శకటాసుర సంహారం .పురాణ బేతాళ కథ..; డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై ,
 విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించి ఉన్నబేతాళుని బంధించి భుజంపైనచేర్చుకుని నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు ' మహరాజా నీ పట్టుదలమెచ్చదగినదే నాకు శకటాసురుడు గురించి తెలియజేయి. తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు' అన్నాడు.
బేతాళా శ్రీరాముడు ఎప్పుడు ఎక్కడా తానజీవితకాలంలో దైవస్వరూపుడని చెప్పుకోలేదు మామూలు మనిషిలాగానే ఆదర్శగా జీవించాడు. శ్రీకృష్ణుడు మాత్రం బాల్యంనుండి తనలీలలతో అందరికి తను ఎవరో తెలియజేసాడు.కంసుడు పంపగా శ్రీకృష్ణుని ైఅంతమొందించడానికి వచ్చినవాడు శకటాసురుడు. శకటాసుర సంహారం చాలా చిన్న ఘట్టం.
ఒకనాడు కృష్ణపరమాత్మ బోర్లా పడ్డాడు. పిల్లలను మొదట్లో పడుకోపెట్టినపుడు ఎటు పడుకున్నవాడు అటే పడుకుంటాడు. పసిపిల్లవాడు మొదట చేసేపని బోర్లాపడడం. పిల్లవాడు బోర్లాపడితే ఆ రోజున యింట్లో అదొక పెద్ద ఉత్సవం. బోర్లాపడ్డాడు అని బొబ్బట్లు మొదలయిన పిండివంటలు వండుకు తినేస్తారు.
కానీ యశోద అలా చెయ్యలేదు. ముత్తైదువలను పిలిచి వాళ్ళకి పసుపు కుంకుమలను ఇచ్చింది. వాళ్లకి చీరలు, రవికల గుడ్డలు పెట్టింది. బ్రాహ్మణులను పిలిచి వారికి గోదానము చేసింది. ఈశ్వరునికి అభిషేకం చేసింది. యశోద అన్నిటికి దైవం వైపు చూస్తోంది. యశోద అంటే యశస్సును ఇచ్చున్నది అని అర్థము. కీర్తి ఎటు పక్కనుంచి వస్తుందో జీవితము ఎటువైపు నడవాలో యశోదవైపు నుంచి తెలుస్తుంది. పిల్లాడు బోర్లాపడితే మనం బొబ్బట్లు వండుకు తినడం కాదు! శివాలయమునకు వెళ్ళి అభిషేకం చేయించాలి. లేదా రామాలయమునకో, కృష్ణాలయమునకో వెళ్ళి తులసి పూజ చేయించాలి. నీ మనవడు బోర్లాపడే అదృష్టం ఈశ్వరుడు నీకు సమకూర్చినాడు. పిల్లవాడు వృద్ధిలోకి రావడమును ఈశ్వరానుగ్రహంగా భావించాలి. నందుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇంటికి అందరూ వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు. యాదవుల ఐశ్వర్యం అంతా పశువులు, పాడి. వాళ్ళ ఐశ్వర్యం అంతా పాలకుండలు, పెరుగు కుండలు, నేతి కుండలు, అరటి పళ్ళ గెలలు మొదలయినవన్నీ పెట్టారు. బండికి కూడా ఒక తోరణం కట్టేశారు. అక్కడే ఒక మంచం వేశారు. ఆ మంచం మీద ఒక పరుపు వేశారు. ఆ పరుపు మీద కృష్ణుడిని పడుకోబెట్టారు. ఉత్సవం అంతా కృష్ణుడు బోర్లాపడ్డాడు. కాబట్టి అతడికోసం చేస్తున్నారు. కానీ ఉత్సవం వేడుకలో పడి ఈయనని మరచిపోయారు. ఈయనకు ఆకలి వేసింది. పడుకున్న పిల్లాడికి కాళ్ళు ఎత్తడం తప్ప ఇంకేమీ రాదు. ఆయన పక్కనే బండి ఉన్నది. ఆయనది చిన్ని అరికాలు. దానికి పెసర గింజలంత చిన్నిచిన్ని వేళ్ళు. అందులోనే శంఖం, చక్రం, నాగలి, అమృతపాత్ర మొదలయిన దివ్యచిహ్నములు. అటువంటి కాలితో బండిని ఒక్క తన్ను తన్నాడు.
ఈయన కాలు తగలగానే ఆ బండి ఆకాశంలోకి ఎగిరిపోయింది. దాని చక్రములు, ఇరుసు అన్నీ ధ్వంసం అయిపోయాయి. అక్కడి నుండి క్రిందపడిపోయి తుత్తునియ లయిపోయాయి. దీనిని చూసి అక్కడ ఉన్న గోపకాంతలు, యశోద, నందుడు పరుగుపరుగున అక్కడికి వచ్చారు. పిల్లవాడిని చూస్తే చాలా చిన్నవాడు. బండి చాలా పెద్దది. ఆకాశమునకు ఎగిరిపోయేలా బండిని కాలితో తన్నడమేమిటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. అపుడు యశోద పిల్లవాడిని తీసుకుని సముదాయించింది. "అయ్యో! నాన్నా! ఆకలి వేసిందా? నీ కాలు బండికి తగిలిందా? కాలేమీ నొప్పి పెట్టలేదు కదా! అని పిల్లాడిని ఎత్తుకుని పాలిచ్చింది.
 శకటా సుర సంహారం పైకి చిన్న లీల. అంతరమునందు స్వామి ఎంత పెద్ద రహస్యమును దాచారో చూడండి.
కృష్ణ చేష్టితముల వెనక ఒక గొప్ప మర్మం దాగి ఉంటుంది. దానిని ఎవరు అర్థం చేసుకోగలరో వాళ్లకి జీవితంలో ఒక పరిష్కారం లభిస్తుంది. ఒక ఉత్తమమైన దశానిర్దేశం జరుగుతుంది. అటువైపుగా ప్రయాణించడం చేత వారు మనుష్య జీవితంలో చేరుకోవలసిన గమ్యమును చేరుకుంటారు. కథా శ్రవణం చేతకూడా భాగవతం మనిషిని ఉద్ధరిస్తుంది. పరీక్షిత్తు శుకమహర్షి చెప్పిన బాహ్యకథనే విన్నాడు. విని మోక్షమును పొందాడు ' అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభగంకావడంతో, శవంతోసహా మాయమైన బేతాళుడు తిరిగి చెట్టువద్దకు చేరాడు.పట్టువదలనివిక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.


కామెంట్‌లు