రైతుల రావణకాష్టం;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.

 ప్రజాపాలనలో కొన్ని నిర్ణయాలు ప్రశంసలను అందుకుంటే మరి కొన్ని విమర్శల చేదును రుచి చూస్తాయి....
ప్రాంతం ఏదైనా-రాష్ట్రం ఏదైనా
ప్రజల-ప్రభుత్వాల మధ్య వ్యవస్థల విధానాల పట్ల
నిరంతరం నిత్య సంఘర్షణ జరుగుతూనే ఉంది...
ప్రభుత్వాల ధోరణి ప్రజలకు అనుకూలించనప్పుడు  నిరసనలు, ధర్నాలు సర్వసాధారణం...
కానీ మన భారతదేశ చరిత్రలో పునుపెన్నడూ జరుగని సంఘటనలు ఇప్పుడు చోటు చేసుకుంటున్నాయి...
భారతీయులమైన ప్రతి ఒక్కరు తలదించుకునే పరిస్థితులు తలెత్తాయి...
రైతులను అన్నదాతలుగా కీర్తించే మన దేశంలో వారే రొడ్డెక్క వలసిన పరిస్థితి...
పొలాన నాగలి పట్టి పట్టెడన్నం పెట్టే రైతు నేడు ప్లకార్డులు పట్టుకుని నిరసనకు దిగుతుంటే....
మైళ్ల దూరం పాదయాత్ర పేరిట పోరాటాలకు సిద్ధమౌతుంటే....
ఏడున్నర దశాబ్దాల స్వరాజ్యానికి 
విలువేముంది...
ప్రభుత్వమే దళారిగా మారి రైతులను దగా చేస్తుంటే
అమరవీరుల స్వేచ్ఛా భారతం కన్నీరు పెట్టుకుంటుంది...
పేరుకుపోతున్న కాలుష్యపు వ్యర్ధాలు ఓ ప్రక్క...
వికటిస్తున్న ప్రకృతి వాతావరణం మరో ప్రక్క...
నకిలీ విత్తనాల మోసాలు ఇంకొక ప్రక్క...
కార్పొరేట్ దండాల దౌర్జన్యాలు మరొక ప్రక్క...
వీటన్నిటి మధ్య ఓ సాధారణ రైతు భూమిని సాగు చేయడం ఎంత సాహసం??
అదో పెద్ద సవాల్...
అయినా ఏ మాత్రం వెనకడుగు వేయడు, కష్టాన్ని లెక్క చేయడు, బంగారు పంటలు పండించి దేశానికి బువ్వ పెడతాడు...
అలాంటి రైతుల
కష్టనష్టాల భారాన్ని ప్రభుత్వాలే కాదు అన్నం తినే ప్రతి ఒక్కరూ భరించాలి...
ప్రతి పోరాటంలో వెన్నుదండుగా వుంటామన్న భరోసాను కల్పించాలి...
అప్పుడే అన్నపూర్ణ మన దేశంలో రగులుతున్న రైతుల రావణకాష్టం కొంతమేరకైనా
చల్లారుతుందేమో...
కామెంట్‌లు