వినత (కథ) --సరికొండ శ్రీనివాసరాజు
    శేషు, వినత సొంత అక్కా చెల్లెళ్ళ పిల్లలు. శేషు పెద్దమ్మ కూతురు వినత. శేషు కంటే 3 నెలలు చిన్న. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. ఇంట్లో పెద్దవాళ్ళు శేషుకు ఏ పని చెప్పినా నేనూ నీ వెంట వస్తా అంటూ శేషు వెంట వినత వచ్చేది. ఇద్దరూ కలిసి వీధులన్నీ తిరుగుతూ బాగా ఆటలు ఆడుకునేవారు. వీళ్ళిద్దరూ ఎంత ప్రాణ స్నేహితులైన అన్నా చెల్లెళ్ళో ఆ ఊరిలో చాలామందికి తెలుసు. కానీ ఇదంతా అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడే కదా! 
       శేషు వాళ్ళ అమ్మా నాన్నలు, వినత వాళ్ళ అమ్మా నాన్నలు ఉద్యోగ రీత్యా వేరు వేరు గ్రామాలలో ఉండటం వల్ల ఈ ఇద్దరూ కలుసుకోవడం వేసవి సెలవుల్లో మాత్రమే జరిగేది. ఎండాకాలం సెలవులు వస్తే చాలు శేషు, వినతలు వందల కొద్దీ ఆటలు ఆడేవారు. మళ్ళీ సెలవులు అయిపోయి ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళేటప్పుడు శేషు ఎంతో బాధపడేవాడు. ఆ బాధలో కొన్నాళ్ళ పాటు ఎవరితోనూ కలవలేక పోయేవాడు శేషుకు ఎప్పుడూ ఒక ఆలోచన వచ్చేది. 'మనుషులకు కూడా రెక్కలు ఉంటే ఎంత బాగుండేది? ఎప్పుడూ వినతతో ఆడుకోవచ్చు' అని.
       కాలం గడుస్తుంది. ఇద్దరూ 8వ తరగతిలోకి వచ్చారు. ఒక శుభకార్యంలో పాల్గొనే సందర్భంగా అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ అమ్మమ్మ ఇంట్లో కలుసుకున్నారు. నాలుగు రోజులు సరదాగా గడిపారు. అప్పుడే రాఖీ పౌర్ణమి వచ్చింది. వినత శేషుకు రాఖీ కట్టింది. ఆ సందర్భంలో "అన్నయ్యా! నాకు ఒక పెద్ద సహాయం చేయాలి నువ్వు." అన్నది. "నాకు మా పాఠశాలలో చెప్పే పాఠాలు అస్సలు అర్ధం కావడం లేదు. చదువులో చాలా వెనుకబడి ఉన్నాను. అందరూ నన్ను హేళన చేస్తున్నారు. నేను మీ పాఠశాలలో చేరి, మీ ఇంట్లో ఉండి చదువుకుంటాను. నువ్వు చాలా తెలివైన వాడివి కదా! మనం ఇద్దరం కలిసి చదివితే నేనూ తెలివైన విద్యార్థినిని అవుతాను." అన్నది వినత. "నువ్వు చదువులో చాలా తెలివైన దానివి అని తెలుసు. అబద్ధం చెబుతున్నావు ఏమిటి?" అని అడిగాడు శేషు. "మా అమ్మ గొప్ప కోసం చెప్పి ఉంటది. ప్రతీ తల్లీ తండ్రీ తన పిల్లలు సరిగా చదవకున్నా సరే వాళ్ళ గురించి మా పిల్లలు తెలివైన వాళ్ళు, తరగతిలో మొదటి ర్యాంకు వస్తారు అని చెప్పుకోవడం మామూలే కదా!" అన్నది వినత. శేషు కాసేపు మౌనంగా ఉన్నాడు. ఆలోచిస్తున్నాడు. ఇలా అన్నాడు. "విద్యా సంవత్సరం మధ్యలో స్కూల్ మార్చితే ఇబ్బందులు ఎదురవుతాయి. వచ్చే సంవత్సరం జూన్ నెలలో 9వ తరగతిలో మా పాఠశాలలో చేరు. అప్పటి వరకు మీ ఊళ్ళోనే చదువు." అన్నాడు శేషు. అలాగేనన్నది వినత.
       శేషు ఈసారి ఎండాకాలం సెలవుల్లో ఎక్కడికీ వెళ్ళలేదు. తన స్నేహితుడు సీనియర్ విద్యార్థి, తెలివైన విద్యార్థి అయిన సతీశ్ చేత 9వ తరగతి పాఠాలు చెప్పించుకున్నాడు. జూన్ నెలలో వినత శేషు వాళ్ళ పాఠశాలలో 9వ తరగతిలో చేరింది. శేషు ప్రతి సబ్జెక్టు చాలా శ్రద్ధగా పాఠాలు వింటూ అర్థం కాని విషయాలు తీరిక సమయాల్లో ఉపాధ్యాయుల చేత మళ్ళీ చెప్పించుకుంటున్నాడు. వినత చదువులో చాలా వెనుకబడి ఉంది. చాలా తక్కువ మార్కులు వస్తున్నాయి. చాలామంది విద్యార్థులు వినతను వెనుక నుంచి హేళన చేస్తున్నారు. శేషు వినత అవస్థ చూడలేక మరింత పట్టుదలతో చదువుతూ వినతతో కలిసి చదువుతూ వినతకు అర్థం కాని విషయాలు చెబుతున్నాడు. తీరిక సమయాల్లో స్నేహితులతో ఆటలు మానేసి వినతతోనే ఆడుతున్నాడు. క్రమ క్రమంగా వినత మార్కులు కూడా పెరుగుతున్నాయి. 9వ తరగతి పూర్తి అయ్యాక వేసవి సెలవుల్లో 10వ తరగతిలో ముఖ్యమైన విషయాలను ఉపాధ్యాయులు, తెలివైన సీనియర్ విద్యార్థులచే నేర్చుకుంటున్నారు. 10వ తరగతి ప్రీ ఫైనల్లో వినతకు 596 మార్కులు రాగా శేషుకు 575 మార్కులు వచ్చాయి. ఆశ్చర్యపోయాడు శేషు.
      తన ప్రాణ స్నేహితుడు రాముకు ఈ విషయం చెప్పాడు. "ఒరేయ్ శేషూ! వినత నువ్వు చిన్నప్పటి నుంచీ చాలా మంచి ప్రాణ స్నేహితులు. అయినా వినత చదువులో ఎలాంటి విద్యార్థో తెలుసుకోలేకపోవడం సిగ్గుచేటు. నిజానికి వినత చాలా తెలివైన విద్యార్థిని. 8వ తరగతిలో ఉండగా ఒక వేడుక సందర్భంగా మీ అమ్మమ్మ గారి ఇంటికి మీరు వెళ్ళినప్పుడు ఆ నాలుగు రోజులు నువ్వు బాగా చదువుతాననే బడాయితో పుస్తకాలు తీసుకుని వెళ్ళావు. ఏం చదివినావో ఏమో కానీ నీ పుస్తకాల సంచిలో ఒక పుస్తకంలో నీ ప్రోగ్రెస్ కార్డు పొరపాటున వినత చూసింది. అన్నింట్లో చాలా తక్కువ మార్కులు కదా! వినత చాలా నిరాశపడింది. నీ ప్రాణ స్నేహితుడిని నేను అని వినతతో ఎప్పుడూ చెబుతుంటావట కదా! వినత మీ నాన్న ఫోన్లోంచి నాకు కాల్ చేసి నీ చదువు గురించి అడిగింది. మనకు అసలే గంటల తరబడి స్నేహితులతో రోజూ క్రికెట్. ఇంట్లోకి వస్తే తీరిక లేకుండా మొబైల్ గేమ్స్, టి‌.వి. కార్యక్రమాలు కదా! ఆ విషయమే చెప్పాను. వినత బాగా ఆలోచించి నిన్ను మార్చడానికి తాను చదువు రాని మొద్దునని చెప్పి, నీతో కలిసి చదివే ఉపాయం పన్ని, నిన్ను మార్చే ప్రయత్నం చేసింది. నువ్వు నీ చెల్లెలి ముందు పరువు పోవద్దని పట్టుదలతో చదువును మెరుగు పరచుకున్నావు. అబద్ధంతో నిన్ను పూర్తిగా మార్చింది నీ ప్రియమైన చెల్లెలు." అన్నాడు రాము. ఇంటికి వచ్చాక శేషు వినతకు కృతజ్ఞతలు చెప్పాడు. 
       వినతను చూడటానికి వాళ్ళ అమ్మ వచ్చింది. శేషు పెద్దమ్మకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు. "చూడు శేషూ! వినత చిన్నప్పటి నుంచి వాళ్ళ తరగతిలో మొదటి ర్యాంకు విద్యార్థిని. తోటి స్నేహితులతో కలిసి చదువుతూ వాళ్ళను కూడా తెలివైన వారిగా తీర్చిదిద్దే గుణం వినతకు చిన్నప్పటి నుంచి ఉంది. దానికి తోడు వినత ఆటల్లోనూ చాలా చురుకుగా ఉంటుంది. శ్రావణి, సిరి, హైమవతి, వాగ్దేవి వంటి ప్రాణ స్నేహితులైన క్లాస్ మేట్సును విడిచిపెట్టి ఉండలేదు. తన పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా చాలా బాగా పాఠాలు చెబుతూ విద్యార్థుల పట్ల బాగా శ్రద్ధ చూపుతారు. ఇవన్నీ వదిలి పెట్టి అన్నయ్య భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మా అనుమతి తీసుకుని వచ్చింది. అనుకున్నది సాధించింది." అన్నది పెద్దమ్మ. శేషు, వినతులు ఉన్నత విద్యను పూర్తి చేసి గొప్ప ఉద్యోగాలను సాధించారు.

కామెంట్‌లు