మూర్ఛ-- కొన్ని విశేషాలు;-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

   మన సమాజంలో మూర్ఛ వ్యాధిని గురించి అనేక అపోహలున్నాయి! మూర్ఛ వ్యాధిని గురించి అనేక వేల సంవత్సరాల క్రితమే వైద్య గ్రంధాల్లో వ్రాసి ఉంది.పురాతన గ్రీకు వైద్యుడు హిపోక్రేట్స్ తన గ్రంథం లో ఈ వ్యాధిని గురించి వ్రాశాడు. మన దేశంలో చరకుడు తన చరక సంహిత గ్రంథంలో ఈవ్యాధిని గురించి లక్షణాలు చికిత్సను గురించి వివరించాడు.
       ఈ వ్యాధిని ఆంగ్లంలో epilepsy అంటారు. ఈ పదాన్ని గ్రీకు భాష నుండి గ్రహించారు. ఈ పదానికి అర్థం 'ఆవహించిన' 'పట్టు వహించిన' అనే అర్థాలు వస్తాయి. అప్పటిలో ఈ వ్యాధిని దుష్టశక్తులు కలుగ చేస్తున్నాయని భావించే వారు.ప్రపంచ ఖ్యాతి గడించిన వారిలో కూడా ఈ వ్యాధి ఉండేది! గ్రీకు తత్వవేత్త సోక్రటీసు,జూలియస్ సీజర్ చక్రవర్తి, నవలా రచయిత ఛార్లెస్ డికెన్స్ ,డచ్ చిత్రకారుడు విన్సెంట్ వాన్ గాగ్,భౌతిక శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ వంటి వారు ఈ వ్యాధి బారీన పడినవారే.ఈ వ్యాధి వంశ పారం పర్యంగా రాదు.కానీ అతి అరదుగా సంభవించే అవకాశాలు ఉన్నాయి. చిన్న పిల్లలలో ఈవ్యాధి వచ్చినా, వారి విద్యకు కానీ,నేర్చుకునే కళలకు గానీ ఈ వ్యాధి అడ్డంకి కాదు. ఈ వ్యాధి ఉన్న స్త్రీలు,పురషులు పెండ్లి చేసుకోవచ్చు.గర్భం దాల్చినపుడు తగిన మందులు వాడుతూ డాక్టరు పర్యవేక్షణలో ఉండటం శ్రేయస్కరం.
       మూర్ఛ వ్యాధి వచ్చి పడిపోతే చేతిలో తాళాల గుత్తి పెట్టడం, ఉల్లిపాయ వాసన చూపించడం చేస్తుంటారు ఇవేవీ చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. రోగి ప్రమాదకర వస్తువుల మీద పడకుండా జాగ్రత్త వహించాలి. పెండ్లి చేస్తే మూర్ఛ వ్యాధి తగ్గుతుందనేది ఒక అపోహ మాత్రమే!
       మూర్ఛ వ్యాధి వచ్చిన వారు ఆటలు ఆడవచ్చు, కానీ ఈత, కొండలు ఎక్కడం, మోటార్ కారు రేసుల్లో పాల్గొనకూడదు.ఈ వ్యాధి ఉన్న వారు టి.వి., కంప్యూటర్ చూడవచ్చు కానీ ఒక శాతం మంది రోగుల్లో టి.వి.,కంప్యూటర్ నుండి వచ్చే వెలుగులు వ్యాధిని ఉదృతం చేయవచ్చు. అటువంటి వారు వాటిని చూడటం తగ్గించి వేయాలి.
     మూర్ఛ వ్యాధిని మందులతో అదుపులో ఉంచవచ్చు.వ్యాధి లక్షణాలు కనబడితే న్యూరాలజిస్టును కలసి తగిన సలహాలు,మందులతో వైద్యం చేయించుకోవాలి.మందులు కనీసం మూడునుండి ఐదు సంవత్సరాలు వాడాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రతను బట్టి కొంత ఎక్కువకాలం వాడాల్సి ఉంటుంది. తగినంత నిద్ర ,సమతుల్య ఆహారం తీసుకోవాలి.జ్వరం లేక ఇతర జబ్బులు వచ్చినపుడు డాక్టర్ను సంప్రదించి తగిన మందులతో వైద్యం పొందాలి.
  ( ఇండియన్ ఎపిలప్సీ అసోషియేషన్,బెంగుళూరు వారి వ్యాసం ఆధారంగా)
        *************

కామెంట్‌లు