వెండి తెరపై వెన్నెల సంతకం సినారె !; -,-బాలవర్ధిరాజు మల్లారం
 ఏ కవి ప్రతిభా పాటవాలను వీక్షించి
తెలుగు కళామ తల్లి పులకించి పోయిందో
ఏ కవి కలాన్ని చూసి
అక్షరాలు ఆనంద తాండవం చేసాయో 
ఏ కవి రాస్తే 
పగలే వెన్నెల కు( వి)రిసిందో 
ఏ కవి కవితావనంలో 
లలిత పద సౌరభం గుబాళించిందో 
ఏ కవి గళం వింటే
వీనులకు విందయిందో 
ఏ కవి లేఖిని నుండి 
కొంగ్రొత్త సాహితీ ప్రక్రియలు పురుడు పోసుకున్నాయో
ఏ కవి ఇంటి పేరుకు 
కవిత చిరునామా అయ్యిందో
ఏ కవి గేయం 
వెండి తెరకు వెన్నెల సంతకం అయ్యిందో
ఏ కవిని వీక్షిస్తే 
తెలుగు సంస్కృతీ , సంప్రదాయాలు సాక్షాత్కరించాయో ..
ఏ కవి ధిషణకు 
పదవులు ఏరి కోరి వరించి మురిసిపోయాయో
ఏ కవి వల్ల 
తెలుగు కీర్తి పతాక విశ్వవ్యాప్తమయ్యిందో 
ఏ కవి విద్వత్తు నచ్చి
జ్ఞానపీఠమే మురిసిపోయిందో
ఏ కవి , కవిత్వాన్ని 
తన ఊపిరిగా శ్వాసించి , శాసించాడో
ఆ కవే ..
మహాకవి సినారె!
ఆ మహాకవి 
తెలుగు కవితై నిలిచాడు 
తెలుగు పాటై వెలిగాడు 
తెలుగు మాటై మిగిలాడు 
తె(వె )లుగు బాటై వెలిసాడు 
అక్షరానికి మరణం లేదు 
అక్షరమైన ఆ సుకవికీ మరణం లేదు ;
జననం తప్ప !
ఆ మన 'సుకవి' సినారెకివే నా అక్షర నివాళి
(మూడేళ్ళ  క్రితం భౌతికంగా మనకు దూరమైన జ్ఞానపీఠ పురస్కృతులు కీ.శే .డా.సినారాయణరెడ్డి గారి స్మృతిలో ...)

కామెంట్‌లు