ముందే చెప్పిన రమణ మహర్షి;-- యామిజాల జగదీశ్
ఓ రెండు వారాల క్రితం మా అన్నయ్య ఆనంద్ ఫోన్ చేసి తూమాటి వీరనారాయణ రెడ్డి గారి గురించి చెప్పి ఆయన నెంబర్ ఇచ్చాడు ఫోన్ చేయమని. భగవాన్ కు సంబంధించి పుస్తకాలు పంపిస్తారన్నాడు. 
నాకంతకుముందు ఏమాత్రం పరిచయం లేని తూమాటి వారికి ఫోన్ చేసి పుస్తకాలు పంపమని ఎట్టా అడగటం? ఒకింత బిడియపడ్డాను. కానీ పుస్తకాలమీదున్న ప్రేమతో ఆయనకు ఫోన్ చేసి మాట్లాడాను. పరిచయం చేసుకున్నాను. ఎంతో మృదువుగా మాట్లాడిన ఆయన నా అడ్రెస్ ఇస్తే పుస్తకాలు పంపిస్తానన్నారు. ఇంకేముంది, ఫోన్ పెట్టేసిన మరుక్షణమే నా అడ్రెస్ పంపాను. ఓ మూడు రోజుల తర్వాత ఆయన నుంచి మూడు పుస్తకాలు అందుకున్నాను. 
అవి ఇవే...
1) అరుణాచల రమణుని సన్నిధిలో శ్రీమతి మా ఫిరోజా తల్యార్ఖాన్
2) ఆంధ్ర మహిళాలలామ పొణకా కనకమ్మ
3) భగవాన్ సన్నిధిలో రామయోగి
మొదటి పుస్తకాన్ని తూమాటివారు అనువదించిన పుస్తకం. 368 పేజీలు. 
మిగిలిన రెండు పుస్తకాలనూ ఆయన కూర్చినవి. 
మూడూ ఒకదానికొకటి పోటీ పడి చదివించేలా ఉన్నాయి. అయినా నన్ను అమితంగా ఆకట్టుకున్న పుస్తకం ఫిరోజా తల్యార్ఖాన్ పుస్తకం. ఈమె పేరు నేను చలంగారెక్కడో ప్రస్తావించగా చదివినట్టు గుర్తు. అంతేతప్ప నాకేమాత్రం వివరాలు తెలియవు ఆమె గురించి. అయితే ఇప్పుడు చదివిన ఈ పుస్తకంతో ఎన్నెన్ని విషయాలు తెలిసాయో చెప్పలేను.
ఫిరోజా గారు ఇంగ్లీషులో రాసిన పుస్తకాన్నే తూమాటివారు అనువదించారు. ఈ పుస్తకం ఫిరోజా గారు రాయడానికి ముఖ్యకారకులు మన దేశ మాజీ రాష్ట్రపతి కీ.శే. సర్వేపల్లి రాధాకృష్ణగారు. ఈయనకు 1939 నుంచీ ఫిరోజావారితో పరిచయముంది. ఉన్నతమైన పార్శీ కుటుంబంలో జన్మించి మరొక సంపన్న కుటుంబంలో కోడలిగా ఉండి ఉన్నత వర్గాలతో కలసిమెలసిన ఫిరోజా బాల్యం నుంచి ఆత్మజ్ఞానిగా జీవించాలనే ఆసక్తే ఆమెను అరుణాచలంవైపు అడుగులు వేయించింది. భగవాన్ రమణమహర్షితో మూడు దశాబ్దాలకుపైగా ఉండిన ఫిరోజా గారి జ్ఞాపకాలను గ్రంథస్థం చేయమన్నది రాధాకృష్ణగారే. ఆమె జ్ఞాపకాలు పాఠకులకు ఎంతో స్ఫూర్తిదాయకం. 
ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ ఎక్కడా అనువాదమనిపించదు. అంటే అంత హాయిగా ఉంది చదువుతుంటే. ఒక్క పేజీ వదలనివ్వక పట్టుగా చదివింపచేసే పుస్తకమిది. 
భగవాన్ రమణ మహర్షి మరో మూడు రోజులలో ఈ లోకం విడిచి పెట్టి వెళ్ళిపోతున్న విషయాన్ని రంగస్వామి అనే సేవకుడికి చెప్పారు. ఈ విషయాన్నే రంగస్వామి ఫిరోజా తల్యార్ఖాన్ గారికి 1950 ఏప్రిల్ 12 రాత్రి తెలిపారు. 14వతేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిముషాలకు దేహత్యాగం చేశారు. 
పుస్తకం చదువుతుంటే ఎన్నెన్ని పేర్లో....పైగా వాళ్ళందరూ చిన్నవారు కాదు. అంటే వయస్సు పరంగా చెప్పడంలేదీ మాట. వివిధ రంగాలలో ఉన్నత హోదాల్లో ఉన్నవారితో ఫిరోజాగారికున్న పరిచయాలు, అనుభవాలు చదువుతుంటే ఆశ్చర్యం వేసింది. 
అరుణాలంలో ఉండిన చలంగారింటికి వెళ్ళొచ్చిన రోజుల్లో ఎన్నడూ ఆమె గురించి వినలేదు. ఇన్నేళ్ళకయినా ఆమె జ్ఞాపకాల దొంతర్లను చదువుతుంటే ఎంత ఆనందమేసిందో మనసుకి. 
మూడు మంచి పుస్తకాలు చదివింప చేసిన
ఆత్మకూరు మండలం (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా)లోని బట్టేపాడు గ్రామ వాస్తవ్యులైన తూమాటి వీరనారాయణ రెడ్డిగారికి హృదయపూర్వక ధన్యవాదాలు. 
రెడ్డిగారన్నట్టు రమణభక్తులకు, జ్ఞాన జిజ్ఞాసులకు ఆత్మానందానుభూతిని కలిగించే పుస్తకరత్నాలివి. 
కామెంట్‌లు