జానపద విజ్ఞానం..!!>దిక్కు -దిశ ..!! ;ప్రోఫెసర్ నాగపట్ల భక్తవత్సల రెడ్డి > చిత్తూరు .

 మనం పెద్దగా పరామర్శించుకోకపోయినా, మనం చేసే పనుల్లో మనకు తెలవకనే మన నరనరాన జీర్ణించుకొని పోయిన ఒక సంప్రదాయ విశ్వాసానికి  సంబంధించింది దిక్కు - దిశ. వాస్తుశాస్త్రం దీనిమీదనే ఆదారపడింది అని మనకు తెల్సు. మన ఆచారాలలో, వృత్తిలో, పండగల్లో, దేవతల్ని నిల్పుకోవడంలో, సంప్రదాయ జీవనవిధానంలోని ప్రతి అంశంలో దీనికి భాగస్వామ్యం ఉంది. ఇంకొంచెం లోతుగా చూస్తే శిష్టులు, గ్రామీణులు, తర తమ భేదం లేకుండా ఒకే విధంగా నమ్మకం పెంచుకొన్న ఒక వ్యవస్థ ఇది. జానపదవిజ్ఞానంలో ఈ నమ్మకం ఎలా వైవిధ్యం సంతరించుకొని ఉందో చూసే ప్రయత్నమే ఇది. 
వ్యవసాయంలో ఏరువాక కి ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. కొత్త సంవత్సరం లో వ్యవసాయం మొదలుపెట్టడం. దాన్ని నిర్వహించడంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా, అలాగే కులాల మధ్య కూడా వైవిధ్యం కనబడుతుంది. ఉగాదినాడు తమ చెలకలోని తూర్పు దిశగా ఉన్న చెట్టు కొమ్మను నరికి, ఆ తర్వాత నాగలి కట్టి చెలకను దున్నే కుటుంబాలు కొన్ని, చెట్టుని నరకకుండా పడమరనుంచి తూర్పుకు ఒక కొండ్ర దున్నే కుటుంబాలు కొన్ని- అలా ఒక ఊరిలోనే వైవిధ్యం కనబడుతుంది. మున్నూరు కాపు కులంలో ఉగాది నాడు ఇంటిపెద్ద చెలకలకు పోయి ఏదైన చెట్టు కొమ్మను నరికితే అది తూర్పు లేదా ఉత్తరం వైపు పడితే మంచి జరుగుతుందని నమ్మకం ఉంది (చౌళ్లపల్లి). వ్యవసాయంలో ఏరువాక సమయంలో  దున్నడం - సంవత్సరంలో మొట్టమొదటి సారి దున్నేటపుడు తూర్పు లేదా తూర్పు వైపుగా ప్రారంభించడం ఆనవాయితీగా కనబడుతుంది. కొన్ని ప్రాంతాల్లో దొంగేరుతో (తెల్లవారు ఝామున ఎవరికీ తెలియకుండా వెళ్లి కొండ్ర వేసి రావడం) ఏరువాక మొదలవుతుంది. ఏది ఏమయినా తూర్పుకి ప్రాధాన్యత ఉంది. అలాగే నారు పోసేటపుడు, నాటేటపుడు, కోత కోసేటపుడు ఇంకా చాలా వృత్తులు మొదలుపెట్టేటపుడు కూడా తూర్పుకే పెద్దపీట.
అలాగే దేవతలు, దేవాలయాలు చాలా వరకు తూర్పు, ఉత్తరం వైపున గాని, అభిముఖంగా గానీ ఉంటాయి. గ్రామదేవతకి చాలా గ్రామాల్లో నైఋతిలో గుడులు ఉన్నాయి. అపవాదాలు కూడా ఉండొచ్చు. బయటనే కాకుండా ఇంట్లో కూడా దిక్కుల స్పృహ ఉంది. భవానీ దేవత (ఆరె వారి కులదైవం) పూజగదిలో గద్దెపై తూర్పు ముఖంగా, ఎల్లమ్మ దేవత దేవుని గదిలో తూర్పు లేదా ఉత్తర ముఖంగా, గుర్రంబొమ్మ ఆకారంలోని పెద్దమ్మ తూర్పు ముఖంగా, ఉప్పలమ్మ చింతచెట్టు కింద తూర్పుముఖంగా (ముత్రాసి వాళ్ల ఇంట్లో) ఉన్నాయి. పెద్దమ్మ దేవతకు తూర్పున రెండు స్త్రీ ప్రతిమలు ఉండడం, పోచమ్మ గుడి సింహద్వారం తూర్పు ముఖంగా ఉండడం, పోచమ్మ గుడికి తూర్పు దిశలో పోతలింగడు ఉండడం,   పుట్టమన్నుతో చేసిన ఎల్లమ్మను పంబాలవారు తూర్పు ముఖంగ పెట్టడం, దేవతలకి సంబంధించిన గుడుల విషయంలోనూ, ప్రతిమల్ని కూర్చోబెట్టడం లోనూ చూస్తే దిక్కు కి ప్రాధాన్యత ఇచ్చినారన్నది స్పష్టం.  మాలవారిలో కొందరు పాండవుల పండగకు పొలంలోని తూర్పు భాగంలో తంగేడు మండల పందిరి వేస్తారు. పెండ్లి సమయాలలో వధూవరులని తూర్పు ముఖంగా కూర్చో పెడతారు. చనిపోయిన వారిని మాత్రం ఉత్తరాన తల ఉండేటట్టు పండబెడతారు. ఇలాంటివి మన ఎరికలోనివే.
పంచాగంలో వివాహచక్రం గురించిన వివరణ (గుప్త, తితిదే, చాలా పంచాంగాల్లో) ఉంది. 'తొమ్మ్దిది గడులు గీచిన వివాహచక్రంలో, సూర్యుడున్న నక్షత్రంతో మొదలుబెట్టి, మూడేసి నక్షత్రాల చొప్పున మధ్య, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం - ఆ తొమ్మిది గడులకు నక్షత్రాలని లిఖించాలి. అపుడు చంద్రుడున్న నక్షత్రం అనగా వివాహ ముహూర్తానికి చంద్ర నక్షత్రం ఏ గడిలో ఉన్నదో తెలుసుకొని, ఆ నక్షత్రం శుభ ఫలమైతే వివాహలగ్నానికి అది శుభప్రదం' అని ఉంది. ఆ గడుల్లో చంద్ర నక్షత్రం మధ్య గడిలో ఉంటే దంపపతులకు మరణం, పశ్చిమం ఋణం, వాయవ్యం స్త్రీ వ్యభిచారిణి, ఉత్తరం ధనధాన్యాలు, ఈశాన్యం సకల సంపదలు, తూర్పు శుభం, ఆగ్నేయం వంశహాని, దక్షిణం వైధవ్యం, నైఋతి కులవృద్ధి - అని మూల సంస్కృత శ్లోకాలతో పాటు ఉంటుంది.
ఇందులో ప్రధానంగా తూర్పు శుభం, ఈశాన్యం సకల సంపదలు, ఉత్తరం ధన ధాన్యాలు - ఇవి అందరికీ, అన్ని పనులు ప్రారంభించడానికి అనువైనవిగా గుర్తించారు. తూర్పు శుభమైతే, పడమర ఋణం, వ్యాధి; నైరుతి కులవృద్ధి అయితే ఆగ్నేయం వంశహాని; వాయవ్యం (స్త్రీ వ్యభిచారిణి), దక్షిణం (వైధవ్యం), మధ్య (దంపతులకు మరణం) గడుల్లో చంద్ర నక్షత్రం ఉంటే పెండ్లి జరపరాదన్న ఆంక్ష దీని ద్వారా తెలుస్తుంది. (కాని పంచాంగాల్లో శుభ ముహూర్తాలని సామాన్యీకరించడం, వాటినే ప్రమాణాలుగా తీసుకోవడం కనబడుతుంది. ఇది చర్చా విషయం). 
ఈ చక్రం ఆధారంగా చూస్తే తూర్పు శుభం, ఈశాన్యం సకల సంపదలు, ఉత్తరం ధనధాన్యాలు కనుక ఏ పనైనా తూర్పునుంచో, తూర్పు ముఖంగానో, లేదా ఈశాన్యం లేదా ఉత్తరం ఉండడానికి మన పూర్వీకులు ప్రయత్నించారన్న విషయం అర్థం అవుతుంది. మరో అంశం కులవృద్ధి కోసం నైరుతి ని గుర్తించడం.  పెద్దలకు,  పేరంటాలుకి పెట్టుకోవడం నైరుతి లోనే అన్న విషయం ఒకనాటి పడమటి ఇంటిలోని పూజా విధానాన్ని చూస్తే అర్థమవుతుంది. తమిళంలో నైఋతిని కన్నిమూల అంటారు. కన్ని - కన్నియ - కన్య, తెలుగులో చెప్తే పేరంటాలు. వాస్తుని అనుసరించే ఆధునికులు మాత్రం ఈశాన్యంలో పూజగది ఉండాలంటున్నారు. దీనికి ఆధారం వెతకాల్సి ఉంది. చనిపోయినవారి తల ఉత్తరం వైపు ఉంచడమే గాకుండా శ్మశానానికి తీసుక వెళ్లేటపుడు కూడా తల ఉత్తరం వైపే ఉంటుంది. ఉత్తరం ధనధాన్యాలు కాబట్టి అలా పెడతారా?. అయితే ఉత్తరం తలపెట్టి నిద్రపోరాదు అన్న ఆంక్ష ఉంది. అంటే బతికి ఉన్నపుడు ఉత్తరం తల పెట్టి పడుకోరాదు, కాని చనిపోయాక తల ఉత్తరం వైపే పెట్టాలి. ఇది కూడా చర్చా విషయమే. మనం గుర్తించినా, గుర్తించకపోయినా దిక్కు - దిశలు మన జీవనవిధానంలో కలగల్సిపోయి ఉన్నాయనడంలో సందేహం ఏమాత్రం లేదు. 
వాస్తువిద్య లో నైఋతి పెత్తనం చేసేవాడి స్థలంగా గుర్తిస్తారు (మాస్టర్ బెడ్రూం నైరుతిలో ఉండాలంటారు?). నైఋతి, పడమర, దక్షిణం, ఆగ్నేయం, వాయవ్యం, ఉత్తరం, తూర్పు, ఈశాన్యం - ఇదీ క్రమం, ఎత్తు నుంచి పల్లానికి. కేరళలో సామాన్య జనత ఈ ఎత్తు పల్లం గుర్తించడంలో ఒక గుడ్డిగుర్తు వాడుకొంటారు. నైఋతిలో ఒక కోడి, ఈశాన్యంలో ఒక ఏనుగు, వాయవ్యంలో ఒక గుర్రం, ఆగ్నేయంలో ఒక గొర్రె నిలబెట్టి వాటిమీద పలక పెడితే అది సమానంగా ఎత్తుపల్లం లేకుండా ఉండాలి. నైఋతి కి ఈశాన్యానికి పల్లం విషయంలో ఎంత అంతరం ఉందో గుర్తించవచ్చు. మరో గుడ్డిగుర్తు - తూర్పు ముఖంగా లేదా దక్షిణ ముఖంగా నిలబడి ఎడమపాదం ముందుకు జరిపి, ఆ పాదం చిటికినవేలు ఉన్న వైపు పల్లం, అటునుంచి క్రమంగా బొటనవేలు వైపుకి ఎత్తు పెరుగుతూ ఉండాలి. అంటే తూర్పు కన్నా ఆగ్నేయం, ఆగ్నేయం కన్నా దక్షిణం, దక్షిణం కన్నా నైఋతి ఎత్తుగా ఉంటుందన్నమాట. అలాగే పడమర లేదా ఉత్తరం వైపు నిల్చొని కుడిపాదం ముందుపెట్టి ఎత్తు పల్లాలు సరిచూసుకోవచ్చు. ప్రవాహం ఎత్తు నుంచి పల్లానికే కాని పల్లం నుంచి ఎత్తుకు కాదు (నేటి ఎత్తిపోతలు అపవాదం). అందుకే చనిపోయిన (ప్రవాహం ఆగిపోయిన) వారి తల పల్లానికి ప్రతీకైన ఉత్తరం వైపు పెట్టమన్నారా (?) అన్న అనుమానం రాక తప్పదు. 
ఈ వివాహచక్రం నేపధ్యంలో మన గ్రామనిర్మాణాన్ని చూస్తే మరికొన్ని విశేషాలు గుర్తించడానికి అవకాశం కల్గుతుంది. ఇంటిలో కులవృద్ధి, కుటుంబ పెత్తనం కోసమయితే గ్రామాభివృద్ధిలో పెత్తనం లేదా పెద్దపాత్ర వహించే కులాలు కూడా ఊరిలో నైఋతి భాగంలోనే తమ ఇండ్లని కట్టుకొన్నారా అన్న సంశయం రాకమానదు. అదే నిజమైతే వారి పొలాలు కూడా చెరువుకి దగ్గరగానూ, చెరువు పారకంలో చివరిబొట్టు కూడా వారికి అందేటంత అనుకూలంగానే వాళ్ల భూములు ఉండవచ్చు అని సంశయించడానికి కూడా అవకాశం ఉంది. మా క్షేత్ర పర్యటన ఆధారంగా కొన్ని ఊహలు - వరంగల్లు జిల్లాలోని అమ్మాపురం (తొర్రూరు దగ్గర) లో కరణం మాత్రమే నైరుతి దిక్కులో ఉన్నారు. అమ్మాపురం ప్రారంభ దినాల్లో పెత్తనం వారిదే అయి ఉంటుందా? - తిర్మలాపూర్ లో గొల్లవారు నైరుతి లో ఉన్నారు. ఇక్కడ వారిదే పెత్తనమా? - నారాయణపూర్ లో నైరుతి దిక్కున గొల్ల, కురుమవారు ఉండడం, వారి కులదైవం బీరప్పగుడి దక్షిణంలో ఉండడం చూస్తే కురుమ వారి నాయకత్వంలో ఈ ఊరి నిర్మాణం జరిగి ఉండాలి అనవచ్చా?. ఇలాంటి నిర్ణయాలకి దిక్కు ఒకటే చాలదు, వారి పొలాలు, చెరువు పారకం, ఊరి మాన్యాల్లో వారి బాధ్యత, గ్రామదేవత జాతర్లలో, ఊరేగింపులో వారి పాత్ర - లాంటి మరెన్నో అంశాల్ని కూడా ఆరా తీయాల్సి ఉంటుంది.
జనబాహుళ్యంలో ఉన్న నమ్మకం శాస్త్రసాహిత్యానికి ఎక్కిందా లేక శాస్త్రసాహిత్యం జనబాహుళ్యం లోకి వచ్చిందా. చెట్టు ముందా? విత్తనం ముందా? పెద్దలు, పరిశోధకులే  తేల్చాలి.
కామెంట్‌లు
డా కె.ఎల్.వి.ప్రసాద్ చెప్పారు…
చక్కని పరిశోధనాత్మక వ్యాసం రాసారు. మరిచిపోయిన కొన్ని పదాలు గుర్తు చేసారు.
ఉదాహరణకు, చెలక,కొన్డ్ర వంటివి. కృతజ్ఞతలు సర్
---డా కె.ఎల్.వి.ప్రసాద్
హన్మకొండ
డా కె.ఎల్.వి.ప్రసాద్ చెప్పారు…
సర్, మీరు నడుస్తున్న జానపద విజ్ఞాన సర్వస్వం లా కనిపిస్తారు. మీ ప్రతి వ్యాసంలో ఎంతో విశ్లేషణ, ఎంతో పరిశోధన, విస్తృత విషయ వైవిధ్యము కనిపిస్తుంటాయి. ఏదో ఒక రోజు జానపద విశ్వాసాలపై శాస్త్రీయ పరిశోధన జరుగుతుందని ఆశించేవారిలో నేనొకరిని. మీకు నమః పూర్వక అభినందనలు.
---సి.విజయకుమార్
అమెరికా.
డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్ చెప్పారు…
శ్రీ నాగపట్ల భక్తవత్సలరెడ్డి గారికి...
ఆత్మీయ నమస్కాములు. అవిభక్త వరంగల్ జిల్లా, తొర్రూరు మండలానికి అతి సమీపంలో గల
అమ్మాపురం గ్రామంలో నేను
04.09.1958 లో జన్మించాను.
మా నాన్న
కీ.శే అడ్లూరు
లక్ష్మీ నరసింహశాస్త్రి గారు
40 సంవత్సరాలపాటు అమ్మాపురం గ్రామ పోలీస్ పటేల్ గా పనిచేశారు..
కీ.శే తమ్మెర వీరభద్రరావు గారూ గ్రామ కరణం/ పట్వారిగా పనిచేశారు...
గ్రామంలో పెత్తనం మొత్తం బ్రాహ్మణుల మరియు
కర్ణాలదే ఉండేది..
దాదాపు 10 ఇండ్ల పైననే
ఉండేవి. ఇప్పుడు కాలక్రమేణా
ఇండ్లు శిధిలాలయ్యి, అనేక కారణాలతో ఒకటీ రెండు తప్ప అన్నీ కనుమరుగయ్యాయి.

మీ విశ్లేషణ చాలా బాగుంది..

అహం ధన్యోస్మి.....
REMINISCENCES...
మీ...
అడ్లూరు నరసింహమూర్తి
రిటైర్డ్ మ్యాథ్స్ లెక్చరర్
జన్మ స్థలం: అమ్మాపురం
నివాసం: పరిమళ కాలనీ
హనుమకొండ.
డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్ చెప్పారు…
నిజానిజాలెలా ఉన్నా
గ్రామీణ ఆచార వ్యవహారాలు బాగా చెప్పారు భక్తవత్సల రెడ్డిగారూ
కృతజ్ఞతలు
----సి.ఎస్. రాంబాబు
హైదరాబాద్
డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్ చెప్పారు…
అతి క్లిష్టమైన వ్యాసాన్ని అందరికీ అర్థం అయ్యే రీతిలో చాలా సులువుగా వ్రాసిన భక్తవత్సల రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు. నిజానికి అవి నమ్మకాలే కావొచ్చు కానీ కొన్ని ఆచారాలు అందరి(ఒక గ్రూపు) ఆమోదంతో చాలా కాలం నుండి నిరంతరంగా ఆచరిస్తారు. అంతే కాక జానపదుల పాటలు, సామెతలు ఎంతో అనుభవంతో చెప్పినవి కాబట్టి ఈ నమ్మకాలలో కూడా ఏమైనా శాస్త్రీయ ఆలోచన ఉందా అని కూడా పరిశోధనలు చేస్తే పూర్వపు ఋషులు చెప్పిన ఎన్నో అద్భుతమైన విషయాల లాగే ఎంతో విలువను సంతరించు కోవచ్చునేమో. ఇది చాలా కష్టమైనా ఒక ఆలోచన మాత్రమే.
జితేందర్ రావు
డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్ చెప్పారు…
నమస్కారం సర్.
నిజంగా మీరు జానపద విజ్ఞాన భాండాగారం. మీరు చెప్పిన విషయాలు కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తున్నాయనడంలో సందేహం లేదు. మీరన్నట్లు జానపద విజ్ఞానాన్ని సంప్రదాయ విజ్ఞానంతో తులనాత్మకంగా అధ్యయనం చేస్తే ఇంకెన్ని నూతనాంశములు తెలుసుకోగల్గుతామో!
----డి.వి.శేషాచార్య
కరీంనగర్.
డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్ చెప్పారు…
భక్తవత్సల రెడ్డి గారి జానపద సాహిత్య వివరణలతో కొత్త కొత్త విషయాలు తెలుసుకునే భాగ్యం కలిగింది. ప్రతీ సారి ఒక పరిశోధనాత్మక గ్రంధాన్ని చదివినట్టుగా అనుభూతి కలుగుతుంది. ధన్యవాదాలు.
--'ఆచార్య ఏ వి నరసింహ రావు