వంట గ్యాస్ వాడకం;-ఎం. వి. సత్యప్రసాద్ సెల్ .9398155633
 మన వంటింట్లో మనం వాడే వంట గ్యాస్ గురించి మనం ఈరోజు చర్చించు కుందాం .
ప్రతి గృహిణి ఈరోజుల్లో వంట గ్యాస్ తో వంట చెయ్యడం అన్నది సామాన్యంగా జరుగుతున్నదే .  గ్యాస్ వాడేటప్పుడు ఇది రోజూ ఉండే పనే అన్నట్టు యధాలాపంగా పొద్దున్నే కాఫీ పెట్టడానికి వంటింటికి వస్తారు .కానీ కొందరు వాడకం లో తీసుకోవలసిన జాగ్రత్తలను వదిలేస్తారు . మరి అలాంటపుడు ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ. జరుగుతుందని కాదు. మేము ఇన్నాళ్లు గా వాడుతున్నాము మాకు ఏమి కాలేదుగా అనుకోవడం సరికాదు. ప్రమాదం ఎప్పుడైనా జరగవచ్చు . ప్రమాదం చెప్పిరాదు.
ముఖ్యంగా తెలుసుకోవలసినది,  గ్యాస్ ఏ రూపం లో ఉంటుందో తెలుసా.  నీళ్ల లాగ ఉంటుంది. అందుకే దానిని లిఖ్వైఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటారు. అది సిలిండర్ లో నీళ్ల రూపం లో ఉండి మనం సిలిండర్ బర్నర్ ఆన్ చేసినప్పుడు సిలిండర్ లో ఉన్న ఒత్తిడి వలన నోబ్ లోంచి రెగ్యులేటర్  ద్వారా గ్యాస్ రూపం లో స్టవ్ లోకి వస్తుంది.
ఇంకా వివరం గా చెప్పుకోవాలంటే , మనం నోట్లో నీళ్లు పోసుకుని ఒక్కసారి ఒత్తిడితో బయటకు ఊడితే నీళ్లు ధారగా రావు. చిమ్మినట్లు వస్తాయి. అలాగే గ్యాస్ కూడా సిలిండర్ లోంచి బయటకు వస్తుంది.
మరొక్క మాట. ముఖ్యం గా ఇంట్లో ఉన్న అందరూ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే , గ్యాస్ యొక్క వాసన ఎలా ఉంటుందో తెలుసుకోవాలి.  మీ ఇంటికి గ్యాస్ సిలిండర్ తెచ్చే , గ్యాస్ ఏజెన్సీ కుర్రాడు సిలిండర్ తెచ్చినపుడు , అతని పర్యవేక్షణ లో మటుకే సిలిండర్ లోనించి గ్యాస్ లీక్ చేసి మనకు స్మెల్ చూపించ మని అడగాలి.  ఇది ముఖ్యం గా అతని పర్యవేక్షణ లోనే చేసి గ్యాస్ వాసన ఎలా ఉంటుందో తెలుసుకోవాలి  . మీకు తెలియడం కోసం చెబుతున్నాను ,  గ్యాస్ వాసన నిల్వ ఉన్న నీళ్ల మీద నుండి వచ్చేమురికి  వాసన లాగ ఉంటుంది.
గాస్ డెలివరీ బాయ్ కుర్రాడు సిలిండర్ తెచ్చినపుడు, కొంతమంది , ఆ కుర్రాడిని గ్యాస్ సిలిండర్ అక్కడ గుమ్మం లో పెట్టు తర్వాత మేము లోపల పెట్టుకుంటాము అని చెప్పి అతనికి అక్కడే డబ్బులు ఇచ్చి పంపిస్తారు .  అతను సిలిండర్ తెచ్చినపుడు ఆ సిలిండర్ లోనించి గ్యాస్ బాగా రిలీజ్ అవుతోందా లేదా చెక్ చెయ్యమంటే , రెగ్యులేటరు తాను తెచ్చిన సిలిండర్ కు తగిలించి స్టవ్ ఆన్ చేసి , నీలి రంగు మంటను మనకు చూపిస్తాడు.  నీలి రంగు మంట వస్తే గ్యాస్ సిలిండర్ నుండి గ్యాస్ బయటకు బాగా వస్తున్నట్లు అర్థం .
 
మనం ఇంకో పని కూడా చెయ్యాలి.  మనము గ్యాస్ సిలిండర్ లోని గ్యాస్ 14 .2 కేజీ కొంటాము . సిలిండర్ లోపల ఉన్న గ్యాస్ సరి అయినా తూకం 14 .2 కేజీ ఉందా లేదా అని కూడా చూసుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ తెచ్చిన కుర్రాడు  తూకం చేసి ఇస్తాడు. అతని దగ్గర తూకం చేసే త్రాసు కూడా ఉంటుంది. కంపెనీ అతనికి ఇస్తుంది.  సిలిండర్ పైన,  ఖాళీ సిలిండర్ బరువు వేసి (పెయింట్ చేసి) ఉంటుంది. తూకం వేసినపుడు  గ్యాస్ తో కలిపిన బరువు తెలుస్తుంది. ఆ బరువు లోనించి ఖాళీ సిలిండర్ బరువు మైనస్ చేస్తే 14 .2 కేజీ రావాలి . అలా వస్తే సరి అయినా గ్యాస్ మనకు వచ్చినట్లు. ఉదా. సిలిండర్ మీద ఖాళీ సిలిండర్ బరువు 15 .6 అని వ్రాసి ఉందనుకోండి (ఒక సిలిండర్ కు మరో సిలిండర్ కు ఖాళీ సిలిండర్ బరువు లో కొన్ని పాయింట్స్ తేడా ఉండొచ్చు ) + మనకు రావలసిన గ్యాస్ 14 .2 కేజీ. అంటే మొత్తం బరువు 15 .6 + 14 .2 =29 .8 అతని త్రాసులో చూపించాలి . అపుడు మనకు 14 .2 కేజీ గ్యాస్ సరిగా వచ్చినట్లు.
సరే , ముందు  మనం గ్యాస్ ఉపయోగించే వంట గది ఎలా ఉండాలో ఆలోచిద్దాం.   వంటింట్లో గ్యాస్ స్టవ్ ఒక అరుగు లేదా ప్లాట్ఫారం మీద ఉండాలి . సిలిండర్ నేలమీద ఉండాలి .  అదికూడా సిలిండర్ నిలబెట్టి ఉంచాలి .  వంట గదిలో కిటికీ తలుపులు తెరచి ఉంచాలి . మూసి ఉంచకూడదు అదీకాక వంటింట్లో ఉన్న పెద్ద తలుపు ను ఎప్పుడూ వంట చేస్తున్నంత సేపు తెరచి ఉంచాలి . ఎందుకంటే ఒకవేళ గ్యాస్ లీక్ అయితే గ్యాస్ బయటకు పోతుంది.  ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలి . గ్యాస్ లీక్ అయినప్పుడు గ్యాస్ ముందు నేలకు బారుగా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుంది. అంటే మనం వాడుక భాష లో చెప్పాలంటే , నేల బారు గా వెడుతుంది.  ఒకవేళ లీక్ అయితే అరుగు కు పైన ఉన్న కిటికీలోంచి వెడుతుంది లే అనుకుంటే , లీక్ అయినా గ్యాస్ అరుగు పైన ఉన్న కిటికీ  ఎత్తు చేరడానికి కొంత సమయం పడుతుంది. ఈలోగా ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది అందుకని వంటింట్లో ఒక పెద్ద తలుపు ఉన్న వాకిలిని తెరచి ఉంచాలి.  అప్పుడు నేలబారుగా పయనిస్తున్న లీక్ అయినా గ్యాస్ త్వరగా బయటకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. 
వంటింట్లో ఉన్న కిటికీలకు , డోర్ కు కార్టన్స్ , పరదాలు ఉండకూడదు.  ముఖ్యం గా స్టవ్ పైన ఉన్న కిటికీ లకు ఏవిధమైన తెరలు , గుడ్డలు, చేతిగుడ్డలు , గొనె పట్టాలు , ప్లాస్టిక్ పట్టాలు, ప్లాస్టిస్ సంచులు, గొనె సంచులు వేలాడతీయ కూడదు.  వంట చేసేటప్పుడు మంట ఆ పరదాలు అంటుకుని ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
 
సామాన్యం గా అందరి ఇళ్లలో వంట గదిలో పని మధ్యాహ్నం 12 గం. కు అయిపోతుంది . మరల తర్వాత 3 లేదా 4 గం కు టీ / కాఫీ పెట్టడానికి వస్తారు. మళ్లా రాత్రి 9 గం కు వంటింట్లో పని అయిపోతుంది. నేను టైమింగ్స్ ఉరామరిగ్గా చెప్పాను . ఒక గంట అటూ ఇటూ కావచ్చు. కానీ చెప్పా దలుచుకున్న దేమిటంటే , వంటింట్లో పని అయిపోగానే , మధ్యాహ్నమైనా , లేదా రాత్రి అయినా సిలిండర్ నాబ్ ను క్లోజ్ చెయ్యాలి, మూసెయ్యాలి . అప్పుడు సిలిండర్  లోంచి గ్యాస్ లీక్ అయ్యే అవకాశం ఉండదు. లేదా ఒకవేళ స్టవ్ కి ఉన్న పైప్ ఎక్కడైనా చిట్లి ఉంటె, బర్నర్ లీక్ అవుతుంటే గ్యాస్ వంటింట్లో వ్యాపించే ప్రమాదం ఉంది.
కొన్ని సంవత్సరాల క్రితం , మాదిరెడ్డి సులోచన అనే నవల రచయిత్రి ఇలాగే స్టవ్ నోబ్ ఆఫ్ చెయ్యలేదు. ఆమె విషయం లో మరొక విషయం కూడా జరిగింది. అది ఆమె పొరపాటు కాదు.  మనం ఇండ్ల లో లైట్ స్విచ్ ఆన్ చేసినపుడు , స్విచ్ దగ్గర చిన్న మంట వస్తుంది, ఒక్కో సారి ట్యూబెలైట్ దగ్గర కూడా వస్తుంది.  ఆమె రాత్రి నిద్రలో లేచి మంచి నీళ్లు తాగుదామని వంటింట్లో లైట్ స్విచ్ వేసింది. అంతే.  వెంటనే వంటిల్లు అంటా మంటలు. ఆమె అరుపులు కేకలు పెట్టి ఆమె భర్త వచ్చి ఆమెను దుప్పటి కప్పి కాపాడే లోపు ఆమె ప్రాణం పోయింది. . ఆమె చేసిన పొరపాటు  ఏమంటే సిలిండర్ దగ్గర నోబ్ ఆఫ్ చెయ్యలేదు.  సిలిండర్ లోంచో , లేదా స్టవ్ లోంచో తెలీదు గానీ గ్యాస్ లీక్ అయి ఉంది . ఎప్పుడైతే ఆమె స్విచ్ వేసిందో , స్విచ్ దాగ్గర వచ్చిన మంట వలన నిప్పు అంటుకుంది. ఆమె చనిపోయింది.  ఇందులో భయపాల్సిన పని లేదు. కానీ సిలిండర్ దగ్గర నోబ్ ఆఫ్ చెయ్యడం చాలా మంచిది.  అలాగే ఏదయినా ఊరు వెళ్ళేటప్పుడు ( ఒక్క రోజు ప్రయాణమైనా కూడా ) తప్పకుండ సిలిండర్ దగ్గర నోబ్ ఆఫ్ చేయడం అందరికీ శ్రేయస్కరం.
మనం మెలకువ గా ఉన్నపుడు మనకు గ్యాస్ లీక్ అవుతున్నట్లు అనుమానం వస్తే , మొదట భయపడ కుండా , ఖంగారు పడకుండా సిలిండర్ దగ్గర నాబ్ ను మూసివేయాలి.  ఒకవేళ వంట చేస్తుండగా లేదా స్టవ్ మీద బర్నర్ వెలుగుతుండగా అనుమానం వస్తే, ముందు స్టవ్ అన్ని బర్నర్లు ఆఫ్ చేసి  తర్వాత సిలిండర్ దగ్గర నాబ్ ఆఫ్ చెయ్యాలి.  తర్వాత గ్యాస్ ఏజెన్సీ కి ఫోన్ చేసి లీక్ అవుతున్న విషయం వారికి తెలియ చెయ్యాలి. అపుడు వాళ్ళు తదుపరి చర్య తీసుకుంటారు.
వంట చేసేటప్పుడు , టీ కాఫీ పెట్టేటప్పుడైనా కూడా ఆడవారు పోలియెస్టర్ చీరలు ధరించ కూడదు. మగవారు వంట చేసేవారయితే  పాలిస్టర్ షర్ట్స్ , టీ షర్ట్స్ ధరించ కూడదు.  కాటన్ దుస్తులు మటుకే ధరించాలి. కాటన్  ఎప్రాన్ ధరించాలి. ఎప్రాన్ అంటే, వంట చేసేటప్పుడు ధరించే గుడ్డ. ఇది శరీరానికి ముందర వైపు , గొంతు దగ్గర నుండి, మోకాలి వరకు ఉండే కాటన్ గుడ్డ కట్టుకోవాలి.  ఈ ఎప్రాన్ లో రకాలు, మంట తగిలినా  గుడ్డ అంటుకోకుండా ఉండే రకమైన గుడ్డలు అమ్ముతారు . వాటిని వంట చేసేటప్పుడు వాడటం వలన మంట మనకు  ముందు భాగం లో తగిలినా ప్రమాదం ఉండదు.
గ్యాస్ స్టవ్ ఆన్ చేసేటప్పుడు ఈరోజుల్లో అందరూ లైటర్ నే వాడతారు. కానీ కొన్ని లైటర్లు సరిగా పని చెయ్యవు. మనం స్టవ్ ఆన్ చెయ్యడానికి మొదట బర్నర్ ఆన్ చేసి తర్వాత లైటర్ వాడతాము. కానీ కొన్ని లైటర్లు ఐదు లేదా ఆరు సార్లు కొట్టినా స్టవ్ ఆన్ అవదు. ఎప్పుడో ఆన్ అవుతుంది. అలాంటపుడు మనం లైటర్ కొడుతున్నంత సేపు బర్నర్ లోనించి గ్యాస్ బయటకు వస్తుంది . లైటర్ ఆన్ అయ్యాక అప్పటికి ఐదు లేదా ఆరు సార్లు కొట్టి ఉంటాం కాబటికి మంట ఒక్కసారిగా వస్తుంది. బర్నర్ పైన గిన్నె ఉంటుంది కాబట్టి  మంట అక్కడే నుంచున్న మన మీదికి వచ్చే అవకాశం యెంత అయినా ఉంది. మరి ఎం చెయ్యాలి, ఎలా చెయ్యాలి. అగ్గిపుల్ల తో స్టవ్ వెలిగించాలి . మొదట అగ్గిపుల్ల వెలిగించి మంట అగ్గిపుల్లకి బాగా ఉంది అనిపించినా తర్వాత బర్నర్ ఆన్ చేసి వెలుగుతున్న అగ్గిపుల్ల ను బర్నర్ మీద ఉంచితే ఎక్కువ మంట మీదికి రాదు.
వంట ఇంట్లో ఏ రకమైన నిప్పు అంటుకునే వస్తువులు, పదార్ధములు ఉంచా కూడదు . ఉదా. పెట్రోల్ ఉన్న డబ్బా , కిరసనాయిలు ,  పొలం పనులు చేసేటప్పుడు వాడే పంపు సెట్ లు ,  ఆ పంపు సెట్ కు అవసరమైన పెట్రోల్ మరియు డీసెల్ , మొ //.  ఒకసారి ఒకరి ఇంట్లో , వారి ఇల్లు అంటే ఒక్క గది , ఆ గదిలో ఒకే మూల చిన్న అరుగు మీద స్టవ్ , కింద సిలిండర్ పెట్టి వంట. స్టవ్ కి పైన కిటికీ. కానీ కిటికీ మూసి ఉంది, ఆ కిటికీ కి ఒక గొనె పట్టా వేలాడదీసి ఉంది.  వంట చేస్తుండగా మంట అక్కడే కిటికీ కి వేలాడుతున్న గొనె పట్టా కు అంటుకుంది.  ఈమె ఖంగారులో ఆ గోనెపట్టను ఆర్పుదామని మండుతున్న గోనెపట్టను లాగి ఆర్పడం కోసం విదిలించింది. అప్పుడే తన భర్త పొలానికి వెళ్ళడానికి పంపు సెట్ లో పెట్రోల్ పోస్తున్నాడు . ఆమె విదిలించిన గోనెపట్ట ఆ పెట్రోల్ మీద పడి పెట్రోల్ అంటుకుని, అక్కడే దండెం మీద వేసిని గుడ్డలు కూడా అంటుకున్నాయి. ఎప్పుడైతే పెట్రోల్ మీద గోనెపట్ట పడిందో , ఆమె భర్త , ఆమెను బయటకు నెట్టి తాను కూడా బయటకు పరిగెత్తినాడు . బట్టలు, మంచం మీద ఉన్న పరుపు తగలబడటం తో ఆ ప్రమాదం ఆగిపోయింది.  అదృష్టం ఏమంటే వాళ్ళ పిల్లవాడు 5 సం వయసు వాడు ఇంటి బయట ఆడుకుంటున్నాడు. ఈ భార్య భర్తలు బయటకు వచ్చి బయట నుండే బకెట్ ల తో నీళ్లు కొట్టి మంటలు ఆర్పారు . ముందు వీళ్ళు ప్రమాదం నుండి బయటపడ్డారు . పిల్లవాడు ప్రమాదానికి గురి కాలేదు. కొంచం అప్రమత్తతో ఉంటె ప్రమాదాలు మన దగ్గరకు రావు.
 
ఒక్కోసారి కొందరి ఇండ్లలో పండగలప్పుడు , పిండి వంటలు వంట గదిలో కాకుండా ఇంట్లోనే కొంచం బయలు గా ఉండే ప్రదేశాలలో చేస్తూ ఉంటారు.  ముఖ్యం గా అప్పుడు పిల్లలు ఆడుకుంటూ వెనకాల నుండి వంట చేసే వారి వీపు మీద గబాలున వచ్చి వాటేసుకుంటారు. అప్పుడు వంట చేసే వారికి, పిల్లలికి ఇద్దరికీ ప్రమాదం జరిగే  అవకాశం ఉంది.  అదేవిధం గా వంట ఇంట్లో అమ్మ వంట చెయ్యడం చూసి, పిల్లలు కూడా ఏ సమయంలో నైనా స్టవ్ బర్నర్ ను తిప్పటానికి ప్రయత్నిచే అవకాశం ఉంది. అందుకని పిల్లలను గ్యాస్ స్టవ్ దగ్గరకు రాకుండా చూడటం పెద్దల బాధ్యత.
పైన చెప్పిన విషయాలన్నీ , మీకు తెలియనివి కావు.  కానీ ఒకసారి జాగ్రత్త లను మననం చేసుకుంటే ప్రమాదం జరగకుండా మనలను మన కుటుంబ సభ్యులను , మన ఇరుగు పొరుగు వారలను కాపాడుకోవచ్చును.

కామెంట్‌లు
Shyamkumar chagal చెప్పారు…
Excellent writeup
పి రామారావు చెప్పారు…
చాలా విపులం గా క్లియర్ గవివరించారు.కానీ మన గృహిణులు పాటించారండి చాలా లైట్ గా తీసుకుంటాస్రు.తర్వాత వాళ్ళు కిచెన్ లో ఒక టైం బాంబ్ తో ఉన్నారని మర్చిపోతారు.మీరు చెప్పిన విషయాలు ఒక రిమైండర్ లాగా పనిచేస్తాయి.
ధన్యవాదాలు.
Shyam kumar chagal చెప్పారు…
మంచి రచన
Priyanka చెప్పారు…
Chala chakkaga vivarincharu.. anni points ni clear ga chepparu.. 👏👏 indulo anni vishayalu theliyani vallu entho Mandi untaru.. andariki chala use ayye topic idi.. super.. ilanti articles inka yenno maku andinchali ani kotukuntunnam..
సత్తి పద్మ చెప్పారు…
చాలా వివరంగా తెలిపారు.రోజూ చేసే పనే కదా అని నిర్లక్ష్యంగా ఉంటాము.చిన్న పొరపాటు మొత్తం కుటుంబాన్ని ప్రమాదం లోకి నెట్టవచ్చు.