సంగీతదర్శకుడు ఇళయరాజా ముచ్చట్లు ఇంకొన్ని;-- యామిజాల జగదీశ్
 ఇసై జ్ఞాని (సంగీత జ్ఞాని) ఇళయరాజా 
కర్ణాటక సంగీత ఒడిలో ఓలలాడుతున్న తమిళ సినిమాను చేయి పట్టుకుని తనదైన బాణీలో సంగీత స్వరాలతో కోట్లాది మంది అభిమానపాత్రులయ్యారు. గతంలోనూ ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పాను. ఇప్పుడు మరికొన్ని ముచ్చట్లు....
ఇళయరాజా అసలు పేరు డేనియల్ రాసయ్యా అలియాస్ జ్ఞానదేశికన్. తండ్రి పేరు డేనియల్ రామసామి. తల్లి చిన్నత్తాయ్. సోదరులు పావలర్ వరదరాజన్, డేనియల్ భాస్కర్, అమర్ సింగ్ (గంగై అమరన్). ఇళయరాజా భార్య పేరు జీవా.
జానపద పాటలకు తనదైన ముద్ర వేసి అన్ని వర్గాలవారి మనసును దోచుకున్న ఇళయరాజా సంగీత రాజు. ప్రాచీన సంగీతాన్ని రీమిక్స్ చేయడంలో ఆయన బాణీయే వేరు.
కమ్యూనిస్ట్ పార్టీ ప్రచార వేదికలపై పాడే తన సోదరుడు పావలర్ తో కలిసి తన సంగీత ప్రయాణానికి శ్రీకారం చుట్టారు.
తొలి రోజుల్లో స్త్రీ గొంతుతోనే పాడుతూ వచ్చిన ఇళయరాజా తన సొంత ఊరైన పన్నైపురంలో తన తల్లి కోసం ఓ ఆలయం నిర్మించారు.
ఆయనకిష్టమైన విషయాలలో ఒకటి అమ్మకోసం నిర్మించిన ఆలయంలో కూర్చుని ధ్యానం చేయడం.
ఎవరికోసమూ సిఫారసు చేయని ఇళయరాజా ఎవరు సిఫారసు చేసినా "నో" అనేస్తారు నిర్మొహమాటంగా. కానీ అటువంటి ఇళయరాజా సంగిలి మురుగన్ కి సిఫారసు పేరిట ఓ అవకాశమిచ్చారు. "అన్నీ సరే కానీ మురుగన్ సంగతి చూడరా"  అని ఇళయరాజాకు సిఫారసు చేసింది ఇంకెవరో కాదు, స్వయంగా ఆయన తల్లి చిన్నత్తాయ్. 
ఇళయరాజా పేదరికంలో ఉన్న రోజులవి. అయితే కోయంబత్తూరులో ఓమారు 85 రూపాయలకు ఓ హార్మోనియం కొన్నారు. ఆ హార్మోనియం ఇప్పటికీ ఆయన దగ్గరుంది. అది ఆయన ఊపిరి. ఈ విషయాన్ని ఆయన అనేక వేదికలపై చెప్పుకున్నారు కూడా.
భారతీయ సినిమా చరిత్రలో ఒకే ఏడాదిలో 56 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి సరికొత్త రికార్డు సృష్టించారు ఇళయరాజా.
వేల పాటలకు సంగీతం స్వరపరిచే ఇళయరాజా హే రామ్, విరుమాండీ వంటి సినిమాలకు హంగేరి కళాకారులతోనే మొత్తం సినిమాకు సంగీతం సమకూర్చారు.
ఆయన "కాదలిన్ దీబం ఒన్డ్రు...."  అనే పాటకు ఈల ద్వారా తాళం వేసి దానిని రికార్డు చేసి వాయిద్య బృందానికి వినిపించి ఆ విధంగా వాయించాలన్నారు.
ఓమారైతే ఒకే రోజు ఇరవై పాటలకు సంగీతం స్వరపరచి అందరినీ ఆశ్చర్యపరచిన ఇళయరాజా లండన్ ట్రినిటీ సంగీత కళాశాలలో క్లాసికల్ గిటార్ విభాగంలో స్వర్ణపతకం పొందారు.
సింఫనీ సంగీతం రూపొందించడానికి కనీసం ఆరు నెలలు పడుతుంది. కానీ ఇళయరాజా పదమూడు రోజులలోనే స్వరపరచి ప్రపంచ రికార్డు సృష్టించారు.పైగా ఆసియాలో మొట్టమొదటగా సింఫనీని వాయించిందీ ఈయనే అని ఓ తమిళ వ్యాసంలో చదివాను.
ఓ వేసవికాలంలో అమృతవర్షిణి రాగాన్ని వాయించి వర్షం కురిసేలా చేశారు ఇళయరాజా.
హేరామ్ సినిమాకు మరొకరు స్వరపరచిన సంగీతాన్ని పూర్తిగా చెరిపేసి పెదవుల కదలికలకు తగినట్టు కొత్త సంగీతాన్ని సమకూర్చి ఔరా అనిపించుకున్నారు ఇళయరాజా.
కర్ణాటక సంగీతంలో క్లిష్టమైన రీతిగౌళ అనే రాగాన్ని తొలిసారిగా "కవిక్కుయిల్" అనే సినిమాలో చిన్న కణ్ణన్ అయైక్కిరాన్ అనే పాటకు మొదటిసారిగా స్వరపరిచింది ఆయనే. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో ఆ పాట పాడించారు. రీతిగౌళ రాగంలో ఆ పాట కావాలని ఇళయరాజా చెప్పినప్పుడు ఆశ్చర్యపోయానని బాలమురళీకృష్ణగారు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
నేపథ్యసంగీతం కోసం జాతీయ స్థాయిలో అవార్డు పాందిన మొదటి సంగీత దర్శకుడు ఇళయరాజా. 
తమిళ దర్శకుడు మణిరత్నం రూపొందించిన దళపతి సినిమాలో రాకమ్మా కయ్యయ్ తట్టు పాటను గత డెబ్బై అయిదు సంవత్సరాలలో ఎక్కువ మంది విన్నారని బిబిసి సంస్థ ప్రకటించింది. ఈ సినిమాలోనే సుందరి కన్నాల్ ఒరు సేది పాటకు 134 వాయిద్యాలు ఉపయోగించారు సంగీత దర్శకుడు ఇళయరాజా.
నూరావదు నాళ్ అనే సినిమా రీరికార్డింగుకి ఆయన తీసుకున్న టైమ్ కేవలం 12 గంటలు మాత్రమే.కానీ సిరైచ్చాలై సినిమా నేపథ్య సంగీతానికి ఆయన ఎక్కువ రోజులు తీసుకున్నారు. అవెన్ని రోజులంటే 24 రోజులు. 
ఇళయరాజా ఇప్పటివరకూ ఓ డజన్ పుస్తకాలు రాశారు. వీటిలో ఓ అయిదు పుస్తకాలు ఒక సంపుటిగా వెలువడ్డాయి. దాని పేరు "యారుక్కు యార్ ఎయుదువదు". ఈ సంపుటిలోని ఇళయరాజా పుస్తకాలు....పాల్ నిలా పాదై, సంగీద కనవుగళ్, వయిత్తునై, ఇళయరాజావిన్ సిందనైగళ్, వెట్టవెలిదనిల్  కొట్టి కిడక్కుదు.
2010లో పద్మభూషణ్, 2018లో పద్మవిభూషణ్ పొందారు.
చిదంబరం అణ్ణామలై విశ్వవిద్యాలయం 1994లోనూ, మదురై కామరాజర్ విశ్వవిద్యాలయం 1996లోనూ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది 
ఇళయరాజా సంగీతం సమకూర్చిన వెయ్యో సినిమా - తామరై తప్పట్టయ్. ఈ సినిమాకుగాను కేంద్రప్రభుత్వం ఆయనను జాతీయ అవార్డుతో సత్కరించింది. 
సంగీతంలో ఓ చిన్న అపస్వరం దొర్లినా దాన్ని సరిచేసే వరకూ మరో ఆలోచన ఉండదు ఆయనకు. 
విరుదాళి, సారల్, సుమ్మావే ఆడువోం, తిరుప్పది లడ్డు, పట్టిణపాక్కంవంటి సినిమాలకు పాటలు రాసిన మురుగన్ మందిరం ఓ సినిమాకు మాటలుకూడా రాశారు. ఆయన ఇళయరాజా పాటలకు సంబంధించి ఓ పుస్తకం రాశారు. పుస్తకం పేరు - "ఒరే ఒరు రాజా, ఒరు కోడి కథైగళ్"
(ఒకే ఒక రాజా, ఒక కోటి కథలు). ఇళయరాజా సంగీతం, పాట గురించి అనేక పుస్తకాలు వచ్చినప్పటికీ వాటన్నింటికీ భిన్నమైనదని రచయిత మురుగన్ చెప్పుకున్నారు. ఇళయరాజా పేరు ప్రస్తావించకుండా తమిళ చరిత్రనో తమిళ సంగీత చరిత్రనో రాయడం అసాధ్యం. ఇళయరాజా కథనూ ఆయన స్వరపరచిన పాటల గురించీ మనమందరం ఎన్నో విషయాలు తెలుసుకునే ఉంటాం. ఇళయరాజా పాటలు మన జీవితంలో కల్పించిన కథలు, మన జీవితంలోని పలు కథలలో ఇళయరాజా పాటలుండటాన్ని మనం బయటకు చెప్పుకోకపోవచ్చు. ఎందుకంటే ఆ కథలన్నీ వారి వారి మనసులో పదిలంగా ఉంటాయి. అలా ఇళయరాజా పాటలు నా జీవితంలోనూ నమోదైన కొన్ని కథలను ఈ పుస్తకంలో ప్రస్తావించాను. ఇది ప్రథమ భాగం" అని రచయిత మురుగన్ మందిరం చెప్పారు.
కామెంట్‌లు