శక్తి మహర్షి .పురాణ బేతాళ కథ...; డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించి ఉన్నబేతాళుని బంధించి భుజంపైనచేర్చుకుని నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు ' మహరాజా నీ పట్టుదలమెచ్చదగినదే నాకు శక్తి మహర్షి గురించి తెలియజేయి. తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు' అన్నాడు.
' బేతాళా శక్తి మహర్షి హిందూ పురాణాలలో ఒక మహర్షి. వశిష్ఠ మహర్షి, అరుంధతిల 100 మంది కుమారులలో మొదటివాడు. ఇతని భార్య అదృశ్యంతి, కుమారుడు పరాశరుడు.
శక్తి మహర్షి గురించి మహాభారతంలో ఒక పురాణ కథ ఉంది. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన అయోధ్య నగరాన్ని పాలిస్తున్న కల్మషపాదుడు ఒకరోజు వేట కోసం అడవికి వెళ్ళి అడవిలో చాలా జంతువులను చంపుతాడు. అలసిపోయి, ఆకలితో, దాహంతో ఉన్న కల్మషపాదుడు వసిష్ఠ మహర్షి ఆశ్రమ సమీపంలో తిరుగుతూ ఉన్నాడు. కట్టెల కోసం వెలుతున్న శక్తి మహర్షి అదే మార్గంలో ఎదురుగా వచ్చాడు. శక్తి మహర్షి తల వంచుకుని తన పనిమీద తను వెళ్ళిపోతుండగా, పక్కకు తప్పకొని తనకు దారి ఇవ్వమని కల్మషపాదుడు, శక్తి మహర్షిని ఆజ్ఞాపించాడు. అప్పుడు శక్తి మహర్షి, కల్మశపాదుడితో "ఓ రాజా ఇది నా మార్గం. విధి, సంప్రదాయానికి అనుగుణంగా ఒక రాజు ఎల్లప్పుడూ బ్రాహ్మణులకు మార్గం చూపాలి" అన్నాడు. కల్మషపాదుడు రాక్షసుడిలా క్రూరంగా వ్యవహరించి శక్తి మహార్షిని చేతికర్రతో గట్టిగా కొట్టాడు. శక్తి మహర్షి ఆగ్రహంతో ఏ కారణం లేకుండానే దారిన వెడుతున్నవాణ్ణి అవమానించావు, రాక్షసుడిలా నన్ను కొట్టావు కనుక రాక్షసుడివై మాంసాహారం తింటూ జీవించు అని శపించాడు.
శక్తి మహర్షి శాపం వల్ల రాక్షసుడిగా మారిన కల్మషపాదుడు మొదట శక్తి మహర్షిని చంపి మింగేసాడు. ఆ తరువాత, కల్మషపాదుడు వశిష్ఠ మహర్షి 100మంది కుమారులు వరుసగా చంపి తినేశాడు.'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభగంకావడంతో, శవంతోసహా మాయమైన బేతాళుడు తిరిగి చెట్టువద్దకు చేరాడు.పట్టువదలనివిక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.
కామెంట్‌లు