*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ప్రథమ (సృష్టి) ఖండము - (౭౭ - 77)*
 *నారదముని శివ క్షేత్రాలను, తీర్ధాలను దర్శించుకోవడం - శివ పార్షదులకు శాప విమోచనము - బ్రహ్మ లోకమలో బ్రహ్మ తో శివతత్వమును గురించి ప్రశ్నించుట!*
*మునీశ్వరుడైన నారదమునికి శివతీర్ధ దర్శన అర్హత ప్రసాదించి అంతర్ధానమౌతారు విష్ణుమూర్తి. తరువాత మహాశివుని యందు భక్తితో కూడిన మనసుతో నారదముని ఈ భూమండలము మీద ఉన్న అన్ని శివలింగములను దర్శించుకుంటూ వస్తున్నారు. చూసిన క్షేత్రాన్ని కూడా మళ్ళీ మళ్ళీ చూస్తున్నాడు. శివ మహిమాన్వితుడు అవ్వాలి అనే నారదముని కోరిక అంతకంతకూ బలపడుతూ వుంది. భూమి మీద వున్న భోగములను ఇచ్చి, చివరకు మోక్షమును ప్రసాదించే శివ క్షేత్ర దర్శనం నిరాటంకంగా జరుగోతోంది. నారదముని మనసు, బుద్ధి, ఆలోచనలో కేవలం పరమేశ్వర నామం మాత్రమే నిండి వుంది.*
*ఈ విధంగా శివ ధ్యానంలో నిమగ్నమై ఉన్న నారదముని దగ్గరకు, నారదముని చేత శపించబడిన శివ పార్షదులు (శివ గణాలు) వస్తారు. వారు, పూర్వాశ్రమంలో, శ్రీమతి పరిణయము సందర్భంలో జరిగిన విషయం అంతా నారదమునికి చెప్పుకుని, జరిగిన దాంట్లో "మీది గానీ, మాది గానీ పొరపాటు లేనప్పటికీ, మా అజ్ఞానంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల మీరు మాకు శాపం ఇచ్చారు. మీ శాపం తిరుగు లేనిది. అనుభవించ వలసినదే. కానీ, మహానుభావా ఇప్పుడు మీరు శివ భక్తి సముద్రంలో మునిగి తేలుతూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. కనుక,మా తప్పు మన్నించి, మాకు శాప విమోచన మార్గం తెలియ బరచి మమ్మల్ని కృతార్ధులను, చరితార్ధులను చేయండి", అని ప్రార్థిస్తారు.*
*జరిగిన విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న నారదముని, శివ పార్షదులకు ఇలా చెప్తున్నారు. " ఓ శివ గణములారా. మీరు ధన్యులు. అందరి చేతా పూజింప బడేవారు. నేను, శివ మాయా మోహంలో వుండి మీకు శాపం ఇచ్చాను. నా మాట తప్పదు. జరుగుతుంది. అయితే, మీరు ఇద్దరూ, "విశ్రవుడు" అనే ముని శ్రేష్టునికి కుమారులైన రావణ, కుంభకర్ణులగా జన్మిస్తారు. రాక్షస ప్రవృత్తి కలిగి వుంటారు. శ్రీహరిని ద్వేషిస్తూ వుండి కూడా ఎంతో బలమైన రాజ్యాన్ని నిర్మించుకుని, ప్రశస్తి పొందుతారు. మీరు అతి శివ భకులుగా వుంటారు. సమస్త భూమండలానికి చక్రవర్తులుగా, శివవభక్తులుగా వుంటారు. మహాశివుని వేరొక రూపమైన శ్రీమహావిష్ణువు చేతిలో మృత్యువును పొంది ఆవల మీ శివ లోకం చేరుకుంటారు.*
                   
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు