అక్కడేదో జరుగుతుంది..!!----డా.బండి.సత్యన్నారాయణ-- విశాఖపట్టణం.
ఈ మధ్య అమలాపురంలో
ఏదో జరుగుతుంది

బోధిసత్వుని బోధనలు జీర్ణించుకున్న అమలాపురం
అంబేద్కరుని ఆశయాలను
ఆపోసన పట్టిన అమలాపురం
ఏదో చెప్పాలని ప్రసవవేదన అనుభవిస్తుంది

ఎన్నెన్నో కలలు కన్న
ఈలి వాడపల్లి గారి
కలలీడేరే  దారేదో దొరికినట్టుంది

నందనార్ హరి గొంతులోంచి 
ఎగసిపడిన వాక్యాలేవో
అగ్ని కణాలై రగుతున్నట్టుంది

కుసుమ ధర్మన్న గారి 'జయభేరి' అక్షరాలు ఆయుధాలై మొలకెత్తుతున్నట్టున్నాయి

బోయి భీమన్న గారి
'పాలేరులు' 
కలెక్టర్లై కదం తొక్కుతున్నట్టుంది

అందర్నీ ఒరే అనే
కళా వెంకట్రావుని
ఒరే వెంకట్రావ్ అన్న
సమతా మూర్తి
బియస్స్ మూర్తి గారు
సమాధిలోంచి లేచొచ్చి
గడియారం స్తంభం సెంటర్లో
బహిరంగ సభలో మాట్లాడుతున్నట్టుంది

చట్టసభలో చెప్పుతో
చెంపపగలగొట్టిన
ఈశ్వరీ బాయి విగ్రహం
పాదయాత్ర చేస్తున్నట్టుంది

ఏ ఆరాటమూలేని వాళ్ళకి
పోరాటం మప్పిన
బొజ్జా అప్పల స్వామి గారి
రాజకీయ చైతన్యమేదో
గోదారై పొంగుతున్నట్టుంది

దేవుళ్ళ సమాధులపై
అంబేద్కర్ వాదాన్ని ఆవిష్కరించిన
తారకం గారు
నది పుట్టిన గొంతుకై
సమరశంఖం పూరించినట్టుంది

ఆధిపత్య కులాల
అధికారం కోసం
పావులై బతికే
కొండచిలువులకు
రాజకీయ పావులు కదపడం నేర్పిన
బి వి రమణయ్య గారు
ఓటు విలువ గురించి ఏదో మాట్లాడుతున్నట్టుంది

కోనసీమ హృదయాలమధ్య
స్వర్ణ వారధి నిర్మించిన
బాలయోగి గారు
పార్టీలకతీతంగా
ఆధిపత్య కులాల కుట్రలను
పార్లమెంటులో నిలదీస్తున్నట్టుంది

గణతంత్ర వేడుకల్లో
వాహనాల్లా
వీరంతా
వీరోత్సాహాలతో 
వరసగా ఇలా కవాతు చేస్తుంటే
ఇపుడు
అమలాపురంలో అధికారం
నీలి జెండా నీడకై తహతహలాడుతున్నట్టుంది.

                            ***


కామెంట్‌లు