ఇదేమీ వొట్టి కుండ కాదు!;-- యామిజాల జగదీశ్
 తమిళనాడులోని శివగంగై జిల్లా మానామదురై అనగానే గుర్తుకొచ్చేది అక్కడి మట్టి. కానీ ఇది చాలా మందికి తెలియని విషయం. 
మానామదురైలో మట్టి సమృద్ధిగా లభిస్తుంది. ఇక్కడి మట్టితో తయారుచేసేవి  పూల కుండీలు, మట్టి కుండలు, ఇటుకలు, పైకప్పు పలకలు, మట్టి బొమ్మలు వంటివి. అయితే వీటితోపాటు చెప్పుకోవలసిన మరొకటి సంగీత వాయిద్యమైన ఘటం! ఇక్కడ తయారయ్యే ఘటం అత్యంత ప్రసిద్ధమైంది. ఇది పురాతన వాయిద్యాలలో ఒకటి. 
ఇది చూడటానికి అచ్చం కుండలాగానే ఉంటుంది, కానీ సంగీత వాయిద్యాలలో ఒకటై దీనిపై పుట్టించే ధ్వని అందరినీ మంత్రముగ్ధులను చేస్తుందనడం అతిశయోక్తికాదు. 
ఇక్కడ ఘటం తయారు చేసే ఓ కుటుంబాన్ని కేంద్ర ప్రభుత్వ సంగీత అకాడమీ 2013లో జాతీయ అవార్డుతో సత్కరించింది. 
కర్ణాటక సంగీత కచేరీలలో మట్టి కుండలను ఓ వాయిద్యంగా ఉపయోగించడమేమిటని  ఆశ్చర్యపోవచ్చు. కానీ ఒడిలో ఈ మట్టికుండను ఉంచుకుని వాయించడం ఓ ప్రత్యేకమైన కళ. ఇందుకు ప్రావీణ్యం అవసరం. 
పంజాబ్ జానపద  సంగీత సంప్రదాయాలలో ఒక భాగమైన ఈ వాయిద్యాన్ని ఘర్హా అని పిలుస్తారు. 
రాజస్థాన్‌లో దీనినే మద్గా, పాని మాటాకా (వాటర్ జగ్) అని పిలుస్తారు.
ఘటం తయారు చేసే విధానానికొస్తే కాస్త భిన్నంగా ఉంటుంది. 
మట్టి కుండైన ఘటాన్ని ప్రధానంగా ఇత్తడి లేదా రాగి రజను, తక్కువ మొత్తంలో ఇనుమును కలిపి బంకమట్టితో తయారుచేస్తారు. 
ప్లాస్టిసిన్ బంకమట్టి లేదా నీటిని ఉపయోగించడం ద్వారా సవ్వడిని కొద్దిగా మార్చవచ్చు. కుండ స్వరం బాగా ఉండాలి. లోపలి భాగం  సరియైన స్వరం రావడానికి అనుగుణంగా తగినంత మందం కలిగి ఉండాలి.  
దీనిని చెన్నై, బెంగళూరు వంటి ఇతర ప్రదేశాలలో తయారు చేస్తున్నప్పటికీ మానామదురై ఘటం ప్రత్యేక స్వర నాణ్యతను కలిగి ఉంటుంది.
మానామదురై ఘటం బరువైన, మందపాటి కుండ, మట్టిలో కలిపిన చిన్న ఇత్తడి ముక్కలు కలిగి ఉంటుంది. ఈ రకమైన ఘటం వాయించడం కష్టమైనప్పటికీ  పదునైన లోహ రింగుల ద్వారా పుట్టే ధ్వని వినడానికి బాగుంటుంది.
ఘటం తయారు చేయడానికి బంకమట్టిని వివిధ ప్రాంతాల నుంచి సేకరిస్తారు. దీనిని అయిదు లేదా ఆరు కొలనుల నుంచి సేకరిస్తారు. దీనిని ఒక రోజంతా ఎండబెడతారు. దీనితో వైగై తీరం నుంచి తీసుకువచ్చే ఇసుకనం కలుపుతారు. అనంతరం ఎండలో నాలుగు గంటలు ఉంచుతారు. ఆ తర్వాత గ్రాఫైట్ కలిపి ఆరు గంటలపాటు బాగా తొక్కుతారు.రెండు రోజుల తర్వాత మళ్ళీ ఎండబెట్టి గట్టిమట్టి మిశ్రమం తయారయ్యేలా చేస్తారు. అనంతరం పెద్ద మట్టి గడ్డలను విద్యుత్ చక్రాల మధ్య ఉంచి దానిని తిప్పుతారు.
కార్మికులు తమ చేతులతో కుండ ఆకారంలో తయారు చేస్తారు. తర్వాత ధ్వని బాగా పుట్టేటట్టు కుండమీదంతా కొట్టిచూసి బాగుందనిపించాక రెండు వారాలపాటు ఆ కుండను నీడలో ఉంచుతారు. అనంతరం మరో నాలుగు గంటలు ఎండలో ఉంచీ కుండ వేడెక్కేటట్టు చూస్తారు. తర్వాత ఆ కుండకు కాషాయరంగు పూయడంతో అది తళతళలాడుతూ కనిపిస్తుంది. అక్కడితో తయారీపని అయిపోదు. ఆ తర్వాత పన్నెండు గంటలపాటు ఓవెన్‌లో ఉంచుతారు. ఈ క్రమంలో సగం బరువు తగ్గుతుంది. ఈ విధంగా తయారయ్యే మానామదురై ఘటం బరువు ఎనిమిది కిలోల వరకూ ఉంటుంది. వంటకు ఉపయోగించే మట్టికుండకన్నా ఇది మూడు రెట్ల ఎక్కువ బరువు కలిగి ఉంటుంది. అయితే కొంతమంది వాయిద్య కళాకారులు తమకనుకూలంగా ఇతర ప్రాంతాలకు తీసుకుపోవడానివీలుగా కాస్తంత బరువు తక్కువలో ఘటాన్ని తయారుచేయించు కుంటారు. ఒక్కో ఘటం ధర ఆరు వందల రూపాయలపైనే ఉంటుంది. కానీ చైనాబంకమట్టితో తయారుచేసే ఘటాల ధర వేలల్లో ఉంటుంది.
మానామదురైలో తయారయ్యే ఘటాలన్నీ అమ్మకానికి రావు. కారణం, కొన్నిసార్లు ధ్వని విషయంలో నాణ్యత తగ్గడమే. ఘటం తయారు చేసే వారందరూ క్రమపద్ధతిలో సంగీతం తెలిసిన వారు కాకపోవటమూ ఓ కారణమే. వీటిని తయారుచేయడంవల్ల వచ్చే లాభం నామమాత్రమే అయినప్పటికీ కొన్ని కుటుంబాలవారు ఘటం తయారుచేస్తున్నాయి.
వాయిద్య పరికరాలలో చాలా వరకు జంతువుల చర్మాన్ని ఉపయోగించేచేస్తారు. 
కానీ ఘటం మాత్రమే పంచభూతాలతో తయారవుతోంది. భూమి నుంచి సేకరించిన మట్టిని గాలి, ఆకాశంలోని సూర్యరశ్మి, నీరు, నిప్పులో కాల్చి దానికో రూపం ఇస్తారు. ఇదండీ ఘటం ముచ్చట.
దక్షిణ భారతదేశంలో ఘటం వాయించే కళాకారులెక్కువమందే ఉన్నారు. వినాయక్ రాం అనే సంగీత విద్వాంసుడు ఘటం వాయించడంలో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయన వాయించే తీరే వేరు. 1942 ఆగస్ట్ 11న తిరుచిరాపల్లిలో జన్మించిన ఈయన తన తండ్రిగారైన టి.ఆర్. హరిహర శర్మ నుంచి ఇందులో ఓనమాలు నేర్చుకున్నారు. అనంతరం శ్రీ జయగణేశ్ తాళ వాయిద్య విద్యాలయం (చెన్నై) నుంచి శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ పొందారు. ఆయన పదమూడో ఏట అరంగేట్రం చేశారు. ఎందరో ప్రముఖ గాత్ర విద్వాంసులకు ఆయన ఘటంతో వాయిద్యసహకారమందించారు. ఆయన దగ్గర శిక్షణ పొందినవారనేకులు. అలాగే దేశవిదేశాలలో పలుచోట్ల ఘటానికి సంబంధించి పాఠాలు చెప్పారు. ప్రదర్శనలిచ్చారు. 1970లో ఆలిండియా రేడియోకు స్వల్పకాలం తన సేవలు అందించిన ఆయన 1974లో బెర్క్ లీలోని ప్రపంచ సంగీత కేంద్రంలో లెక్చరరుగా పని చేశారు. 
ఇక దేశంలోనే ఘటం వాయించిన తొలి మహిళగా సుకన్య రాంగోపాల్ చరిత్రపుటలకెక్కారు. నలభై ఏళ్ళకుపైగా ఘటం వాయిస్తున్న సుకన్య మొదట్లో మృదంగం వాయించడం నేర్చుకున్నారు. శ్రీ జయ గణేశ్ తాళ వాయిద్య విద్యాలయంలో ఆమె పన్నెండో ఏట మృదంగం నేర్చుకున్నారు. అనంతరం హరిహర శర్మ దగ్గర ఘటం నేర్చుకున్న ఆమె గురుమూర్తి దగ్గర వాయులీనంలోనూ శిక్షణ పొందారు. విక్కు వినాయకం దగ్గర కఠోర స్థాయిలో ఘటం వాయించడం నేర్చుకుని ఓ గొప్ప సంగీత విద్వాంసురాలిగా స్థిరపడ్డారు.
కామెంట్‌లు