అయ్యో!ఓహ్!...అచ్యుతుని రాజ్యశ్రీ

 రాము తల్లి దండ్రులు లేని 16ఏళ్ళ కుర్రాడు. బంధువుల ప్రాపకం లో పెరిగాడు.కూలీనాలీ తో తన కాళ్ళపై తాను నిలబడాలని  పట్టణంలో పద్దయ్య దగ్గర చేరాడు.ఆషావుకారు తిండి బట్ట వసతి కలిపించినా  ఎవరూ 2నెలలకు మించి పనిచేయరు.నెలజీతం ఇవ్వకుండా  ఎగగొట్టాలని  వారి ని వింత ప్రశ్నలతో  అదరగొట్టి బెదిరిస్తాడు. పాపం ఇది తెలీని రాము కడుపు నిండా తిండి దొరకటంతో షావుకారు చెప్పిన పని కిక్కురుమనకుండా చేసేవాడు.తెల్లారిందిమొదలు అంతా రాత్రి నిద్ర పోయేదాకా నడ్డి విరిగేలా చాకిరీ చేసే వాడు.ఒక నెల పూర్తి ఐంది. జీతం ఇవ్వకుండా  తప్పించుకోవాలనికొత్త ప్లాన్ వేశాడు."ఒరే రామూ!మార్కెట్ కెళ్ళి నేను చెప్పే రెండు వస్తువులు తీసుకుని రా! వాటి పేర్లు  అయ్యో  ఓహ్!"అని గుంభనగా నవ్వుతూ రాము చేతిలో కొంత డబ్బు పెట్టాడు.రాము ప్రతి షాప్ లోకివెళ్లి  "అయ్యో  ఓహ్  ఉందా?" అని అడగటం వారు హేళన గా "ఎవరు ఆవస్తువులు తెమ్మని చెప్పిన  పిచ్చాడు?" అని గేలి చేశారు. ఆ ఊరి పెద్ద శివయ్య కి తెలిసింది. షావుకారు కి బుద్ధి చెప్పాలనుకున్నాడు."రామూ!ఈరెండు పొట్లాలు తీసుకో.వీటిని నీవు విప్పి చూడ కూడదు.సరాసరి నీ యజమాని కే ఇవ్వు. వీటికి మంత్ర శక్తి  ఉంది. ఎవరికీ చూపకు."అని బుల్లి సంచీలో  వేసి  రాముని  సాగనంపాడు.వాడు సరాసరి షావుకారు దగ్గరకు వెళ్లి  "అయ్యా!ఊరంతా తిరిగితే ఇవి దొరికాయి "అన్నాడు.జనం అంతా మూగి ఆవింత చూస్తున్నారు. ఒక పొట్లం లో ని భరిణ బైటికి తీశాడు. మూతవిప్పటం ఆలస్యం బొద్దింకలు అతని నోరు చెవి ముక్కు లో దూరగానే "ఓహ్"అని  అరిచాడు. రెండో భరిణలోకందిరీగ  తేనెటీగ బైట కొచ్చిఅతని మొహంని కుట్టసాగాయి."అయ్యో!"అని అరుస్తూ గెంతుతున్న షావుకారు తో "అయ్యా! మీరు అడిగినవే  దొరికాయి కదండీ!?"అని అమాయకంగా అడుగు తున్న రామునిచూసి జనం ఫక్కున నవ్వారు.షావుకారు కి బుద్ధి వచ్చింది. ఒకరి డబ్బు  ఎగగొట్టాలని చూడరాదు.అమాయకులని మోసం చేయరాదు.
కామెంట్‌లు