అంతరంగాన్ని వినాలి!- యామిజాల జగదీశ్
 జాన్ అనే అతను తన ప్రతి పుట్టినరోజునాడు గుర్రప్పందాలకు వెళ్ళడం అలవాటు.
ఎన్నో ఏళ్ళుగా అతను పందెంలో ఓడిపోతూనే ఉన్నాడు.
ఈసారి అతను ఓ నిర్ణయానికి వచ్చాడు. అతి పెద్ద ధనవంతుడు అయిపోవాలి. లేదా
బిచ్చగాడైపోవాలి. అంతేతప్ప ఈ రెండింటికీ మధ్య ఉండిపోకూడదు అన్నదే అతని నిర్ణయం !
 కనుక అతను తన దగ్గరున్న ఆస్తులన్నింటినీ అమ్మేసాడు. అలాగే.ఏడాది పొడవునా సంపాదించిన డబ్బుతో పందానికి వెళ్ళాడు.
అక్కడ గుర్రాల పేర్లు చూసినప్పుడు ఓ గుర్రం పేరు "హిట్లర్" అని ఉంది. అప్పుడు అతని మనసు చెప్పింది...
"హిట్లర్ మహా నియంత. అందరినీ అణచిపెట్టి పాలించడం తెలిసినవాడు. కనుక ఆ గుర్రమే పందంలో మొదటి స్థానంలో నిలుస్తుంది.  అందువల్ల ఆ గుర్రం మీదే పందెం కాయి" అని!
ఇంకేముంది అతను వెంటనే మొత్తం డబ్బంతా దానిమీద కట్టాడు. తీరా ఆ గుర్రం పందెంలో చిట్టచివరి స్థానంలో నిలిచింది.
అతను ఓడిపోయాడు. ఇప్పుడతని దగ్గర చిల్లిగవ్వకూడా లేదు. అతని మనసు చెప్పింది ఆత్మహత్య చేసుకోమని.
ఓ పర్వతాగ్రభాగానికి వెళ్ళాడు. అక్కడి దూకడానికి సిద్ధపడ్డాడు. అప్పుడతని అంతరంగం చెప్పింది "దూకవద్దు" అని. నమ్మకాన్ని కోల్పోకు. మరొక్కమారు ప్రయత్నించు అనికూడా అంతరంగం చెప్పింది.
మళ్ళా వచ్చాడు. ఏడాదంతా శ్రమించాడు. పుట్టింరోజూ వచ్చింది.
అంతరంగం చెప్పింది - "చర్చిల్ అనే గుర్రం మీద డబ్బులు పెట్టు..." అని.
సరేనని అతను ఆ గుర్రంమీద డబ్బు కట్టాడు.
ఆ గుర్రం మొదటిస్థానంలో నిలిచింది. అతనికి బోలెడంత డబ్బు వచ్చింది.
మళ్ళా అతని అంతరంగం చెప్పింది....స్టాలిన్ అనే గుర్రంమీద డబ్బులు పెట్టమంది అంతరంగం.
అతను ఆ గుర్రంమీద డబ్బులు కాశాడు. స్టాలిన్ గుర్రం ప్రథమస్థానంలో నిలిచింది. అతను మహా ధనవంతుడయ్యాడు. 
అంతరంగం చెప్పింది....ఇక పందొలు మాని ఇంటికి వెళ్ళమని.
అయితే మనసు చెప్పింది "నువ్వేమన్నా పిచ్చోడివా...నీ నక్షత్రం ఉచ్ఛంలో ఉంది. మళ్ళా మొత్తం డబ్బ కట్టు. మహారాజులా బతకొచ్చు అని.
కానీ అంతరంగం వద్దని చెప్పింది.
అయితే ఆశ కారణంగా అతను మనసు చెప్పినట్టే నిక్సన్ అనే గుర్రంమీద డబ్బులు కట్టాడు.
తీరా ఆ గుర్రం ఆఖరి స్థానంలో నిలిచింది.
మనసు చెప్పింది...."నువ్వు శిఖరాగ్రానికి వెళ్ళు. అక్కడి నుంచి దూకేసే" అని.
ఇక చేయడానికి ఏమీ లేదనుకునే స్థితిలో అతని మనసు ఆగిపోయింది. ఇక జీవితమే లేదనుకునే స్థితిలో మనసు ఆగిపోతుంది.
మనసు ఆగిపోయినప్పుడు అంతరంగం గొంతు వినిపిస్తుంది. అది ఎప్పుడూ వింటూనే ఉంటుంది. చె్ తుందికూడా ఫలానా చెయ్యమని. కానీ మనసు చేసే రగడలో ఆ గొంతు మన చెవులకు వినిపించదు.
ఆ గొంతు ఎక్కడి నుంచో రావడం లేదు. అది మనలో నుంచే వస్తుంది. భగవంతుడు మనలోనే ఉన్నాడు.
మరి ఏం జరిగింది? 
మనసు మూగబోయినప్పుడు ఆ గొంతు మళ్ళా వినిపించింది..."నమ్మకాన్ని కోల్పోకు" అని!
ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి....
ఎప్పుడల్లా విజయం సాధించామో అప్పుడల్లా ఆ విజయానికి కారణం "అంతరంగవాణి"
కానీ మనసు లోపలికొచ్చి బాధ్యతలను తీసుకుంటుంది. అదంతా తనవల్లే అయిందని!
ఎప్పుడల్లా సంతోషానుభూతి చెందుతున్నారో అది మీ అంతరంగంలో నుంచి వచ్చేదే!
కానీ మనసు ఆ బాధ్యత తీసుకుని అందుకు కారణం తానేనని చెప్తుంది.
మనం ధ్యానం చేసేటప్పుడల్లా అక్కడ తెగ సంతోషం కలుగుతుంది.
అప్పుడు గమనించండి....వెంటనే మనసు లోపలికొచ్చి చెప్తుంది..."నేను సంతోషంగా ఉన్నాను" అని.
వెంటనే అంతరంగంతో బంధం తెగిపోతుంది. ధ్యానానికి ఆటంకం కలుగుతుంది.
గుర్తుంచుకోండి....
మనసుతో ఉన్నప్పుడు మనం ఓడిపోతూనే ఉంటాం. విజయం సాధించినా మళ్ళీ ఓటమే.
మనసుతో విజయం అనేదే లేదు.
మనసనేది లేనప్పుడు ఓటమి అనేదే లేదు.
ఒక్కసారి మనసుకతీతంగా ఉండగలిగితే అంతా విజయమే.
మంచినే తలుద్దాం!
మంచే జరగనీ!!

కామెంట్‌లు