంటివద్ద అమరేంద్ర చెల్లెలు ఉజ్జ్వల ఆయా సబ్జెక్టుల్లో తనకు అర్థం కాని విషయాలు చెప్పమని అన్నయ్యను ప్రతిరోజూ బ్రతిమాలుతుంది. "నాకు చాలా పనులు ఉన్నాయి. బయట నా కోసం ఎంతోమంది మిత్రులు ఎదురు చూస్తున్నారు. నీకు అర్థం కాని విషయాలు ఉంటే ఉపాధ్యాయులను అడగాలి కానీ నన్ను అడిగితే నేనేం చెప్పాలి." అని విసుక్కునేవాడు. పాపం! ఉజ్జ్వల చిన్నబుచ్చుకునేది. ఆదివారం రోజున ", నాతో ఆటలు ఆడరా అన్నయ్యా!" అంటే "నీకేం ఆటలు వస్తాయి. నీతో ఆటలు ఆడితే నాకు బోర్ కొడుతుంది." అనేవాడు.
       అమ్మా నాన్నలు ఇచ్చిన పాకెట్ మనీని అమరేంద్ర ఆట వస్తువులు కొనుక్కోవడానికి, స్నేహితులతో కలిసి రకరకాల చిరుతిళ్ళు తినడానికి ఖర్చు చేసేవాడు. ఉజ్జ్వల దాచిపెట్టుకునేది. ఏమీ కొనుక్కనేది కాదు. "ఉజ్జ్వలా! నువ్వు ఎంత మంచి దానివి తల్లీ! చిన్నప్పటి నుంచి నువ్వు పాకెట్ మనీ, పుట్టినరోజులకు వచ్చే డబ్బులు ఏమీ ఖర్చు చేయకుండా చాలా డబ్బు కూడబెట్టావు. వచ్చే పుట్టినరోజున నువ్వు కూడబెట్టిన డబ్బుతో బంగారం కొని నీకు ఏమైనా చేయిస్తా." అన్నది తల్లి. సంతోషించింద మన బంగారు తల్లి.
       ఒకరోజు అమరేంద్ర క్రికెట్ ఆడుతుండగా ప్రమాదవశాత్తు బ్యాట్స్ మన్ కొట్టిన బంతి తలకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చేర్చారు. చాలా రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. ఉజ్జ్వల బోరు బోరున ఏడుస్తుంది. "ఎందుకమ్మా! అన్నయ్యకు ఎన్ని రోజులు అయినా గాయం తగ్గడం లేదు. డబ్బులు సరిపోకపోతే నా పాకెట్ మనీ అంతా ఖర్చు పెట్టి అన్నయ్యను మామూలు మనిషిని చేద్దాం." అని వెక్కి వెక్కి ఏడుస్తుంది ఉజ్జ్వల. చెల్లెలి మనసును తెలుసుకున్న అమరేంద్రకు దుఃఖం ఆగలేదు. పూర్తిగా కోలుకున్నాక అమరేంద్ర ఇంట్లోనే పూర్తిగా ఉంటూ చెల్లెలికి చదువు చెప్పడం, చెల్లెలితోనే పూర్తిగా ఆడటం చేశాడు.

కామెంట్‌లు