తొలి తమిళ వార్తాపత్రిక "ఉదయతారగై";-- యామిజాల జగదీశ్
 ఇటీవల వాట్సప్ లో మద్రాసు నుంచి చిరకాల మిత్రుడు ప్రసాద్ ("వార్త" పత్రిక మద్రాసు బ్రాంచిలో ఆయనతో కలిసి పని చేసాను)  ప్రపంచంలోని తొలి తమిళ పత్రిక ఉదయతారగై అంటూ ఓ పోస్ట్ పంపారు. అది చూడటంతోనే ఆ పత్రిక వివరాలు తెలుసుకోవాలనిపించి ఆయనకు ఓ మెసేజ్ ఇచ్చాను. "నాకా వివరాలు తెలియవు. నాకెవరో పంపితే మీకది పంపాను" అన్నారు. దాంతో ఆ పత్రిక వివరాలకోసం అంతర్జాలంలో వెతకగా కొంత
సమాచారం దొరికింది. దాని ఆధారంగానే ఈ రెండు ముక్కలు రాసాను. 
శ్రీలంకలోని జాఫ్నా నుంచి ఈలం వారి తొలి తమిళ పత్రిక "ఉదయతారగై" ! (తమిళంలో క అక్షరాన్ని గ - అని పలుకుతారు. సందర్భాన్నిబట్టి ఉచ్చారణ ఉంటుంది. మనం తెలుగులో చెప్పుకునేటట్లయితే ఉదయతారక అనుకోవాలి. తమిళ పదం కావడంవల్ల తారగై అనాలి). ఈ ఉదయతారగై పత్రిక 1841 జనవరిలో అమెరికా మిషనరీ ద్వారా  వెలువడింది. 
శ్రీలంకలో 1839 డిసెంబర్ 18వ తేదీన పత్రిక ముద్రణకు సంబంధించి ఓ చట్టం అమలులోకి వచ్చింది. మరో పదమూడు నెలలకు అంటే 1841 జనవరి ఏడో తేదీన తొలి సంచిక "ఉదయతారగై" వెలువడినట్లు చరిత్రపుటలు పేర్కొన్నాయి.
ఈ పత్రికలో అరబిక్ అంకెలను కాకుండా తమిళ అంకెలను ఉపయోగించేవారు.
ఈ పత్రిక వెలువడడానికి ముందు 1826లో జోసెఫ్ నైట్ అనే విదేశీయుడు ఓ ప్రెస్ స్థాపించారు. ఇందులో ముత్తి వయి (అంటే స్వర్గానికి దారి - ముక్తిమార్గం అని అర్థం) అనే పేరుతో ఓ పత్రిక  వెలువడుతుండేది. క్రైస్తవమత ప్రచారానికి పరిమితమై వెలువడుతుండేది.
ఉదయతారగై పత్రిక తమిళ, ఇంగ్లీషు భాషలలో వెలువడేది. తొలి రోజుల్లో నెలకు రెండుసార్లు వచ్చేది. తర్వాత వారానికొకసారి వెలువడుతుండేది. ఇంగ్లీషులో  దీని పేరు - మార్నింగ్ స్టార్!
ఈ పత్రికలో చరిత్రకు సంబంధించిన అంశాలు, చదువుసంధ్యలు, శిక్షణ వంటి వాటికి ప్రాధాన్యమిస్తుండే వారు. ఈ ఆంగ్ల, తమిళ పత్రికలకు మొదటి సంపాదకుడు హెన్రీ మార్టిన్. ఈయన జాఫ్నావాసి. పత్రికలో ప్రధానవార్తలను హెన్రీ మార్టిన్ రాసేవారు. పంచతంత్ర కథలను కూడా హెన్రీ ఇంగ్లీషులోకి అనువదించేవారు. ఈ కథలకు విశేష ఆదరణ లభించేది.
అంతకుముందు శ్రీలంకలో నడచిన పత్రికలకు ఆంగ్లేయులే సంపాదకులుగా ఉండేవారు. అయితే శ్రీలంక జాతీయుడైన హెన్రీ మార్టిన్ సంపాదకత్వంలో వెలువడిన  "ఉదయతారగై" పత్రిక ప్రపంచంలోనే ప్రప్రథమ తమిళ వార్తాపత్రికగా చరిత్ర పుటలకెక్కడం విశేషం. సేత్ సబేశన్, కరోల్ విశ్వనాథ పిళ్ళై, ఆనల్డ్ సదాశివం పిళ్ళై తదితరులుకూడా ఉదయతారగైలో సంపాదకవర్గంలో పని చేసారు. ఈ పత్రిక ప్రచురణ కర్త - నేత్తన్ స్ట్రాంగ్ అలియాస్ అంబలవానర్ చిట్రంబలం. ఈయన 1894 ఫిబ్రవరిలో మరణించారు. 
ఉదయతారగై వెలువడుతున్న కాలంలోనే పాట్రియాట్, జాఫ్నా ఫ్రీమాన్, లిటరరీ మిర్రర్ వంటి పత్రికలుకూడా వచ్చేవి. 1931 - 1956 సంవత్సరాల మధ్య ఈలకేసరి అనే తమిళ వార పత్రిక వెలువడేది. ఈ పత్రికకు భారత దేశం, మలేసియా, దక్షిణాఫ్రికా, ఫిజి, మారిషష్ తదితర ప్రాంతాలనుంచి చందాదారులుండేవారు.కామెంట్‌లు