మతంగ మహర్షి.పురాణ బేతాళ కథ. - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించి ఉన్నబేతాళుని బంధించి భుజంపైనచేర్చుకుని నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు ' మహరాజా నీ పట్టుదలమెచ్చదగినదే నాకు మతంగుడు గురించి తెలియజేయి. తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు' అన్నాడు.
' బేతాళా మతంగుడు (మతంగ మహర్షి) గౌతమ వంశానికి చెందిన బ్రాహ్మణుడు. అతను మంచి గుణాలు కలిగి నీతిమంతుడై, వేదశాస్త్రాలన్నీ చదువుకొని యజ్ఞకర్మలు చేసాడు.  
అతను తన తండ్రి ఆజ్ఞ ప్రకారం ఒక యజ్ఞానికి వెళుతున్నప్పుడు దారిలో ఒక గాడిద పిల్లను కర్రతో గట్టిగా కొట్టాడు. ఆ గాడిద పిల్ల ఏడుస్తూ తనతల్లి వద్దకు వెళ్ళి మతంగుడు అనవసరంగా కొట్టిన సంగతి చెప్పింది. ఆ గాడిద తన కూతురుతో " అమ్మా ! ఇతడు చంఢాలుడు, క్రూరుడు అందుకే నిన్ను అలా కొట్టాడు " అని చెప్పింది. గాడిదమాటలను అర్ధం చేసుకున్న అతను " గాడిద ఊరికే అలా అన లేదు. గాడిద మాటలలో ఏదో అంతరార్ధము ఉంది. లేకుంటే అలా ఎందుకు అంటుంది " అనుకున్నాడు. అతను ఆ గాడిద వద్దకు వెళ్ళి తన జన్మరహస్యం గూర్చి అడిగాడు. అపుడు ఆ గాడిద " ఓ బ్రాహ్మణుడా, నీ తల్లి కామంతో ఒక క్షురకుని వలన నిన్ను కన్నది. కనుక నీవు బ్రాహ్మణుడివి కాదు" అని చెప్పింది. ఆ విషయం తెలిసిన తరువాత అతనికి యజ్ఞానికి వెళ్ళడానికి మనస్కరించక తిరిగి ఇంటికి వెళ్ళి తన తండ్రితో జరిగిన విషయమంతా చెప్పి, బ్రాహ్మణత్వం సంపాదించడానికి అడవులకు పోయి తపస్సు చేయడం ప్రారంభించాడు.
అతను కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రసన్నము చేసుకున్నాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై అతనికి ఏం వరం కావాలో అడిగాడు. దానికి మతంగుడు బ్రాహ్మణత్వం ప్రసాదించమని అడిగాడు. అందుకు ఇంద్రుడు "బ్రాహ్మణత్వము మహత్తరమైనది. ఇతరులకు అది లభ్యము కాదు కనుక మరేదైనా వరము కోరుకో " అని అన్నాడు. మతంగుడు సంతృప్తి పడక మరలా తపస్సును కొనసాగించాడు. ఒంటి కాలి మీద మరొక నూరేళ్ళు తపస్సు చేసి మరల ఇంద్రుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఇంద్రుడు " కుమారా, నీ పట్టు విడువక ఉన్నావు. శూద్రుడు ఇలాంటి తపస్సు చేస్తే చస్తాడు జాగ్రత్త అని బెదిరించి అసలు బ్రాహ్మణత్వము ఎలా సిద్ధిస్తుందో నీకు తెలుసా ! ఇంతకంటేపది రెట్లు తపస్సు చేస్తే కాని ఒక చంఢాలుడు శూద్రుడు కాలేడు. దాని కంటే నూరు రెట్లు తపస్సు చేస్తే కాని శుద్రుడు వైశ్యుడు కాలేడు. దాని కంటే వేయిరెట్లు తపస్సు చేసిన కాని వైశ్యుడు క్షత్రియుడు కాలేడు. దాని కంటే పది వేల రెట్లు తపస్సు చేసిన కాని క్షత్రియుడు దుర్మార్గుడైన బ్రాహ్మణుడు కాలేడు. దానికంటే లక్షరెట్లు తపస్సు చేస్తే కాని దుర్మార్గు డైన బ్రాహ్మణుడు ఇంద్రియములను, మనస్సును జయించి, సత్యము అహింసలను పాటించి, మాత్సర్యము విడిచి పెట్టి సద్బ్రాహ్మణుడు కాలేడు. అటువంటి సద్బ్రాహ్మణత్వము ఒక వంద సంవత్సారాల తపస్సుకు వస్తుందా ! చెప్పు " అన్నాడు.
ఒక వేళ బ్రాహ్మణ జన్మ పొందినా దానిని నిలబెట్టు కొనుట కష్టము. ఒక్కొక్క జీవుడు అనేక జన్మల తర్వాత కాని బ్రాహ్మణజన్మ ఎత్త లేడు. అలా ఎత్తినా అతడు దానిని నిలబెట్టుకోలేడు. ధనవాంఛ, కామవాంఛ , విషయాసక్తితో సదాచారములను వదిలి దుర్మార్గుడు ఔతాడు. తిరిగి బ్రాహ్మణజన్మ రావడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది. అటువంటి బ్రాహ్మణజన్మ కొరకు నీవు తాపత్రయపడి నీ వినాశనము ఎందుకు కొని తెచ్చుకుంటావు. నీ కిష్టమైన మరొక వరము కోరుకో ఇస్తాను తపస్సు చాలించు " అన్నాడు. మారుమాటాడని మాతంగుడి మొండి తనము చూసి విసుగు చెంది ఇంద్రుడు వెళ్ళి పోయాడు. మాతంగుడు తిరిగి తన తపస్సు కొనసాగించాడు. కాలి బొటనవేలి మీద నిలబడి శరీరం అస్థిపంజరము అయ్యేవరకు తపస్సు చేసాడు. అతడి శరీరము శిధిలమై పడిపోతుడగా ఇంద్రుడు పట్టుకున్నాడు. ఏమిటి నాయనా ఇది పెద్ద పులిలా నిన్ను మింగగలిగిన బ్రాహ్మణత్వము నీకెందుకు చక్కగా వేరు వరములు అడిగి సుఖపడు " అన్నాడు. మాతంగుడు అంగీకరించగానే ఇంద్రుడు " నీవు చంఢదేవుడు అనే పేరుతో అందమైన స్త్రీల పూజలందుకుని వారి వలన నీ కోరికలు ఈడేర్చుకుంటావు అని వరాలు ప్రసాదించాడు. కానీ బ్రాహ్మణ జన్మను ప్రసాదించలేదు.
 
వాలి మహిషాసురుడితో యుద్ధం చేసాడు. భీకర యుద్ధంలో మహిషాసురుడు బలహీనుడయ్యాడని అర్థం చేసుకున్న వాలి వాడిని పిడికిటి పోటులతో చంపి, వాడి కళేబరాన్ని చేతులతో పైకెత్తి, ఆమడ దూరంలో పడేట్లు విసిరి వేశాడు. అప్పుడారాక్షసుడి నోటినుండి కారుతున్న నెత్తురు గాలికి కొట్టుకుని వచ్చి మతంగాశ్రమంలో పడింది. అది చూసి మతంగుడికి బాగా కోపం వచ్చింది. "దుష్టబుద్ధి, పాపి, బుద్ధిలేనివాడు, జ్ఞానహీనుడు, ఎవడిలా నామీద నెత్తురు పడేశాడు?" అని ఆశ్రమం బయటకి వచ్చి చూస్తే, ప్రాణం పోయి కొండలాగా పడివున్న రాక్షసుడిని చూశాడు. ఎవరీ పని చేశాడని ఆలోచించి, తన తపశ్శక్తితో బలోన్మత్తుడైన వాలి చేసిన పని ఇది అను గ్రహించాడు. వాలిమీద ఆగ్రహంతో వాలి ఈ ఆశ్రమానికి వస్తే చచ్చిపోతాడు అని శపించాడు. ఆ ఆశ్రమ ప్రదేశం ఒక ఆమడ విస్తీర్ణం కలది. దానిలోపలికి వాలి వస్తే చచ్చిపోతాడు. అక్కడున్న వాలి పక్షాన వున్న కోతులను సూర్యోదయం లోపల ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లాలని, వెళ్లకపోతే అందరూ శిలలుగా వేల సంవత్సరాలు వుండిపోతారని కూడా శపించాడు. ఇలా మునీశ్వరుడు శపించడంతో అక్కడున్న కోతులు భయపడి వాలి దగ్గరకు పోయి జరిగిన సంగతంతా చెప్పాయి. ఆ విషయాన్ని తెలుసుకున్న వాలి మునీశ్వరుడి దగ్గరకు పోయి, నమస్కారం చేసి, ‘దయాశాలీ నన్ను క్షమించు’ అని ఎన్ని విధాల వేడుకున్నా ఆయన కోపం వదలలేదు. అప్పటి నుండి వాలి ఈ ఆశ్రమానికి రాలేదు. అందువల్ల సుగ్రీవుడు ఆ ఆశ్రమంలో తలదాచుకున్నాడు  'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభగంకావడంతో, శవంతోసహా మాయమైన బేతాళుడు తిరిగి చెట్టువద్దకు చేరాడు.పట్టువదలనివిక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.


కామెంట్‌లు