సృజనాత్మక చిత్ర కవిత్వమే నేరెళ్ల సృజనోదయం;- రాథోడ్ శ్రావణ్--ఉసావే ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా.9491467715
 తెలుగు సాహిత్యంలో సృజనాత్మకతకు సంబంధించిన చిత్ర కవిత్వాలు పుస్తకాల రూపంలో రావడం చాలా అరుదు. తెలిసిన ఒక పనిని తెలిసినట్టు చేయడం తెలివైన పని అనొచ్చు , కాని అదే పనిని కొత్త కోణంలో  పాఠకులకు, పుస్తక పఠన అభిమానులకు, కవులకు, రచయితలకు  మరింత మెరుగ్గా, వేగంగా, సమర్థవంతంగా చేయటం అనేది సృజనాత్మకత.  అదే సృజనాత్మకతకు మారు పేరు కవి నేరెళ్ల రంగాచార్య.
ప్రముఖ కవి, రచయిత, విశ్రాంత తెలుగు భాషోపాధ్యాయులైన నేరెళ్ల రంగాచార్య ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని అంగడి తాంషి  గ్రామంలో శ్రీమతి/ శ్రీ అనంతలక్ష్మి,వేంకటాచార్యులకు 12 డిసెంబర్ 1960లో  జన్మించారు. ప్రాథమిక,ఉన్నత విద్య  ప్రముఖ శతావధాని,గోల్కొండ కవిగా ప్రసిద్ధి చెందిన తన తండ్రి శ్రీ నేరెళ్ల వేంకటాచార్యుల  వద్ద,పద్య గురువు శ్రీ బొంత లచ్చారెడ్డి గారి వద్ద పూర్తి చేశారు. దూర విద్యా  ద్వారా ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి తెలుగు పండిత్ శిక్షణ తెలుగు భాషా శిక్షణ సంస్థ వరంగల్లో పూర్తి చేశారు.ఉద్యోగంలో చేరిన తర్వాత ఎమ్.ఏ తెలుగు సాహిత్యం పూర్తి చేశారు. 
వీరు  సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థలో 01మార్చి1990 లో  తెలుగు భాషా పండితులుగా ఉద్యోగంలో నియామకమై ఉట్నూరు పరిధిలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత
పాఠశాల ఉట్నూర్, నర్సాపూర్,
జైనూర్ మండలంలోని మార్లవాయి,నార్నూర్ మండలం లోని  జామ్డాతో పాటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆశ్రమ ప్రాథమికోన్నత పాఠశాల బాలికలు యందు  తెలుగు భాషా పండితులుగా‌ ఇరువై ఏడు వసంతాలు  గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సేవలందించారు.1995 లో సంస్కృతిక  క్షేత్ర శిక్షణ సంస్థ న్యూ ఢిల్లీ యందు శిక్షణ పొంది  గిరిజన విద్యార్థులకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను బోధించే అవకాశం లభించిడం  గమనార్హం. సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూరు వారు నిర్వహించే ఆనందలహరి, పునాది, ఉపాధ్యాయ శిక్షణ, వృత్తాంత శిక్షణ కార్యక్రమానికి తెలుగు విభాగంలో జిల్లా వనరుల శిక్షణ అధికారిగా జిల్లా విద్యాశాఖాధికారి( ఏజెన్సీ) విభాగానికి సూచనలు, సలహాలు, అందించారు. వీరు ఏకలవ్య ఫౌండేషన్ ద్వారా గిరిజన విద్యార్థులకు ప్రత్యేక విద్యా కార్యక్రమాలు నిర్వహించారు. 
నాకు జామ్డ ఆశ్రమ ఉన్నత పాఠశాలో సహోద్యోగిగా కలిసి విధులు నిర్వహించి నప్పటి నుండి సుపరిచితులు‌.
వీరు సిద్దేశ్వర సంస్థానం పాట్నాపూర్ కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పూలాజీ బాబా గురించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలుగు భాషలో తొలి సారిగా బాబా గురించి తాను రాసిన తొలి పుస్తకం "ఆధ్యాత్మిక అరుణోదయము" అప్పట్లో ఈ పుస్తకాన్ని పెద్ద ఎత్తున ఆదరణ లభించడం గమనార్హం.
కవి  సృజనోదయము ఈ పుస్తకంలో రాసిన చిత్రాలకు పద్యములు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుకొట్టిన చిత్ర విచిత్రమైన దృశ్యాలను చూసి వాటి పై వ్యంగ్యంగా, భావ సారూప్యంగా,కంద పద్యాలు, ఆటవెలది, తేటగీతి పద్య ఛందస్సుకు  సంబంధించిన 169 చిత్రాలు సేకరించి వాటి పై పద్యాలను సృజనాత్మక దృష్టితో రాయడం అద్భుతం.
కొన్ని చిత్ర పద్యాలను పరిశీలిద్ధాం
1).బాబా పులాజి గురువే 
బాబాయిని పిలుచు వారి బాధలు తొలిగెన్ 
బాబా వాక్కులె వేదము 
బాబా సత్యము సతతము భావింతురిలన్ !
ఆధ్యాత్మిక గురువు పూలాజీ బాబా గూర్చి చెపుతూ బాబా అని పలుకుట వలన  భక్తుల  బాధ తొలగిపోవును. అతని వచనం వేదాలతో సమానమని సద్గురు యొక్క మహిమను గూర్చి వివరించారు.
2).బడి సార్లకె యనుచును యా
బుడతడి కానందమెంత బుట్టెనొ గనుడీ 
పడిపడి పోవుట లేదని 
మిడిమిడి జ్ఞానంబుతోడ మిసిమిసి నవ్వెన్!
కరోనా కాలంలో  బడి పిల్లలకు లేక పోవడంతో సార్లకే ఉండటంతో విద్యార్థుల ఆనందాన్ని పద్యంలో వివరించాడు.
3).నేర్పెను కరోనా బుద్ధులు 
నేర్పెను పోకడలు నెన్నొ నేర్చిరి గదనే 
నేర్పెను చీరకు మ్యాచులు 
నేర్పించిరి మాస్కు కూడ నేర్పరి తనమే ?
కరోనా మహ్మమ్మరి నేర్పన గుణపాఠం వల్ల స్త్రీలు చీరకు మ్యాచయ్యే మాస్కులు కొంటున్నారని  చమత్కారించారు.
4).బాలల చేతికి సెల్లులు 
తల్లియు తండ్రిదె నిజముగ తప్పిదమవ్వున్ 
కాలమహిమ తెలియునులే
పిల్లల అల్లరికితోడు పిల్లియు జేరెన్ !
నేటి ఆధునిక కాలంలో చరవాణి పై పిల్లల ప్రభావాన్ని ఎత్తి చూపారు.
5).దుర్భర జీవితమామెది 
నిర్భయముగ కూలిజేస్తు నిష్టగ జదివెన్ 
నిర్భరముగ పొందెకొలువు 
దుర్భిక్ష పుఛాయలన్ని దూరంబాయెన్ !!
పై పద్యంలో చదువు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి, కానీ అది ఇష్టంతో కష్టం చేస్తే ఫలితం ఉంటుందన్నారు. 
6).మక్కువతో తలనిచ్చెను 
చెక్కెను శిల్పాలెన్నొ చిత్రముగాదే 
రొక్కము తగినంతైనను 
చక్కగ దిద్దెను మెరుగులు జక్కనవోలెన్ !!
నేటి యువత తల కటింగ్ తమ ఇష్టానుసారంగా చేయిస్తూ డబ్బులు కూడా లెక్క చేయకుండా నూతన పోకడలతో వ్వవహారిస్తున్నారని చూరకలంటిచారు.
ఈ చిత్ర  పద్యంలో చిత్రాలకు  భావాలను చిత్రాలకనుగుణంగా   సరళమైన రీతిలో చక్కగా వివరించారు. ఈ సృజనాత్మక పద్యాలు విశిష్టమైనవిగా మనం గమనించగలం తెలంగాణలో వ్యవహృతం అవుతున్న పదాలూ, మాటలు ప్రజల కష్టసుఖాల నుండి, మంచి చెడులు నుండి,మమత అనురాగాల నుండి 
కన్నీళ్ళ నుండి,
 బాధల‌ నుండి చెమట లోంచి వచ్చిన ఈ సృజనాత్మక చిత్ర కవిత్వం తెలుగు సాహిత్యంలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించే విధంగా ఉంది. ప్రతి  పద్యంలో  నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు, సామాజిక విలువలు,హాస్యం, వ్యంగ్యం,నిత్యసత్యాలను జోడించి చమత్కరించటం కొస మెరుపు.
తెలుగు సాహిత్యానికి  విశేషంగా సేవలందిస్తున్న నేరెళ్ల రంగాచార్య   సాహిత్యం తన కుటుంబానికి అనువంశికంగా వచ్చిన వరమని అంటారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తన స్వంత గ్రామంలో శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో శతాధిక చిత్రాలకు పద్యములు సంకలనాన్ని ఆవిష్కరించడం సంతోషం. అతని సాహితీ సేద్యానికి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా జిల్లా పాలనాధికారి అహ్మద్ బాబు గారిచే సన్మానాలు
జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి పురస్కారంతో పాటు ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి అశోక్ కుమార్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. ఈ సృజనోదయము పుస్తకంలో మొత్తం 184 పుటలతో  రంగు రంగుల చిత్రాలతో ఆకర్షణీయంగా చూపరులకు, పుస్తక పఠన అభిమానులకు  ఆశక్తికలగించే విధంగా కవి ఆశక్తితో రుపొందించడం ప్రశంసనీయం .
వెల:- 260


కామెంట్‌లు