"శివ " అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆఊరి లో ఇద్దరు అన్నదమ్ములు. అన్న పొలం షాపు తో కాస్త బానే ఉన్నాడు. బాల్యం లోనే తల్లి తండ్రి చనిపోటంతో తనకన్నా 10ఏళ్ళు చిన్న ఐన తమ్ముడు శివని కనిపెట్టుకుని చూసుకుంటున్నాడు.శివ ఇంటాబైట అన్నకి చేదోడువాదోడుగా ఉంటూ ఆపల్లెబడిలో 5పాసైనాడు.  2కి.మీ.దూరంలో ఉన్న ప్రభుత్వ బడిలో చేరాడు.అన్న కి పెళ్ళికావటంతో కాస్త కష్టాలు ఆరంభమైనాయి.వదినె కానరాకుండా సతాయిస్తోంది. బడి టైం అవుతుంటే రాత్రి అన్నం కంచంలో పెడుతుంది. తినే టైం లేక  లంచ్ బాక్స్ లో పెట్టుకొని వెళ్లేవాడు.సాయంత్రం అన్న ఇంట్లో ఉన్న రోజు టిఫిన్ చాయ్ దొరుకుతుంది. అన్న వెంట షాపు కెళ్ళి  అక్కడే హోంవర్క్ చేస్తూ అన్నకి సాయపడేవాడు. వదినెకు కొడుకు పుట్టడం వదినె తల్లి రాకతో శివ పని ఉక్కిరిబిక్కిరిగా ఉంది. పిల్లాడిపనితో వదినె మోకాళ్ళ నెప్పులు అనేవంకతో ఆమె తల్లి మంచందిగరు.మూడు నెలల పరీక్ష లో  శివ అన్నింటిలో ఫెయిల్ అయ్యాడు.అన్న మొదటి సారి శివాని బాగా తిట్టాడు. ఆమర్నాడు షాపు నించి  ఎందుకో  వెంటనే ఇంటికి వచ్చి న అన్న  శివా ఇంట్లో పనులు చేయటంచూసి ఆశ్చర్య పోయాడు. "ఏంరా!బడికి వెళ్లలేదా?" "నాయనా! పిల్లాడిని ఆడించాలని నేనే ఉండమన్నాను.బడికి రెండు రోజులు వెళ్లకపోతే ఏమీకాదు"అత్తగారి మాటలకు బిత్తరపోయాడు.హెచ్.ఎం.కబురు పెట్టడంతో బడికి వెళ్లి విషయం తెలుసు కున్న శివ అన్న విస్తుబో యాడు. దాదాపు  రెండు నెలలనించి రెగ్యులర్ గా శివా బడి కి రావటంలేదు అని తెలిసి కోపంతో ఇంటికి వచ్చిన అన్న  అంట్లగిన్నెలుతోమి లోపల పెడుతున్న శివ ని చూసి  చూచాయగా సంగతి గ్రహించాడు.ఆడాళ్లని ఏమన్నా అంటే పెద్ద లొల్లి అవుతుంది. అందుకే  శివ ని బట్టలు సర్దుకోమని తన షాపు దగ్గరలో ఉన్న  ఓఅవ్వ ఇంట్లో తిండి తిప్పల ఏర్పాటు చేసి షాపు లో నే వాడిని పడుకోమన్నాడు.ఈసారి  నెలపరీక్షల్లో అన్నిట్లో 90పైనే మార్కులు వచ్చాయి.ఆరోజు భార్య అడిగింది "శివని మీషాపులో ఉంచుకున్నారా?" "అవును. వాడిచదువు నాషాపు రెండు సాగుతాయి.మీఅమ్మని మీఅన్న దగ్గరకు వెళ్లి పొమ్మను.ఏడాది పైగా తిష్ట వేసింది. శివ చేత ఇద్దరు గొడ్డుచాకిరీ చేయించారు.ఇంటిపని అంతా నీవే చేసుకో."భర్త మాటలతో కంగుతిన్నది ఆమె!కాలచక్రం దొర్లింది.పెద్ద ఆఫీసర్ ఐన శివ  తమ ఊర్లో హాస్టల్ పెట్టి బీదపిల్లలకి ఫ్రీగా దాతలసాయంతో భోజనం ఏర్పాటు చేశాడు. శివ అన్న కొడుకుని  తన దగ్గర ఉంచుకొని చదివిస్తున్నాడు. మంచం పట్టిన అన్న బాగోగులు వైద్యం  అంతా శివ చూసుకుంటున్నాడు.వదినె తన కొడుకు  తన దగ్గర లేకుండా  పట్నంలో శివ దగ్గర ఉన్నందుకు బాధపడ్తుంది. కానీ తను శివ కి చేసిన  అన్యాయం  తల్చుకుంటూ పశ్చాత్తాప పడుతుంది. ఎప్పుడూ మనం మంచి చేయాలి కానీ అపకారం చేస్తే  ఎప్పుడో అప్పుడు మనం  ఆదీనస్థితిని అనుభవించాల్సి ఉంటుంది. 🌹
కామెంట్‌లు