మర్మ మెరుగని చదువు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి.94928 11322
 ఆడపిల్ల పుట్టింట్లో ఎంతగారాబంగా పెరుగుతుంది  తను ఆడింది ఆట పాడింది పాటగా జరుగుతుంది. పెళ్లయి అత్తారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఏమిటో వారి పద్ధతులు ఏమిటో తెలియదు  అవగాహన చేసుకోవడం కోసమే కొంత వ్యవధి కావాలి  అంతవరకు భర్తతో గానీ అత్తమామలతో గానీ  తన మనసులో ఏది అనుకున్నా దానిని పైకి చెప్పకూడదు. ఒకవేళ చెపితే ఈ పిల్లకు ఎంత గర్వం మేం చెప్పిన మాట వినడం లేదు, చెప్పిన పని చేయడం లేదు అని విసుక్కుంటారు అక్కడి నుంచి తగాదాలు ప్రారంభం. అలా కాకుండా ఎంతో ఓర్పుతో  సమయానికి తగినట్టుగా మాట్లాడుతూ, పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకుంటే ఆ సంసారం స్వర్గతుల్యం అవుతుంది. బిడ్డ పుట్టినప్పుడు  తనను ఎంతో గొప్పగా తీర్చిదిద్దాలని కొందరు తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ అతను కారణాంతరాల వల్ల  బుద్ధిలేనివాడిగా ఉంటే వారి పరిస్థితి ఏమిటి నరకమే కదా. అలాగే పిల్లలు చదివేటప్పుడు గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా బట్టీపడితే దానికి సార్థకత ఉంటుందా?  
పోతన గారు  ప్రహ్లాదునితో అనిపిస్తాడు చదువులలో మర్మమెల్ల తెలిసి చదివాను అని. ఆ మర్మాన్ని తెలుసుకోకుండా ఎంత చదివినా దానివల్ల ప్రయోజనం ఏదీ ఉండదు. ఈ మూడు విషయాలను ఎంతో నిశితంగా పరిశీలించి  వేమన మహాశయుడు లోక నీతిగా అద్భుతమైన ఆటవెలది పద్యాన్ని మనకందించాడు.  

కామెంట్‌లు