నాన్న నీ జ్ఞాపకాలు ;-మంజీత కుమార్-- బెంగళూరు
 ఆకాశమంత  ప్రేమ
భూదేవంత ఆప్యాయత
చంద్రుడి వంటి చల్లదనం
వెన్నెలవంటి హాయిదనం
 
ఓ నాన్న
నీ చిటికెన వేలు పట్టుకుని నడిచిన గురుతులు
నీ భుజంపై ఎక్కిన మధురానుభూతులు
నీ షర్టు వేసుకుని సంబరపడ్డ క్షణాలు
నీలాగా మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు
గతించిన జ్ఞాపకాలు అంటే నమ్మేదెలా ?
నువ్వు లేవన్న నిజం మదికి తెలిపేదెలా ?
 
తప్పు చేస్తే నేర్పుగా తెలియజెప్పడం
ఒప్పు చేస్తే గర్వంగా మెచ్చుకోవడం
మంచి చెడులు విడమర్చి చెప్పడం
తెలియని విషయాలు ఓపికగా వివరించడం
నీకు తప్ప ఎవరికి సాధ్యం ?
మా భవిష్యత్తు కోసం నువ్వు చేసిన అప్పులు
మా కడుపు నింపేందుకు నువ్వున్న పస్తులు
ఏమిచ్చి తీర్చుకోము నీ రుణం
మా జీవితాలు నీ పాదాలకు అంకితం
 
కష్టకాలంలోనూ ధైర్యంగా ఉండడమే నువ్వు నేర్పిన పాఠం
ఆస్తిపాస్తుల కన్నా ఆప్తులను సంపాదించుకోవడమే మిన్న అన్న నీ గుణం
మాకెప్పటికీ కొండంత బలం
మమ్నల్ని ముందుకు నడిపించే ఆదర్శం
 
 
రేయింబవళ్లు మా కోసమే నీ ఆరాటం
తుది శ్వాస వరకూ చేశావు పోరాటం
నేడు నువ్వు లేవు
మమ్మల్ని వదిలి దూరంగా వెళ్లిపోయావు
 
నీ సిద్ధాంతాలను పాటిస్తూ సాగిపోతాం
నువ్వు వేసిన బాటలో కదులుతాం
మంచిగానే ఉంటాం
నలుగురికి మంచే చేస్తాం
నీ బిడ్డలుగా పుట్టినందుకు నీ పేరును నిలబెడతాం
 
 
 
 


కామెంట్‌లు