హా!మండూకా!ఒరియాకథ ఆధారం...అచ్యుతుని రాజ్యశ్రీ

 అప్పయ్య తండ్రి పండితుడే కానీ తండ్రి పాండిత్యం అతనికి  రాకపోవడం తో "మండూక" కప్పయ్య అని అతన్ని పిలిచి ఎగతాళి చేసేవారు ఊరంతా. "ఓం అంటే ఢం రానివాడివి .తిని కూచుంటే ఎలా?పిల్లాపాపని సాకాలిగదా?"అని భార్య చెవినిల్లు కట్టుకుని పోరటంతోకుటుంబంతో కలిసి  నగరానికి వచ్చి ఓధనవంతుని ఇంట్లో పనికిచేరారు భార్య భర్తలు.ధనికుని కూతురికి పెళ్ళి నిశ్చయం కావటంతో ఆరోజు మంచి విందు ఏర్పాటు చేశాడు యజమాని. ఊరంతా విందుకి హాజరైనారు.పాపం  అప్పయ్య కుటుంబానికి అడుగు బొడుగు చాలీచాలని వంటకాలే మిగిలాయి.అతనికి రోషం ముంచుకొచ్చింది. "నావంశ పేరు ప్రతిష్ఠలు నాతడాఖా చూపుతా"అనుకున్నాడు. వారంతర్వాత పెళ్లి కొడుకు గుర్రంపై ధనికుని ఇంటికొచ్చాడు.అప్పయ్య కి తళుక్కున ఓ ఆలోచన మెరిసింది. అంతా అలసి నిద్ర లోకి జారాక ఆగుర్రాన్ని దూరంగా ఉన్న మామిడి తోపుకి తీసుకుని వెళ్లి ఓచెట్టుకి కట్టేసి ఏమీతెలీనివాడిలా తన ఇంటికెళ్లి పోయాడు. పొద్దుటే భార్యతో అన్నాడు "నీవు  అందరితో నాగూర్చి కాస్త గొప్పగా చెప్పు.మాఆయనకి మంత్రశక్తి ఉందని పోయిన వస్తువుల జాడ కనుగొంటాడని చెప్పు.మగపెళ్లివారిలో బాగా ప్రచారం చెయ్యి "అని పనిలోకి వెళ్లబోతున్న భార్య కు నొక్కి చెప్పాడు.వధువు ఇంట్లో ఖంగారు గందరగోళం మొదలైంది. వరుడు ఎక్కివచ్చిన గుర్రం మాయంకావటం అపశకునంగా భావించారు. "అయ్యా!మాఆయనకి కొద్దోగొప్పో జ్యోతిషం లో ప్రవేశంఉంది.ఏవస్తువు పోయినా వాటిజాడ చెప్పగలడు"అని అప్పయ్య భార్య టముకుకొట్టడంతో అప్పయ్య ను పిలిపించారు. కాసేపు మీనమేషాలు లెక్కిస్తూ
 ఆకాశంవంక చూసి "ఆ..చిక్కుతుంది మీగుర్రం!మామిడి తోపులో ఉంది "అని చెప్పటంతో మిగతా నౌకర్లు పరుగులుపెట్టి గుర్రం ని తెచ్చారు. ఇంకేముంది?అప్పయ్య కి మంచి పేరు లెక్క లేనన్ని బహుమతులు దక్కాయి. ఓసారి  ఆఊరి జమీందారు ఇంట్లో నగలు పోయాయి. "అప్పయ్య గారు!ఇక్కడే ఉండి మంత్రపఠనం చేస్తూ  త్వరగా దొంగల ఆచూకీ కనుక్కోండి. "అని "రేపు చెప్తా"అని తప్పించుకో జూసిన అప్పయ్యకు ప్రత్యేక గది ఏర్పాటు చేశాడు జమీందారు. పాపం  అతని పని కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. ఆరాత్రి"ఓజిహ్వా!నీవు దురాశ తో ప్రాణంమీదకు తెచ్చుకున్నావు గదా?"అని బాధ తో గొణగసాగాడు.సరిగ్గా జిహ్వ అనే పేరు గల దాసి అతనికి  భోజనం తెస్తూ ఆమాటలువిని భయంతో వణికింది. "అయ్యా!నేనే నగలు దొంగిలించిన జిహ్వ ని.ఇదిగో నన్ను కాపాడండి బాబూ!"అని ఏడుస్తూ  తన చీరకొంగులో చుట్టి నడుం లో దోపుకున్న నగలు తీసింది. "సరే!ఆతోటలో వేపచెట్టు కింద పాతేయి.నీప్రాణాలు కాపాడుతాను"అన్నాడు.తెల్లారుతూనే"ప్రభూ!దొంగలు దొరకరు కానీ నగలమూటని వేపచెట్టు కింద పాతారు"అని చెప్పగానే జమీందారు పనివారిచేత దగ్గర ఉండి చెట్టు కింద తవ్వించి నగలమూట దొరకటంతో జమీందారు డబ్బు దస్కం తో సత్కరించాడు.ఈవిషయం తెలిసిన రాజు  అప్పయ్యను పిలిపించి మూతి బిగించిన చిన్నకూజాని తెప్పించి "ఇందులో ఏముంది?"అని అడిగాడు. బిక్కచచ్చిపోయి అప్పయ్య "చిక్కావురా మండూకా! ఇకచచ్చేవురా!" అని తనకు అన్వయం చేసుకుని చెప్పాడు. కూజామూత తీయగానే  కప్ప బైటికి దూకింది.అలా డబ్బు కావాల్సినంత సంపాదించుకున్న అప్పయ్య బతికుంటే బలుసాకు అని కాశీకి వెళ్లిపోయి అక్కడే స్థిరపడ్డాడు.🌷
కామెంట్‌లు