కల్కి అవతారం. పురాణ బేతాళ కథ.; డాక్టర్. బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై

 విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించి ఉన్నబేతాళుని బంధించి భుజంపైనచేర్చుకుని నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు ' మహరాజా నీ పట్టుదలమెచ్చదగినదే నాకు కల్కిఅవతారం గురించి తెలియజేయి. తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు' అన్నాడు.
బేతాళా  కల్కి అవతారము, దశావతారములలో పదవ అవతారము అని హిందువుల విశ్వాసము. కలియుగాంతములో విష్ణువు కల్కిగా అవతరించనున్నట్లు భావిస్తారు. ఇతను "శంభల" అను గ్రామములో విష్ణుయశస్సు అను బ్రాహ్మణుని ఇంటిలో జన్మిస్తాడు. వీర ఖడ్గం ధరించి, తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ, దోపిడీ దొంగలుగా మారిన అందరు నాయకులను సంహరించి తిరిగి సత్య యుగమును ధరణి పై స్థాపిస్తాడు.
"కలక" లేదా "కళంక" అనగా దోషమును హరించే అవతారం గనుక కల్కి అవతారం అన్న పేరు వచ్చిందని ఒక భావన. కల్కి అనగా "తెల్లని గుర్రము" అన్న పదం ఈ నామానికి మూలమని కూడా ఒక అభిప్రాయం. బౌద్ధ కాలచక్ర గాధా సంప్రదాయంలో "శంభల" రాజ్యాన్ని పాలించారనబడే 25 మంది పురాణపురుషులకు కల్కి, కులిక, కల్కిరాజు వంటి సంబోధనలున్నాయి.
"అవతారం" అనగా ఒక నిర్దిష్టమైన ప్రయోజనం కొరకు భగవంతుడు దిగివచ్చిన (అవతరించిన) రూపం. గరుడ పురాణంలో విష్ణువు దశావతారాలలో పదవ అవతారంగా కల్కి అవతారం చెప్పబడింది. భాగవత పురాణంలో ముందుగా 22 అవతారాలు చెప్పబడ్డాయి. తరువాత మరొక మూడు అవతారాలు చెప్పబడ్డాయి. మొత్తం 25 అవుతాయి. వీటిలో 22వ అవతారంగా కల్కి అవతారం పేర్కొనబడింది. సాధారణంగా కల్కి అవతారం "ధూమకేతువు వంటి ఖడ్గం చేబట్టి దూకు గుర్రమునెక్కి దుష్టులని వధించు" మూర్తిగా వర్ణిస్తారు. విష్ణు పురాణంలో కల్క్యావతారం ప్రస్తావన ఉంది. అగ్ని పురాణం (గౌతమ బుద్ధుడు దశావతారాలలో ఒకడని అగ్నిపురాణంలో మొదటిసారిగా వ్రాశారు) లో కూడా కల్కి గురించి చెప్పారు. వీటికి చాలా తరువాతి కాలందని భావింపబడే కల్కి పురాణంలో కల్కి అవతారం గురించి విపులంగా చెప్పారు.
అగ్ని పురాణం - దుష్టులు (అనార్యులు) సత్పురుషు
లను పీడించే సమయంలో, కల్కి భగవానుడు విష్ణుయశుని పుత్రునిగా, యాజ్ఞవల్క్యుని శిష్యునిగా అవతరిస్తాడు. చతుర్వర్ణ వ్యవస్థను పునరుద్ధరిస్తాడు. జనులు తిరిగి సన్మార్గోన్ముఖులవుతారు. అనంతరం కల్కి అవతారాన్ని సమాప్తి గావించి హరి వైకుంఠానికి వెళతాడు. తిరిగి సత్యయుగం ఆరంభమవుతుంది.
విష్ణు పురాణం - వేదోక్త ధర్మ విధులు క్షీణించినపుడు కలికాలాంతం సమీపిస్తుంది. అపుడు విరాట్పురుషుడు కల్కిగా శంభల గ్రామంలో విష్ణుయశుని ఇంట అవతరిస్తాడు. తన పరాక్రమంతో మ్లేచ్ఛులను, చోరులను నాశనం చేస్తాడు. దర్మాన్ని పునరుద్ధరిస్తాడు. జనులు సన్మార్గాన్ని అనుసరించ మొదలు పెడతారు. అలాంటివారి సంతానం కృతయుగధర్మాన్నిఆచరిస్తారు. సూర్యుడు, చంద్రుడు,, బృహస్పతి ఒకే రాశిలో ఉన్నపుడు కృతయుగం ఆరంభమవుతుంది.
పద్మ పురాణం - కల్కి దేవుడు కౄరులైన మ్లేచ్ఛులను సంహరించి, విపత్తులను తొలగించి సద్బ్రాహ్మణులకు సత్యం బోధిస్తాడు. వారి క్షుధార్తిని పరిహరిస్తాడు. అప్రతిహతంగా ధర్మరాజ్యాన్ని పరిపాలిస్తాడు.
భాగవతం - కలియుగాంతంలో సాధువుల ఇంట కూడా దైవచింతన నశిస్తుంది. శూద్రులు ఎన్నుకొన్న వారే పాలకులౌతారు. యజ్ఞయాగాదులు మచ్చునకైనా కానరావు. అపుడు భగవంతుడు అవతరించి ఈ విపత్తును దూరం చేస్తాడు. భగవానుడు దేవదత్తమనే తెల్లని గుర్రాన్ని అధిరోహించి, ఖడ్గము చేతబట్టి భూమండలంపై విహరిస్తూ సకలసద్గుణైశ్వర్యాలను ప్రదర్శిస్తాడు. రాజులుగా నటించే దుష్టులను హతమారుస్తాడు.
కల్కి పురాణం -లో ఈ భావాలన్నీ కలిసి ఉన్నాయ. కల్కికి పరశురాముడు యుద్ధవిద్యలు బోధిస్తాడని చెప్పబడింది'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభగంకావడంతో, శవంతోసహా మాయమైన బేతాళుడు తిరిగి చెట్టువద్దకు చేరాడు.పట్టువదలనివిక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.

కామెంట్‌లు