తమిళ నేపథ్యగాయకుడు టి.ఎం. సౌందరరాజన్ గురించి ఇంకొన్ని ముచ్చట్లు..; - జగదీశ్ యామిజాల ..
 (నిన్నటి తరువాయి)
39. పాడేందుకు పాట ఇచ్చాక దానిని చదివి సంగీత దర్శకుడు చెప్పిన రాగంలో పాడటమే తన బాధ్యత అనుకోకుండా దానికి అవసరమైన మెరుగులు దిద్దడానికి సూచనలు చేయడం టిఎమ్మెస్ అలవాటు. ఈ విధంగానే శివాజీ హీరోగా నటించిన వసంతమాళిగై సినిమాలో యారుక్కాగ (ఎవరికోసం...) అనే పాట పాడవలసివచ్చినప్పుడు ఆ పాటకు ఎకో ఎఫెక్ట్ (ప్రతిధ్వని)సమకూర్చమన్నారు టిఎమ్మెస్. కానీ నిర్మాత అవేమీ అక్కర్లేదని అన్నారు. కానీ టిఎమ్మెస్ ఎకో ఎఫెక్ట్ పెడితేనే తాను పాడుతానని గట్టిగా చెప్పారు. దాంతో నిర్మాత సరేనని ఎకో ఎఫెక్ట్ కి ఒప్పుకున్నారు. థియేటర్లో ఎకో ఎఫెక్టుతో ఆ పాట వచ్చినప్పుడు ప్రేక్షకుల హర్షధ్వానాలు చేయడం చూసిన నిర్మాత టిఎమ్మెస్ ను తెగ పొగిడారు.
40. నాడోడి మన్నన్ సినిమాలో టిఎమ్మెస్ పాడిన "తూంగాదె తంబి తూంగాదే పాటంటే హిందీ గాయకుడు మొహ్మద్ రఫీకి ఎంతో ఇష్టం. ఆ పాటలో మేల్కొన్నవారంతా బతికేసారు అనే అర్థంలో వచ్చే మాటల్ని సౌందరరాజన్ పలికిన తీరు అమోఘమని రఫీకి చెప్పారు. ఈ సినిమాను హిందీలో తీసినప్పుడు టిఎమ్మెస్ లాగా తాను పాడగలనా? హమ్ మర్జాయేంగే అని చెప్పారు రఫీ. అయితే సంగీత దర్శకుడు ఎస్.ఎం. సుబ్బయ్య నాయుడు రఫీకి అనువైన రీతిలో ట్యూన్ కట్టి పాడించారు. అలాగే ఓరాయిరం పాడలిలే....అని టిఎమ్మెస్ పాడిన పాటను విన్న రఫీ ఆయన  కంఠాన్ని స్పర్శిస్తూ ఇక్కడి నుంచేనా ఆ మాటలు పలికించారు అని మెచ్చుకున్నారట.
41. కంచి పరమాచార్యులు, పుట్టపర్తి సాయిబాబా అంటే టిఎమ్మెస్ కు భక్తిప్రపత్తులు ఎక్కువ. ఓమారు సాయిబాబా టిఎమ్మెస్ ఇంటికి వెళ్ళారుకూడా. అలాగే ఓమారు కంచి పరమాచార్యులవారు టిఎమ్మెస్ తో "కర్పగవల్లి" అనే పాటను పాడించుకున్నారు. అంతేకాదు, తాను కపపుకున్న ఎర్ర సాలువను టిఎమ్మెస్ కు కానుకగా ఇచ్చారు. ఈ సంఘటనను టిఎమ్మెస్ తన భాగ్యమని చెప్పుకున్నారు.
42. టిఎమ్మెస్ కు దైవ భక్తి ఎక్కువ. ఓమారు ఆయన ఎస్.ఎస్. రాజేంద్రన్ కోసం కన్నదాసన్ రాసిన "కడవుల్ మనిదనాగ పిరక్కవేన్డుం....అవన్ కాదలిత్తు వేదనయిల్ సాగ వేండుం" అనే పాటను పాడవలసి వచ్చింది. అయితే దేవుడు ప్రేమించి వేదనతో చావాలన్న మాటలను తాను పాడబోనని గట్టిగా చెప్పేశారు టిఎమ్మెస్. దాంతో కవి ఆ వాక్యాన్ని వాడవేండుం అని మార్చిన తర్వాతే ఆ పాటను పాడారు టిఎమ్మెస్. 
 
43. కవి వాలి మొట్టమొదటగా రాసినది కర్పనై ఎండ్రాలుం....కర్శిలై ఎండ్రాలుం....అనే భక్తి గీతం. వాలి ఈ గీతాన్ని ఓ పోస్టు కార్డులో రాసి టిఎమ్మెస్ కి పోస్టు చేశారు. ఆ పాట చదవడంతోనే నచ్చి టిఎమ్మెస్ దానిని స్వరపరచి పాడగా సూపర్ హిట్టయింది. అంతేకాదు, ఈ పాటతో వాలి సినీ గీతాలు రాసే అవకాశాలకు ద్వారాలు తెరచుకున్నట్టయింది.
44. సినిమాకు రాకముందు ఆయనకు పొడవాటి పిలక ఉండేది. అలాగే నుదుట వడగలై నామం పెట్టుకునేవారు టిఎమ్మెస్. సినిమాలో అవకాశం కోసం కోయంబత్తూర్ రావడానికి ముందర పిలక, వడగలై నామంతో ఓ ఫోటో తీసుకున్నారు. అనంతరం పిలకను తీసేసారు. అంతేకాకుండా వడగలై నామాన్నీ మానేసి విభూతి పెట్టుకోవడం మొదలుపెట్టారు.
45. టిఎమ్మెస్ - సుమిత్ర పెళ్ళి పత్రికలో ఓ వినోదమైన మాటలు కలిపారు. "మీ వంతైన రేషన్ బియ్యాన్ని పెళ్ళికి రెండు రోజులముందే అందేటట్లు పంపగలరని కోరుతున్నాం" అనే మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. పెళ్ళికి వచ్చేవారు తప్పనిసరిగా పంపాలనేం లేదు. బియ్యానికి కొరత ఉన్న రోజులవి. కనుక ఇంతమందికి అన్నం పెట్టడానికి మీకెక్కడి నుంచి బియ్యం దొరికింది అని అధికారులు అడిగితే వారికి జవాబు చెప్పడానికే ఆ విధమైన విజ్ఞప్తి ఫుట్ నోట్లో వేసారట.
46. అంతస్తులో హోదాలోనూ తమకన్నా తక్కువవారనే కారణంగా టిఎమ్మెస్ కి సుమిత్రతో పెళ్ళి జరిపించడానికి అమ్మాయిసోదరుడికి ఇష్టం లేదు. కానీ సుమిత్రకేమో టిఎమ్మెస్ నే పెళ్ళి చేసుకోవాలని ఆశ. అయితే అన్నయ్యేమో అడ్డుపడ్డాడు. అంతేకాక డబ్బున్న ఓ యువకుడితో తన చెల్లి పెళ్ళి చేయడానికి ఏర్పాట్లు చేశారుకూడా. కానీ పెళ్ళికి ముందురోజు ఆ డబ్బున్న యువకుడు అనుకోని రీతిలో మరణించడంతో తాను కోరుకున్న టిఎమ్మెస్ నే మనువాడారు సుమిత్ర.
47. ఎంజిఆర్, శివాజీ, ము. కరుణానిధి, జయలలిత తదితరులతో సాన్నిహిత్యం ఉన్నప్పటికీ సాయంకోసం వారిని ఆశ్రయించలేదు. తనకు అది కావాలి ఇది కావాలి అని అడగలేదు టిఎమ్మెస్. 
48. టిఎమ్మెస్ అవకాశాలకోసం తిరుగుతున్న రోజులవి. కోవై సెంట్రల్ స్టూడియో ముందర ఓ బడ్డీకొట్టు నడుపుతున్నారు సాండో చిన్నప్ప దేవర్. ఆరోజుల్లో ఆయనతో ఏర్పడిన స్నేహం తర్వాతి రోజుల్లో ఆయన తీసిన సినిమాలన్నింట్లోటిఎమ్మెస్ తో పాడించారు.
49. తాయిల్లామ్మల్ నానిల్లయ్ సినిమాలో కమలహాసన్ కి, తాయి మీదు సత్తియం అనే సినిమాలో రజనీకాంత్ కి టిఎమ్మెస్ తో పాడించారు చిన్నప్ప దేవర్. 
 
50. ఇసై జ్ఞాని ఇళయరాజాకి టిఎమ్మెస్ గొంతంటే చాలా ఇష్టం. సినీ జగత్తులో ఉన్న ఏకైక అంబిక కంఠం టిఎమ్మెస్ మాత్రమే అని ఇళయరాజా కొనియాడుతుండేవారు. తాను సంగీతదర్శకత్వం వహించిన తొలి చిత్రం అన్నక్కిళిలో టిఎమ్మెస్ తో ఏరికోరి పాడించారు ఇళయరాజా.
51. శివాజీ నటించిన బాగప్పిరివినై సినిమా వందో రోజు సంబరాలు చెన్నై ఎగ్మూరులోని అశోకా హోటల్లో జరిగాయి. ఈ కార్యక్రమంలో దర్శకుడికి, నటీనటులకు సన్మానాలు చేశారు. గాయనీగాయకులను విస్మరించారు. ఇది సరికాదనుకున్న టిఎమ్మెస్ వేదికపై దైవప్రార్థన పాడటానికి తనను పిలవగా పాడేందుకు టిఎమ్మెస్ నిరాకరించారు. ఆయన అలక సముచితమే అని గ్రహించిన నిర్మాత అనంతరం గాయనీగాయకులనుకూడా సన్మానించారు.
52  చెన్నై రావడంతోన్ టిఎమ్మెస్ మొట్టమొదట ఉన్నది ఆళ్వార్ పేటలోని పిళ్ళయార్ కోవిల్ స్ట్రీటులో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఆయనే వంట చేసుకునేవారు. పెళ్ళయ్యాక మైలాపూర్ లోని న్యూ స్ట్రీట్ లో నివాసముండేవారు. అనంతరం సినిమాలో పాడటం ద్వారా సంపాదించిన డబ్బులతో మందైవెలిలో ఓ ఇల్లు కొనుక్కున్నారు టిఎమ్మెస్. 
53. నా ఆకలిని తీర్చింది ఎవిఎం స్టూడియో - నా మనసుని ఆహ్లాదపరిచింది మరుదకాశి అని తొలిరోజుల గురించి చెప్పుకునేవారు టిఎమ్మెస్. తనను ఆదరించిన ఈ ఇద్దరినీ చివరిరోజుదాకా తలిచేవారు.
54. 2006లో టిఎమ్మెస్ అభిమాన సంఘంవారు ఆయన పుట్టింరోజు పురస్కరించుకుని ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెండు, మూడు వందల మంది మాత్రమే వచ్చారు. అది చూసి కరుణానిధి కుమారుడు ము. క. అళగిరి ఎంతో బాధపడ్డారు. గొప్ప గాయకుడికి ఇంతమందేనా రావడమేమిటని అనుకుని  మరుసటి ఏడాది మదురైలో భారీ స్థాయిలో టిఎమ్మెస్ జన్మదిన వేడుకలను నిర్వహించి టిఎమ్మెస్ ను సన్మానించారు.
55. తమిళ ప్రాచీన భాషా సమ్మేళనానికి పాటను ఆవిష్కరించే కార్యక్రమంలో ముందు వరసలో కూర్చున్న టిఎమ్మెస్ ని చూసిన ము. కరుణానిధి ఆయన వద్దకు వచ్చి చేయి పట్టుకుని వేదికపైకి తీసుకుపోయి కూర్చోపెట్టి ప్రశంసించారు.
56. మదురై విశ్వవిద్యాలయం వారు పేరవై సెమ్మల్ అనే బిరుదుతో టీఎమ్మెస్ ని గౌరవించింది. బెల్జియంలోని ఓ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. అలాగే అలనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతులమీదుగా పద్మశ్రీ పురస్కారం పొందారు. తమిళనాడు ప్రభుత్వం కళైమామణితో సత్కరించింది.
57. తనకెక్కువ పాటలు పాడిన టిఎమ్మెస్ ని ప్రభుత్వ ఆస్థాన కళాకారుడిగా టిఎమ్మెస్ ని కాదని శీర్కాళి గోవిందరాజన్ ని నియమించారు ఎంజిఆర్. అయితే జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యాక టిఎమ్మెస్ ని ఆస్థాన విద్వాంసుడిగా నియమించారు.
58. 1972లో టిఎమ్మెస్ కోసం ఓ సన్మానకార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎవిఎం వారు ఎయిలిశై మన్నర్ అనే అవార్డుతో టిఎమ్మెస్ ని కరుణానిధి చేతులమీదుగా సన్మానించారు.
59. టిఎమ్మెస్ తనకు పాటలు పాడటం ఓ వరప్రసాదమని శివాజీ గణేశన్ హిందీ గాయని లతామంగేష్కర్ తో ఆభివర్ణించారు.
60. తొలిరోజుల్లో ఆయన నాన్ వెజ్ తినేవారు. కానీ కాలక్రమేణా శాకాహారిగా మారారు. మాంసాహారం మానేశారు. వక్కా. - ఆకు వేసుకునేవారు. పొగాకుకు దూరం.
61. టిఎమ్మెస్ కు ఇష్టమైన గాయకుడు మలేసియా వాసుదేవన్.
(సశేషం)

కామెంట్‌లు