ఓ సృష్టికర్తా నీకిదిన్యాయమా!;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగనగరం
అందాలు
అతివలకేసొత్తా
ఆకర్షించి ఆనందపరచటానికి

పువ్వులు
పూబోడులకేనా
పొంకాలు ప్రదర్శించటానికి

నవ్వులు
నాతులకే ఆస్తా
పెదవులపై చిందించటానికి

వెలుగులు
వనితలకే పరిమితమా
మోములపై ప్రసరించటానికి

ఓరచూపులు
వామలకొరకేనా
వలపులవలలు విసరటానికి

సిగ్గులు
సుదతుల హక్కా
మనసులను మురిపించటానికి

వన్నెలు
వారిజాక్షులవేనా
పసిడిఛాయలో ప్రకాశించటానికి

బంగారునగలు
భామలకేసొమ్మా
ధరించి ధగధగలాడటానికి

సిగ్గులు
సుదతుల హక్కా
వగలు ఒలకబోయటానికి

అలకలు
ఆడవారికె అస్త్రాలా
అనుకున్నవి సాధించటానికి

ప్రేమలు
ప్రేయసులపాలేనా
ప్రియులను పొందటానికి

ఆడవారికి
అన్ని వరాలిచ్చావా స్వామి
మగవారికి
మొండిచెయ్యిచూపావా స్వామి

విరించీ
వివక్షను మానవయ్యా 
సోయగాలన్నిటినీ
సర్వప్రాణులకు పంచవయ్యా!


కామెంట్‌లు