అమూల్యం "అమ్మ";--గద్వాల సోమన్న ,సెల్:9866414580.
అమ్మ చూపు ప్రేమలోన
అమృతమే జాలువారును
ఆమె చేయు సేవలోన
త్యాగమే గోచరించును

అమ్మ యనెడి పిలుపులోన
అనురాగం తాండవించు
ఆమె చేయు పనులలోన
ఆనందం తొంగిచూచు

అమ్మ ఇంట వెలుగు దివ్వె
అనునిత్యమూ భాసించు
ఇంటిల్లిపాదితోడ
అద్భుతంగా భాషించు

అమ్మ లేక జగము లేదు
అభివృద్ధి అసలే లేదు
అరుణోదయమే రాదు
ఆమె ఉన్న ఉనికి పోదు


కామెంట్‌లు