ఇరువురూ సమానమే; - డా.. కందేపి రాణీప్రసాద్.

     సమత భయభయంగా ఇంట్లోకి అడుగుపెట్టింది. ఏమిటి ఇంతాలస్య మైంది? ఎక్కడికి వెళ్లావు? దాడి ఇప్పుడే నీకోసం స్కూలు దగ్గరకు వెళ్ళారు. నేనింత మాట్లాడుతున్నా ఉలకక పలకక నిలబడ్డావేం? అంటూ అమ్మ కోపంగా చూస్తూ అన్నది.
‘ అమ్మా స్కూలులో కుస్తీ పోటిలుంటేనూ ‘ అంటూ సగంలోనే ఆగిపోయింది సమత. ఏంటి కుస్తీ పోటిలా. నువ్వు ఆడపిల్లవే మగపిల్లాడివి కావు. ఆడపిల్లలు వంటలు, ముగ్గులు, కుట్లు లాంటివి నేర్చుకోవాలి గానీ ఈ కుస్తీ పోటీలేమిటి? అంటూ ఇంకా కోపంగానూ ఆశ్చర్యంగానూ అన్నది.
అప్పుడే ‘ నమస్కారమమ్మా’! అంటూ సమత వాళ్ళ స్కూలు హెడ్మాస్టరు గారు లోపలికి పెద్ద స్పోర్ట్స్ కప్ తో అడుగు పెట్టారు. “ ఈ రోజుల్లో ఆడపిల్ల, మగపిల్లాడు ఏంటమ్మా. మన జిల్లా మొత్తానికి ఈ రోజు మీ అమ్మాయి పేరు తెచ్చిందమ్మా. దేవుడి సృష్టిలో అడ, మగ సమానమేనమ్మా ఇద్దరినీ ఒకే రకంగా సృష్టించాడు. అమ్మాయికి మీరు ఇంకా పౌష్టికాహారం పెట్టండి. ఆమెకు ఇష్టమున్న రంగంలో ప్రోత్సహించండి. అప్పుడే తన వృత్తికి సరైన న్యాయం చేయగలదు” అన్నారు హేడ్మాస్టరు గారు.
“ నేనూ ఆడదాన్నేకదండీ. నాకూ ప్రోత్సహించాలనే ఉంటుంది కానీ కాలో, చెయ్యో విరిగితే రేపు పెళ్లెలా చేస్తాం అనే భయంతో ఆపుతున్నాను. కానీ ఇక నుంచి భయపడనండి. అబ్బాయైనా, అమ్మాయైనా సమంగానే చూస్తానండి. ఇద్దరికీ ఒకే న్యాయం జరగాలి. వాళ్ళ డాడికి నేను సర్దిచెప్తానండి” అన్నది సమత వాళ్ళమ్మ దైర్యంగా ఊపిరి పీల్చుకుంటూ. 
కామెంట్‌లు