నాన్న పగలు సుక్క
మొలువకముందే లేచి
నాగలై కదిలేటోడు
పగలు పొదల్లో దాక్కున్న
కుందేలు పిల్లలు మేతకు లేచాకే
ఇంటి మొకం చూసెటోడు
వచ్చిరాగానే పిల్లలేరని పిలిచి
ఈత పండ్లు, పల్లికాయలు,శన్కాయలు ఇచ్చి
అలుపు సొలుపు ఆదమరిచి
మా నవ్వుల్లో పున్నమి పువ్వై విరిసెటోడు
మా కలల సౌధానికి నాన్న
మొట్టు మొట్టుగా మారి
మౌనంగా త్యాగానికి అకాశమైయెటోడు
పండుగ వచ్చేనంటే అప్పో సొప్పో చేసి
మాకు బట్టలు తెచ్చి తాను మాత్రం
ఎప్పుడో తెచ్చుకున్న అంగీని చూపి
నాకు ఇది ఉందిలే అని సర్ది చెప్పెటోడు
కనుమ పండుగనాడు మటన్
కూరలో మూలుగ ముక్కలు నాన్నకు
పడితే చిన్నోడికి మూలుగలు ఇష్టమని
నా ప్లేట్లో వేసి కడుపు నింపుకునెటోడు.
ఎంత కష్టమొచ్చినా కన్నీలు దిగమింగుకోని
పెదవులపై చిరునవ్వు పూయించెటోడు
ఎన్ని అలల ఎదురొచ్చినా...
ధైర్యపు గుంజలా గట్టిగా నిలబడెటోడు
పని తప్పా మరో ప్రపంచం తెలియని
నాన్న ఓ పిచ్చోడు
పెద్దకొడుకు ఎదిగిన చమటనీటిలో
ఆనందాన్ని చూసుకుంటూ,
వయస్సు లెక్క చేయకుండా
ఇంకా ఏదో చేయాలని మాకోసం
తాపత్రయ పడుతున్న ప్రేమ పిచ్చోడు.
నిత్యం కుటుంబ వృక్షానికి ప్రేమ పాదు
కడుతున్న ప్రాణ ప్రదాత వనమాలి అతడు
నాన్నలు ఎప్పుడూ అంతేనేమో బహుశా
పిల్లలు ఎదిగినా పసి మొగ్గలు అనుకుని
ఎంత చేసినా ఇంకా ఇంకా ఏదో చేయాలని
ఒరిగిపోతున్న రెక్కలను కూడా వారధి కడతారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి