;కార్మికాదేవా నమో! "డాక్టర్ అడిగొప్పుల సదయ్యజమ్మికుంట, కరీంనగర్9963991125
చెమట చుక్కలు విత్తి చెలకలను పండించి
అవని కడుపులు నింపు అన్నదాతా నమో!

తనువునింజను చేసి తపసుతో వస్త్రాలు
నేసి మానము గాచు నేతగాడా నమో!

అరచేత బ్రాణాల నెరి తాటి మొగిలెక్కి
కల్లు కుండలు దింపు గౌడవీరా నమో!

తిరిగి వచ్చెదనన్న భరవసము లేకున్న
భూగర్భ గనిజొచ్చు బొగ్గుకార్మిక నమో!

సతము చోదనమందు సరుకులను,యానికుల
పదిలంగ చేర్పించు వాహ్య చోదక నమో!

కురుమ! గోపాలకా! కుమ్మరీ!కమ్మరీ!
చాకలీ!మంగళీ! చర్మకారీ! నమో!

భట్రాజ! ముదిరాజ! భవనకార్మిక రాజ!
చలనచిత్రపు రంగ శ్రమవీరుడా నమో!

వేలాయుధము దాల్చి విద్యార్థులందరను
సన్మార్గమున నడుపు సత్త గురుడా నమో!

విశ్వ బ్రాహ్మణ నమో! విశ్వ కర్మా నమో!
యంత్రకారీ నమో! చిత్రకారీ నమో!

సకలకుల వృత్తులను సాదరించుతు జగతి
కల్యాణమున వరలు కర్మ దేవా నమో!


కామెంట్‌లు