సజ్జన సాంగత్యం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి.
 సమాజంలో ఉన్న నిరక్షర కుక్షి  ఎదుటనున్న పండితులను,  జ్ఞానులను ఎద్దేవా చేస్తూ ఉంటాడు వాడికేం తెలుసు నాకే అంతా తెలుసు అన్న భ్రమలో జీవిస్తూ ఉంటాడు.  అడవిలో సింహాలు  ఓ చెట్టుకింద సభ జరుపుకుంటున్న సమయంలో  ఒక కోతి ఆ చెట్టు పైకి వచ్చి  నేను వీటి కన్నా పైన ఉన్నాను  నా స్థితి వాటి కన్నా గొప్పది  అని డంబాలు పలికితే  విన్నవాడు నవ్వుకుంటాడు తప్ప ఆశ్చర్యపోడు అలా ఉంటుంది ఈ అజ్ఞాని తత్త్వం.  జీవితంలో ఎప్పుడైన  రెండు అక్షరాలు నేర్చుకోవాలని జ్ఞానులను కలిసి తెలిసిన వారి దగ్గరికి వెళ్లి నాకు ఇది తెలియదు చెప్పండి అని అడిగి వారి దగ్గర కూర్చున్నప్పుడు  ఆ పండితులు, జ్ఞానులు చెప్పే  సూక్తులను అర్థాలతో వివరించినప్పుడు తన స్థితి ఏమిటో తెలుసుకుంటాడు. మరికొంత జ్ఞానసముపార్జన చేయాలన్న కుతూహలం పెరుగుతుంది. అక్షరాలు నేర్చుకుంటున్న చంటి వాడు  వారి పెద్దలతో మీ కన్నా నాకే చదువు ఎక్కువ వచ్చు అని గారాలు పోతాడు  తల్లిదండ్రులు నవ్వుకుంటారు.  ఆ చదువు మూలాలు తెలిసినప్పుడు ఆ పసివాడి ప్రాణం ఎలా ఉంటుంది  ఇతనిదీ అదే స్థితి.
పెద్దలు చెప్పినట్లు సజ్జన సాంగత్యం మన అజ్ఞానాన్ని పోగొట్టడంతో పాటు,  భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు  నియమనిష్టలు పెద్దవారు ఎలా నిర్ణయించారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ శాస్త్రీయ దృక్పథం అలవడినప్పుడు అతని జీవనశైలే మారిపోతుంది. పాలలో నీళ్లు కలిపితే నీరు కూడా పాలగా మారిపోతాయి  కాచినప్పుడు ఆవిరిగా నీరు బయటకు పోతుంటే స్నేహితుడు వెళ్ళిపోతున్నాడు అన్న బాధలో ఉన్నప్పుడు  ఆ గృహిణి నీరు చల్లగానే స్నేహితుడు వచ్చాడని ఎంతో ఆనందిస్తుంది సజ్జన సాంగత్యం వలన మూర్ఖులు కూడా ఎలా పరివర్తన చెందుతారో ఉదహరించారు. 

కామెంట్‌లు