సార్థకనామధేయురాలు వీరలక్ష్మి!!;-- యామిజాల జగదీశ్
 ఆమె పేరుకు తగిన మహిళే. ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించుకుంటూ ఓ అంబులన్సుని నడుపుతూ తనకు తల్లిదండ్రులు పెట్టిన పేరుకి  తగ్గట్టే ముందుకు దూసుకుపోతున్నారామె. 
ఆమె పేరు ఎం. వీరలక్ష్మి. 
తమిళనాడు ప్రభుత్వం 2020 ఆగస్ట్ 31న వీరలక్ష్మిని అంబులన్స్ డ్రైవరుగా ఆమెను ఎంపిక చేసి సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో తమిళనాడులోనే కాకుండా దేశంలోనే తొలి అంబులన్బ్ మహిళా డ్రైవరుగా ఆమె రికార్డు పుటలకెక్కారు.
తమిళనాడులోని తేని జిల్లా బోడినాయక్కనూరులో టివికె నగర్ సామి వీధికి చెందిన వీరలక్ష్మి భర్త ముత్తుకుమార్. వీరికి కూతురు. కొడుకు ఉన్నారు. వీరిప్పుడు చెన్నైలోని తిరువేర్కాడులో స్థిరపడ్డారు. ఆమె భర్త ముత్తుకుమార్  టాక్సీ డ్రైవరు. 

చిదంబరంలో ఆటోమొబైల్బ్ లో డిప్లొమా చదివిన వీరలక్ష్మి ఓ మూడేళ్ళు భర్తకు తోడుగా కాల్ టాక్సీ నడిపారు.
యావత్ ప్రపంచాన్నీ గడగడలాడించిన కరోనా లాక్ డౌన్ కాలంలో ఆమె చెన్నై నుంచి స్వస్థలానికి వెళ్ళవలసి వచ్చింది. ఓ విధంగా చెప్పాలంటే ఆమె జీవితంలో ఇదొక మలుపే అయ్యింది.
తేని ప్రభుత్వ వైద్య కళాశాల 108 అంబులన్స్ లో రోగులను ఎలా ఆస్పత్రికి తీసుకురావాలి అనే విషయమై ఇచ్చిన ప్రత్యేక శిక్షణలో ఆమె పాల్గొన్నారు. ఇది ఆమె పురోగతికి తొలి మెట్టయింది. 
చెన్నైలో ఆమె అంబులన్స్ డ్రైవరుగా ఎంపికైనప్పుడు అందరూ విస్తుపోయారు. ఓ మహిళ అంబులన్స్ వాహనం నడపడం అంత సులభం కాదని, ఎటువంటి ట్రాఫిక్కులోనైనా వాహనాన్ని నడిపి రోగిని సకాలంలో ఆస్పత్రికి చేర్చడం మామూలు విషయం కాదని అన్నారు. అయితే ఆమె ఏమాత్రం తగ్గకుండా తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని "ఔరా" అన్పించుకుని ఆ వృత్తిలోనే స్థిరపడటం విశేషం.
వీరలక్ష్మి మాట్లాడుతూ "డ్రైవింగ్ అనేది నాకెంతో ఇష్టమైన పని. అందులోనూ ప్రజలకు సేవ చేయడం అనేది మహద్భాగ్యం అనుకుని అంబులన్స్ నడపడానికి సిద్ధపడ్డాను. నాకెంతో సంతోషంగా ఉంది" అన్నారు. అంబులన్స్ స్టీరింగ్ పట్టుకున్నాకే తెలిసింది...నేనే మొట్టమొదటి అంబులన్స్ మహిళా డ్రైవర్ అనే విషయమని చెప్పారు.
ఆ ఉద్వేగానుభూతి మాటలకందనిదంటూ 108 అంబులన్సుని అతి వేగంగా నడపడంలో తనకెలాంటి భయమూ లేదన్నారు వీరలక్ష్మి. తనలా మహిళలు ప్రజలకు సేవ చేసే విధంగా వివిధ రంగాలలో చేరేందుకు ముందుకొస్తారనే ఆశను వ్యక్తం చేసారు వీరలక్ష్మి!
భర్త కారు నడుపుతున్నప్పుడు చాలాసార్లు ఆమెకూడా పక్కనే కూర్చుని డ్రైవింగులోని మెళకువలను తెలుసుకుని తానూ డ్రైవరవాలనుకుని అనుకున్నది సాధించడం విశేషం. డ్రైవింగుకు అవసరమైన శిక్షణ పొందిన వీరలక్ష్మి మొదట్లో కాల్ ట్యాక్సీని నడిపారు. రాత్రి వేళల్లో స్త్రీలెవరైనా రోడ్డుమీద ఒంటరిగా కనిపిస్తే వారిని ఎక్కించుకుని వారి ఇంటి దగ్గర దింపేవారు.
అంబులన్స్ డ్రైవరుగా ఎంపికైన తొలిరోజుల్లో ఆమె రోజూ కనీసం నలుగురు రోగులనైనా తరలించేవారు. ఒక్కొక్క ప్రాణం ఊపిరిపోసుకునేటప్పుడల్లా అంబులన్స్ డ్రైవింగ్ వృత్తి పట్ల ఆమెకు ప్రేమ, గౌరవం మరింత ఎక్కువయ్యాయి. అన్నామలై విశ్వవిద్యాలయం నుంచి ఆటోమొబైల్స్ కి సంబంధించి డిప్లొమా సర్టిఫికెట్ పొందాకే ఈ వృత్తికి దరఖాస్తు చేసుకుని ఎంపికైన ఆమె ఆత్మవిశ్వాసమే తనకు బలమని అంటుంటారు. కరోనా కాలంలో సహ సిబ్బంది తనకందించిన సహకారాన్ని మరచిపోలేనిదన్నారు. ఈ సమయంలో పిల్లలిద్దరికీ దూరంగా ఉండవలసి వచ్చిందని, తన ఉద్యోగంలోని ప్రతి విషయాన్నీ కుటుంబసభ్యులతో పంచుకుంటానని చెప్తూ రోగిని సకాలంలో ఆస్పత్రిలో చేర్పించేటప్పుడు వారి బంధువులు తన చేతులు పట్టుకుని కృతజ్ఞతలు చెప్తుంటే మనసు కరిగిపోతుందన్నారు. ఓ ప్రాణం విలువ వెలకట్టలేనిదని ఈ వృత్తి ద్వారా ఎప్పటికప్పుడు తెలుస్తోందని అన్నారు. 
అంబులన్స్ నడపడానికి ముందర ఆమె సిలంబం నేర్పించే కేంద్రంలో శిక్షకురాలిగా ఉండేవారు. రాష్ట్ర స్థాయిలో ఆమె సిలంబం లో రెండు స్వర్ణపతకాలు గెల్చుకున్నారు. సిలంబం ఓ యుద్ధ కళలాంటిది.
పెళ్ళయ్యాక వాణిజ్యానికి సంబంధించి డిగ్రీ చదివిన ఆమెకు ఎంబిఎ చదవాలని ఆశ. 
అనుకున్న ఆశయాన్ని నెరవేర్చాలంటే పట్టుదల, అంకితభావం, కృషి ముఖ్యమని, ఇవి ఉంటే ఏదైనా సాధించవచ్చన్నది వీరలక్ష్మి అభిప్రాయం. 


కామెంట్‌లు