నిశ్శబ్ద గీతికలేవో తరంగాలై
మదిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే
నిశీథి చుక్కలన్నీ రంగరించి
నిశ్చలంగా నెలవంకనే కుంచెగ మలిచి
నిర్భయ అక్షరమొకటి రాసుకున్నా...
శిశిరపు జ్వాల రగుల్చుకున్న మదికి
స్వాంతనగా చిగురేసే రెమ్మ తోడైతే
పదబంధాల వంతెన వేసుకున్నా ...
చీలిన భూమికలేవో
మాటల ముళ్ళపొదలై వెలివేస్తే
రాటుదేలిన శిల్పమై మకుటాలను
సంతరించుకున్నా...
ఎదిగే దిశ మరల్చినా
ఒదిగే దశలో సమైక్యతా మనో భావాల
ఔన్నత్యాన్నొంపుకున్నా...
ఆకసపు అంచులు తాకే
శూన్యపు పొరలు చీల్చుకుని
సుతిమెత్తని పుస్తక పువ్వై
పరిమళించుకున్నా...
ఒంటరి నిచ్చెనలో
హృదయం ద్రవించిన ప్రతిసారీ
గుండె గట్టుపైనే నిత్యం చైత్ర మాసపు కోయిలనై
ఆలపిస్తుంటా కవన కౌముదిని!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి