గూడు;-సత్యవాణి
 రాజారావు తల్లిదండ్రులు పోయినాకగూడ తన తమ్ముళ్ళతో
కలిసి ఒకే ఇంట్లో ఉమ్మడిగా వున్నాడు.
పిల్లలు చిన్న వాళ్ళుగా వున్నప్పుడు నలుగురికీ ఆదర్శంగా వుండే ఆ ఇంట్లో యిప్పడిప్పుడే పెద్దలమధ్య
అభిప్రాయ భేదాలు పొడచూపుతున్నాయి.
అందుకనే బంధాలు నిలబడాలంటే అన్నదమ్ములు వేరుపడాలని నిర్ణయించుకొన్నారు.
అయినా "వెయ్యేళ్ళైనా వేరుతప్పదు, నూరేళ్ళైనా చావు తప్పదు "అన్న సామెత వుండనే వుందిగదా!లాటరీ పధ్ధతిలో
వాటాలు వేసికోగా  ఇప్పుడుంటున్న ఇల్లు
తమ్ముళ్ళకొచ్చింది, రాజారావు వాటాకి  పెరటిలోని స్థలం వచ్చింది.తాను పెరటిలో వున్న స్థలంలో ఇల్లు కట్టుకోవాలని
నిశ్చయించుకొని, మర్నాడు పెరట్లో వున్న చెట్లు కొట్టడానికి మనిషులను పురమాయించాడురాజారావు.
         మర్నాడు పనివాళ్ళు గొడ్డళ్ళు పట్టుకొచ్చి వున్న నాలుగు చెట్లలో ఒక చెట్టుమీద గొడ్డలితో గాటు
పెట్టగానే,
 చెట్లమీద గూళ్ళు కట్టుకొన్న పక్షులు గోల గోలగా, గవర్నమెంటువారు ఇళ్ళుకూలగొడుతుంటే నిరాశ్రయులు గోడుగోడుమని విలపించినట్లు అరవ
వడం మొదలు పెట్టాయి.గూళ్ళలో
 వున్న వాటి పిల్లలు కూడా తల్లి పక్షులతో గొంతు కలిపి బొంగురు గొంతులతో ''మాకు నిలువనీడలేకుండా చేస్తావా?'అని ప్రశ్నించినట్లు అరుస్తుంటే,
 అనాధ లైన పశి పిల్లల రోదనలా అనిపించింది రాజారావుకి.పిల్లలెలాగూ ఈ దేశంలోలేరు.వచ్చినా ఇక్కడ స్థిరపడరు.మాతదనంతరం ఎలాగూ అమ్ముకొనిపోతారు.ఆమాత్రందానికి
"నెేనూ  నాభార్యా తలదాచుకొందుకు ఎక్కడ అద్దెకుంటేపోదు?
 పక్షుల గూళ్ళు కూలగొడితే ఎవరికి మాత్రంక్షేమకరం?
" అనుకొన్నాడు రాజారావు. పనికి వచ్చినవాళ్ళను పంపించేసి, అద్దె ఇల్లు వెతుకులాటకు
బదేరుతుంటే, పక్షులన్నీ తిరిగిచెట్లపై వాలి సంతోషంతో కిలకిలారావాలు చేస్తుంటే, అవి అపురూపమైన ఆశీర్వాదాలుగా వినిపించాయి రాజారావుకి.
                   

కామెంట్‌లు