నవనవోన్మేషం-ముద్దు వెంకటలక్ష్మి-కలం స్నేహం
నిత్యనూతన జానపద గేయాలలో
నడయాడిన నవరస తెలుగు
                           కవిత్వ విన్యాసం
నన్నయ మార్గకవితలో లిఖితరూపమై
నూతన రీతుల పాల్కురికి, 
నన్నెచోడుల జానుతెనుగులోనర్తించి,
నాటకీయ శైలిలో తిక్కన గంటాన
నాట్యమాడింది ;

నడిమి భారత భాగాన్ని రచించిన
నైపుణ్యవంతుడు ఎఱ్ఱన కవీశ్వరుని
వర్ణనల్లో ఎదిగి ఒదిగింది ; వాణి నెన్నెదుటను
 శిరసు వంచి కవిత్వ తత్త్వ మహత్వాన్ని,  కవనాన 
నేర్పునూ సాధించిన అద్భుత కవి,
నిరుపమాన కవి పోతన్న రచించిన
నందగోపుని భాగవత కథలతో
నాడూ నేడూ అందరి నాల్కలపై
నృత్యం చేస్తోంది ;

నాదోపాసకుడు శ్రీనాథుని నైషథ
                               కావ్యంలో,
నుగ్గు నుగ్గయిన కంచుఢక్కలో
నూతన సొబగులను పొందింది, 

నవ్యరీతుల ప్రబంధాల్లో నయగారాలొలికించింది,
నొక్కి వక్కాణించి నవలీకరించిన
నోరి నరసింహశాస్త్రి రచనల్లో
నిగారింపు నందింది ;

నీతికథల దారుల్లో నిబద్ధమై నైతిక
జీవనాన్ని నిర్దేశించింది ;
నాటి నుంచి నేటి కవుల
కవుల విభిన్న రీతుల్లో
నవనవోన్మేషమై నిఖిలమై నిలుస్తోంది. 
                           
నవ్య కవులు నిఖార్సైన
                పదబంధాల్లో
నింగికి నేలకు వేసిన నిచ్చెనపై
నిగనిగలాడుతూ నభముపై విజయ నికేతనమై విరాజిల్లింది ;


కామెంట్‌లు