ప్లీజ్! నాకు ఒక సహాయం చేసిపెట్టవా (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు
 వాసు 9వ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి చదువులో వెనుకబడి ఉండేవాడు. అల్లరి బృందంతో కలిసిపోయి సమయమంతా ఆటలకు కేటాయించడం, చెడు పనులను చేయడం వాసు నిత్య కృత్యం. క్రికెట్ అంటే చాలా పిచ్చి. అల్లరి పనులతో ఇంటి మీదకు గొడవలు తేవడం వాసుకు మామూలు అయింది. తల్లిదండ్రులు చదువుకోమని, ఆటలు, అల్లరి పనులు మానమని ఎంత చెప్పినా ఫలితం శూన్యం. ఆదివారాలు, సెలవు రోజుల్లో అసలు ఇంటి పట్టునే ఉండడు‌. వాసు స్నేహితులకు చెడు వ్యసనాలు కూడా బాగా ఉన్నాయి. ఇది తెలిసిన తల్లిదండ్రుల ఆందోళనకు అంతు లేదు. కానీ వాసు మాత్రం ఆ చెడు వ్యసనాలను అంటించుకోవడం లేదు. ఇప్పుడు వాసు 9వ తరగతిలోకి వచ్చాడు. వచ్చే సంవత్సరం 10వ తరగతి. ఇప్పటి నుంచైనా కష్టపడకపోతే 10వ తరగతిలో ఫెయిల్ కావడం ఖాయం. వాసు ఇంటి పక్కనే అతని ప్రాణ స్నేహితుడు రాము ఉన్నాడు. "ఒరేయ్ అన్నయ్యా! ఇద్దరం కలిసి చదువుకుందాం. అలా కలిసి చదవడం వల్ల ఇద్దరికీ లాభం." అన్నాడు. అయినా మనోడు వింటే కదా!
        వాసు వాళ్ళ పిన్ని కూతురు సిరి. 4వ తరగతి చదువుతున్నది. చిన్నప్పటి నుంచీ వాసు అమ్మమ్మ ఇంటికి వెళ్తే సిరిని వదిలి పెట్టేవాడు కాదు. బాగా ఆడించేవాడు. చెల్లెలు అంటే అన్నయ్యకు పంచ ప్రాణాలు. సిరి వాళ్ళ పాఠశాలలో బోధన సరిగా లేదు. తెలివైన సిరి కూడా చదువులో వెనుకబడుతుంది. అందుకే తల్లిదండ్రులు సిరిని వాళ్ళ పెద్దమ్మ ఇంట్లో ఉంచి ఆ ఊరి పాఠశాలలో చదివించడం మొదలు పెట్టారు. వాసు, సిరిల పాఠశాలలు ఒకే కాంపౌండులో ఉండేవి. 
       అన్నయ్య ఇంటిపట్టున ఉండకపోవడం సిరికి బాధ అనిపించింది. ఎక్కడికి వెళ్తున్నాడో చూద్దామని రహస్యంగా వాసును అనుసరించింది. ఒక తోటలో దూరినారు. ఆ అల్లరి బృందంతో కలిసి వాసు రాళ్ళతో పళ్ళను రాలగొడుతున్నాడు. రాలిన పళ్ళనన్నింటినీ వాసు చేత ఏరిస్తున్నారు. సిరి ఆ అల్లరి బృందంతో "మీకు ఇంటివద్ద చేయవలసిన హోం వర్క్ ఏమీ లేదా? ఇలా రోజూ ఆటలు ఆడుతూ చెడ్డ పనులను చేస్తుంటే చదువు ఎలా వస్తుంది. పైగా దెబ్బలు తినాల్సి వస్తుంది." అంది. "పో పోవే! పెద్ద చెప్పొచ్చావు నీతులు. భూమికి జానెడు లేవు. నువ్వా మాకు నీతులు చెప్పేది? మా జోలికి వస్తే బండకేసి బాదుతాం." అన్నాడు రమణ. వీళ్ళకు నీతులు చెప్పడం బురద గుంటలో రాయి వెయ్యడం లాంటిదే అనుకుంది సిరి. మౌనంగా ఇంటికి వచ్చింది. ఎలాగైనా అన్నయ్యను వీళ్ళ నుంచి దూరం చేసి, చదువులో పడెయ్యాలి అనుకుంది సిరి.
      మరునాడు సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి రాగానే వాసు బయటికి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాడు. సిరి అన్నయ్య వద్దకు వచ్చి, "అన్నయ్యా! నాకు ఒక సహాయం చేయవా! నాకు హోం వర్క్ ఇచ్చారు. దయచేసి ఈ ప్రశ్నలు అప్పజెప్పించుకోవా." అన్నది. చిట్టి చెల్లెలి కోరిక కాదనలేక అప్పజెప్పించుకున్నాడు. "అన్నయ్యా! ఈ లెక్కలు నాకు అర్థం కావడం లేదు. చెప్పవా."అంది సిరి. ఎంత చదువులో వెనుకబడినా 4వ తరగతి లెక్కలు చెప్పలేడా? ఇలా రోజూ సమయం అంతా చెల్లెలితోనే గడిచిపోతుంది అన్నయ్యకు. ఆటలకు సమయం ఉండటం లేదు. చదువులో చెల్లెలి పట్టుదల చూసి తనకూ చదవాలని ఎంతగానో అనిపిస్తుంది. కానీ చదవలేక పోతున్నాడు. ఆదివారాలు, సెలవు రోజుల్లో ఆటలు ఆగడం లేదు.
        ఒక ఆదివారం వాసు ఎక్కడ ఆటలు ఆడుతున్నాడో చూడటం కోసం సిరి వెళ్ళింది. క్రికెట్ ఆడుతున్నాడు. రమణ కొట్టిన షాటుకు బాల్ వెళ్ళి సిరికి తగిలింది. సిరి స్పృహ కోల్పోయింది. వాసు హుటాహుటిన సిరిని ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. సిరి కోలుకుంది. "సెలవు రోజుల్లో నాతోనే ఆడుకోవా అన్నయ్యా! నాతో ఆడేవారు ఎవరు చెప్పు! నాకు ఈ సహాయం చేసిపెట్టవా" అని సిరి వాసును బతిమాలింది . అలాగే అని వాసు ఇంటిపట్టున ఉంటూ తీరిక సమయాల్లో చిట్టి చెల్లెలితో చెస్, క్యారమ్, షటిల్ వంటి చాలా ఆటలు ఆడుతున్నాడు. వాసు రమణతో తరచూ చెబుతుంటాడు. బరువైన బాల్స్ తేవద్దని, భారీ షాట్స్ కొట్టవద్దని. అయినా రమణ లెక్క చేయలేదు. చివరికి తన చెల్లెలి ప్రాణం మీదికి వచ్చింది.
       ఒకరోజు వాసుకు రమణ ఎదురై ఆటలకు ఎందుకు రావడం లేదని అడిగాడు. చదువు తనకు ముఖ్యమని, తన చెల్లెలితో ఆటలే తనకు ముఖ్యమని, ప్రాణాలు తీసే ఆటలు తాను ఆడనని చెప్పాడు వాసు. రమణ "మర్యాదగా నాతో ఆటలకు వస్తావా? లేదా?" అని బెదిరించాడు. "నాకు భయం అవుతుంది. అలా గుడ్లురిమి చూడకు. వస్తా. కానీ ఒక షరతు. మా చెల్లెలికి తెలియని చోట ఆడాలి." అన్నాడు వాసు. వాసు ఒక కాలనీలో ఇళ్ళ మధ్యలో రోడ్డుపై ఆడించాడు. రమణ బ్యాటింగ్. వాసు బౌలింగ్. మాటిమాటికీ పెద్ద షాట్స్ కొట్టవద్దని వాసు హెచ్చరిస్తున్నాడు. రమణ కావాలని భారీ షాట్స్ కొడుతున్నాడు. వాసు బంతి బంతికీ హెచ్చరిస్తున్నాడు. కానీ భారీ షాట్స్ కొట్టేందుకు వీలుగా బౌలింగ్ చేస్తున్నాడు. రమణ కొట్టిన ఒక భారీ షాట్ ఒక ఇంటి ఖరీదైన అద్దాలను పగలకొట్టింది. అక్కడ సి.సి. కెమెరా ఉంది. ఆ ఇంట్లోని వారు రమణను పట్టుకొని భారీగా డబ్బులు ఇవ్వాలని లేనిచో పోలీసు కేసు పెడతామని బెదిరించాడు. రమణ తల్లిదండ్రులు భారీ మూల్యం చెల్లించారు. రమణను కాళ్ళు విరగ్గొట్టి ఇంట్లో పడేశారు. ఇన్నాళ్ళూ రమణ మూలంగా చెడ్డ దారి పట్టిన పిల్లలు ఇప్పుడు ఆ నాయకుణ్ణీ మరియు ధైర్యాన్ని కోల్పోయి ఇంటి పట్టునే ఉంటూ చదువుకోవడం మొదలు పెట్టారు. 
      "ఒరేయ్ అన్నయ్యా! నాతో పాటూ నువ్వూ చదువుకో. నాతో కలిసి చదువుకునే వాళ్ళు లేకపోవడం వల్ల నాకు ఏమీ చదవబుద్ధి కావడం లేదు. మనం పోటా పోటీగా చదువుకుందాం. నువ్వు ఇంటి వద్ద బాగా చదువుకుంటూ మంచి మార్కులు తెచ్చుకుంటేనే నీతో చదువు చెప్పించుకుంటా. లేకపోతే మన పొరుగింట్లో ఉన్న రాము అన్నయ్యతో చెప్పించుకుంటా." అన్నది సిరి. వాసు చక్కగా చదువుకోవడం మొదలు పెట్టాడు. తన తరగతిలో మొదటి ర్యాంకు వచ్చే వాణీ సహాయం తీసుకుంటూ తెలివైన విద్యార్థి అయినాడు.

కామెంట్‌లు
Naresh చెప్పారు…
Wow,👍👍👏👏