మాతృదేవోభవ;-మంజుల సూర్య , హైదరాబాద్
 సృష్టిలో భాగమై సృష్టికర్తకు బదులుగా సృష్టింపబడిన ప్రతి మాతృమూర్తి పూజ్యనీయురాలే .'జగమే మరిపింపజేయునది కన్నతల్లి ప్రేమ శిశువైనా పశువైనా తన తల్లి ఒడికె పరుగులు తీయునులే , జననీ అను మాటలోనే తరియించును మనిషి జన్మ ' అన్నాడొక సినీ కవి.
వర్ణమాలలోని మొదటి అక్షరంతో మొదలయ్యే 'అమ్మ ' రెండవ అక్షరమైన ఆ తో మొదలయ్యే 'ఆదిగురువు' . అమ్మ అంటే ఒక భరోసా , అమ్మ అంటే ఆప్యాయత ఆలంబన ఆధారం .అమృతం ఎలా ఉంటుందో కానీ అది ఖఛ్చితంగా అమ్మ ప్రేమ ముందు దిగదుడుపే .మన పెద్దలు సైతం 'మాతృదేవోభవ పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటూ అమ్మకే అగ్రతాంబూలం ఇఛ్చారు .ప్రతిచోటా దేవుడు మన వెన్నంటి ఉండలేడని కాబోలు ఆయనకు బదులుగా అమ్మను సృష్టించాడు .
మనసుకి బాధకలిగినా, శరీరానికి బాధ కలిగినా మొదట గుర్తొచ్ఛేది అమ్మే .మన అస్తిత్వానికి మారు పేరైన అమ్మ గర్భము ధరించినప్పటి నుండి శిశువు బాధ్యతను బరువనుకోకుండా అలవోకగా మోస్తుంది శిశువు ఎదుగుదలకు అహరహరము శ్రమిస్తుంది కంటికి రెప్పలా కాపాడుతుంది నీడలా వెన్నంటి ఉంటుంది. అక్షరమక్షరము పలికిస్తూ లక్షలు సంపాదించే స్థాయికి తెస్తుంది మరి మనకు చదువు నేర్పించే ఆ చదువుల తల్లి అమ్మే కదా ! 
అమ్మ లాలి పాటను మించిన కమ్మదనం ఏసంగీతంలో ఉన్నది ? అందుకే అమ్మ ఒక 'సంగీత కళానిధి' .బిడ్డ వొళ్ళు వెచ్చనవగానే మాటిమాటికి చూస్తూ కనిపెట్టుకుని సేవలు చేసే అమ్మను మించిన 'డాక్టరు' ఎవరున్నారు? పరీక్షలో తప్పావనో మార్కులు సరిగా రాలేదనో నాన్న కోప్పడితే సర్దిచెబుతూ పిల్లలను వెనుకేసుకొచ్ఛే ఒక రక్షణ కవచం ఎల్లవేళలా కాపాడే 'పోలీసు' ఏది మంచో ఏది చెడో చెబుతూ ఎవరితో ఎలా మెలగాలో నీతికథలతో మాటలతో నిదురపుచ్ఛేఅమ్మను మించిన 'మార్గదర్శి' ఎవరున్నారు మానవ విలువలు పెంచే ప్రేమను పంచే' అనురాగ మూర్తి '! పిల్లలు తమకిష్టమైనవి కొనిపించుకోవాలన్నా తమ గొంతెమ్మ కోర్కెలు తీర్చుకోవాలన్నా నాన్నతో తిట్లు తిని అవసరాలు సరదాలు తీర్చే' రాయబారి' కబుర్లు చెబుతూ పిల్లలతో ఆడి పాడే ఓ 'మంచి స్నేహితురాలు' . బిడ్డ జీవితంలో అన్నీ తానై అంతటా తానై ఉన్నా పిల్లల ఉన్నత స్థితిని క్షేమాన్ని తప్ప ఏమీ ఆశించని 'ఉదాత్తురాలు' .
నాణానికి మరో కోణం అన్నట్లు సృష్టిలోని ప్రతితల్లీ తన పిల్లలను ఉన్నతమైన స్థితిలో చూడాలనుకుంటుంది తన సృష్టికి పేరు రావాలనుకుంటుంది అలా ఆశపడుతుంది కానీ ' అతి సర్వత్ర వర్జయేత్ 'అన్నట్లు అతి ప్రేమ అతి గారాబం పిల్లల ఎదుగుదలకి ప్రతిరోధకం అవుతుంది . పిల్లలు ప్రవహించే నీరు వంటివారు , ఆ ప్రవాహానికి ఊతం అవ్వాలే కానీ వారధి నిర్మించి బందీ చేయరాదు తగినంత స్వేచ్చ్చనివ్వాలే కానీ సంకెళ్లు వేయరాదు , మానవ విలువలు పెంచాలి కానీ మార్కులే ధ్యేయం కారాదు ఇంటి బాధ్యతను పంచాలి అప్పుడే దేశ పౌరుడిగా తన బాధ్యతను గుర్తిస్తాడు ధైర్యాన్ని పెంచి పిరికితనాన్ని తుంచాలి చిన్న సమస్యకే బెంబేలెత్తి బ్రతుకును బలి తీసుకోకుండా ధైర్యంగా ఎదుర్కొనే మానసిక గట్టితనాన్ని ఇవ్వాలి లక్ష్యం ఎంత ముఖ్యమైనదో లక్ష్యాన్ని చేరే ప్రయాణం అంతకన్నా ముఖ్యమైనది అని తెలుసుకునేట్టు చెప్పాలి లక్ష్య సాధనలో ఎండ్ అనేదే లేదు వఛ్చినా బెండ్ అయ్యి మార్గాన్ని మళ్లిస్తే కోరుకున్న మజిలీ సొంతమగుననే భావన కల్పించాలి అపుడే ఒడుదుడుకులని తట్టుకొని శరవేగంతో దూసుకపొయ్యే బాణంలా లక్ష్యాన్ని ఛేదించగలరు ఎందరికో స్ఫూర్తి కాగలరు .
మరి జీవితం లో చాలా భాగము మన బాగోగులు మన చదువులు మన పోషణకే కేటాయించిన అమ్మకు మనమిచ్ఛేది ఏది లేదా ? మన బాధ్యత లేదా ఆవిడ బాగోగులు మరి మనవి కావా ?ఎంతో ఉందనే చెప్పాలి ఈ ఇరువురి బాంధవ్యానికి బాధ్యతల నిర్వహణకు మమకారపు మాధుర్యానికీ చక్కటి మచ్ఛుతునక పుడమికి విత్తుకి గల మాతా శిశు బంధం .ఒకరితో ఒకరి జీవితం ముడివేసినట్లుగా పెనవేసుకున్నట్లుగా ఒకరి ఫై ఒకరి ప్రభావము మరెక్కడా కానరాదంటే అతిశయోక్తి లేదేమో
చిన్ని విత్తనంబు చీల్చుకొచ్చే
పుడమి తల్లి గర్భము నుండి పుట్టుకొచ్చే
అంతకంతకు పెరిగి చిన్ని మొక్కగా ఎదిగె
చింత లేక ఒదిగె ఒడిని చేరి
పుడమి నుండి పుట్టుకొచ్చే అంకురము కూడా పసిపాపలా తల్లిని కరుచుకొనే ఆ అమ్మ లాలన పోషణ లోనే చిన్నిమొక్కగా మారి ఆటుపోట్లను తట్టుకుంటూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ బాహువులు పెంచి ఎంతోఎత్తుకు పెరిగి దృఢమై వృక్షమై ఠీవిగా నిలుస్తుంది . బాహువుల నీడలో తల్లిని సేద తీరేలా చేస్తుంది గుల్మాల గుబాళింపుతో తల్లి పాదాలను స్పృశిస్తుంది వర్షధారతో ధరణి సారము పెంచి క్షయమవకుండా పొదివి పట్టుకుని కంటికి రెప్పలా అనునిత్యము అంటిపెట్టుకుని తీర్చుకోలేని తల్లి రుణాన్ని కొంతయినా తీర్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది .
ఆలోచన లేని నోరులేని ప్రాణి సైతం తన బాధ్యతను భేషుగ్గా నిర్వర్తిస్తుంటే వివేకం ప్రజ్ఞ ఆలోచన ఉన్న మనిషి మమకారము మరింత వేళ్ళూనుకోవాలి తన మాతృమూర్తి ఒడిని చిన్న చిన్న ఆనందాలతో ఒడిసి పట్టుకోలేంతగా నింపగలగాలి. కళ్ళలో ఆనందభాష్పాలకే చోటుండాలి తప్ప కన్నీళ్ళకు కాదు. నేనున్నానే ధైర్యాన్ని ఇస్తూనే ఇప్పటికీ నీవు అనుకున్నవన్నీ చెయ్యగలవనే నమ్మకాన్ని పిల్లలు కలిగిస్తే ఆ మాతా శిశు అనుబంధం జగతిలో మరెన్నో అద్భుతాల్ని సృష్టించగలదు మరెందరికో తార్కాణం కాగలదు తల్లి ఆశీస్సులు పిల్లల బంగరు భవితకు సోపానాలు .అలా కాకుండా తమ దారి తాము చూసుకుంటూ తల్లిదండ్రులను వారి ముసలితనాన మూర్ఖంగా వదిలివేసే మూర్ఖులకు పుట్టగతులుండవనేది అక్షర సత్యం
నివు చేసిన కర్మ ఖర్మ కానటుల నీ సృష్టికి నిన్ను మించిన ఆదర్శవంతులు లేనటుల నిన్ను నీవు మలచుకో నిన్ను మలచిన నీ శిల్పి గౌరవం ప్రేమకి మాత్రమే పాత్రురాలు కానీ నీ నిర్లక్ష్యానికి కాదని గుర్తెరిగి మసలుకో నిన్ను నీవు తీర్చిదిద్దుకో.


కామెంట్‌లు