*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౭౨ - 072)*
 *పరోపకార పద్ధతి*
శార్దూలము:
*ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాససంత్రస్తులై,*
*యారంభించి పరిత్యజింతు రురువి ఘ్నాయత్తు లై మధ్యముల్,*
*ధీరుల్ విఘ్ననిహన్యమాను లగుచున్ ధృ త్యున్నతోత్సాహులై*
*ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్.*
*తా:*
తక్కువ స్థాయిలో ఆలోచన చేసే పిరికి వారు, ఎదైనా ఒక పని మొదలు పెట్టాలి అంటే చాలా అడ్డంకులు వస్తాయి అని అసలు ఆ పనినే మొదలు పెట్టరు. మధ్యస్థాయి లో ఆలోచించే వారు ఒక పని చేయాలి అని మొదలు పెట్టి అడ్డంకులు రాగానే ఆ పనిని చేయడం ఆపేస్తారు.  ఇక బుద్ధిమంతులు, ఆలోచనా పరులైన ఉన్నత స్థాయి ధైర్యవంతులు ఎన్ని అడ్డంకులు ఎదురైనా మొదలు పెట్టిన పనిని పూర్తి చేసే వరకు వదిలి పెట్టరు. ............ అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*అమృతము సాధించడానికి దేవతలు చేసిన ప్రయత్నం, కాలకూట విషాన్ని గొంతుకలో నిలుపుకున్న నీలకంఠుడు,  పాశుపతం పొందడానికి పార్ధుడు చేసిన ప్రయత్నం, కృష్ణపరమాత్మ ఎదుర్కొన్న కష్టాలు పక్కన పెట్టి ధర్మాన్ని నాలుగు పాదాల నడచేటట్టు చేయగలిగాడు. వీరందరూ కథలలోని పాత్రలు కాదు. మనకు ప్రతీ నిత్యము ప్రేరణ కలిగించే మూర్తీభవించిన కార్య సాధకులు. వీరే కాదు, ఒక వీరేశలింగం గారు, ఒక జయప్రకాశ్ నారాయణ్, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, లాలా లజపతి రాయ్, ఒక నందమూరి తారక రాముడు, ఇలా మన మధ్యలోనే వుండి తాము అనుకున్న పనులను సాధించిన వారు ఎందరో వున్నారు. ఇటువంటి చక్కని ధైర్య వంతమైన జీవితం గడిపి, నలుగురికీ పనికి వచ్చే మార్గంలో నడిచే సద్బుద్ధిని పరాత్పరుడు మనకు కలిగించాలని నిటలాక్షుని వేడుకుంటూ...... .*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు