చిత్రకారుడు మారుతి;-- యామిజాల జగదీశ్
 యాభై ఏళ్ళకుపైగా చిత్రకళలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న కళాకారుడు మారుతి. చూడటంతోనే అది మారుతి కుంచె నుంచి పుట్టిన బొమ్మేనని చెప్పవచ్చు. అంతటి గొప్ప చిత్రకారుడు మారుతి. ఆయనతో బొమ్మ గీయించుకోని తమిళపత్రికంటూ ఏదీ లేదు.
తన చిత్రకళ ప్రయాణం గురించి
ఆయన మాటల్లోనే చూద్దాం...
మా నాన్న స్కూల్ టీచర్  ఆయన వరలనేలమీదా క్ష్మీ వ్రతమప్పుడు ఇరుగుపొరుగువారికి కలశంలో లక్ష్మీదేవి ముఖాన్ని గీసి ఇచ్చేవారు. అదే నా మొదటిసారిగా బొమ్మలు గీడానికి ప్రేరేపించింది. నాన్న మిగిల్చిన చాక్పీస్ ముక్కలతో గోడలమీదా ఏదో ఒకటి గీస్తుండేవాడిని.
అందుకొక కారణం ఉంది. పుదుక్కోట్టలో ఒకతను గోడలమీద అయ్యప్ప, హనుమంతుడు, అమ్మవారు వంటి బొమ్మలు గీసి వాటి కింద 'Mad Man of Mysore' అని సంతకం చేసేవాడు. నేనూ ఆ బొమ్మలలాగానే ఇంట్లో గీస్తుండేవాడిని
 ఆ తర్వాత పెన్సిలుతో గీయడం మొదలుపెట్టాను.అగ్గిపెట్టెమీద ఉన్న బొమ్మలు, పక్కింట్లో ఉన్న ఆనందవిగడన్, కల్కి పత్రికలలో శిల్పి, గోపులు, మణియం వంటివారి బొమ్మలు చూసి వాటినలానే గీయడానికి ప్రయత్నించేవాడిని. మాధవన్ అనే ఆయన చిత్రాలంటే నాకెంతో ఇష్టం. ఇట్టాగే నా బొమ్మల కళ మొదలైంది.
నేను ఫోర్త్ ఫాం చదువుతున్నప్పుడు ఎంతసేపూ బొమ్మలు గీస్తే సరిగ్గా చదువుకోకపోవడంతో ఫెయిలయ్యాను. దాంతో నాన్నకు కోపం వచ్చింది. బొమ్మలు గీయడం మానేసే. బతుకుతెరువుకి బొమ్మలు పనికిరాదు ఆని ఏవేవో చెప్పారు. అయినా నేనా మాటలను చెవికెక్కించుకోలేదు. సరే, నువ్వు హైస్కూలు చదువు కానివ్వు. నిన్ను కుంభకోణం ఆర్ట్స్ కాలేజీలో చేర్పిస్తాను అని చెప్పారు నాన్న. అప్పుడు ఎలాగోలా స్కూలు చదువు పూర్తి చేశాను. తీరా నన్ను పుదుక్కోట్టయ్ లోని ఓ కాలేజీలో చేర్పించారు. నాకక్కడ చదువుకోవడం నచ్చలేదు. ఎంతసేపూ బొమ్మలమీదే ఉండేది మనసంతా. చిత్రకారుడైపోవాలని కలలు కంటుండేవాడిని. ఎలాగైనాసరే చెన్నై వెళ్ళిపోవాలనుకున్నాను. 
పుదుక్కోట్టయి టౌను హాలులో సాహిత్య సభలు జరుగుతుండేవి. చెన్నై నుంచి గొప్పగొప్ప వ్యక్తులు వచ్చి ఈ సభలలో ప్రసంగించేవారు. వారిని కలిసి చెన్నైకి వెళ్ళి బొమ్మలు గీసే ఉద్యోగం గురించి మాట్లాడాను. వద్దే వద్దు...బొమ్మలు గీస్తూ బతకడం కష్టమని చెప్పారు. ఒకవేళ అందంగా అక్షరాలు గీయడం తెలిస్తే అక్కడ సినిమా కంపెనీలో ఉద్యోగం దొరకొచ్చు అన్నారు. అది కూడా గ్యారంటీ లేదన్నారు. 
ఆ మాటతో బొమ్మలు గీయడంతోపాటు సినిమా ప్రకటనలు చేసి రకరకాలుగా రాయడం నేర్చుకున్నాను. ఓరోజు ఏదైతే అదే అవుతుందనుకుని చెన్నైకి బయలుదేరాను. ఇంట్లో వాళ్ళతో విభేదించి బయటకు వచ్చేసాను. 1959 మార్చి 11న చెన్నై చేరాను. మైలాపూరులో ఓ సినిమా ప్రకటన సంస్థలో చేరాను.నెలకు యాభై రూపాయల జీతం. లెటరింగుతోపాటు బొమ్మలు గీయడం పని. అప్పుడే రకరకాల వర్ణాలుంటాయని తెలుసుకున్నాను. ఎందుకంటే మా ఊళ్ళో ఎంతసేపూ నలుపు - తెలుపు రంగులే తెలుసు.
 
నాకు మానసిక గురువులు ముగ్గురు. వారు, గోపులు, మణియం, శిల్పి. వారిలా నేను చిత్రకారుడైపోవాలని కలగన్నాను.
ఓరోజు నేను నేను గీసిన బొమ్మలతో ఎస్. ఎ.పి. అనే ప్రముఖుడిని కలిసాను. నా బొమ్మలను చూపించాను. వాటిన చూసిన తర్వాత ఆయన కొన్ని సన్నివేశాలు చెప్పి వాటికి బొమ్మలు గీయమన్నారు. అప్పట్లో కుముదం అనే పత్రిక నెలకు మూడుసార్లు వచ్చేది. నేను గీసిన బొమ్మలు ఆనకు బాగా నచ్చాయి. ఆయన ఓ కథ ఇచ్చి బొమ్మ గీయమన్నారు. గీసాను. నా పేరు రంగనాథన్. నేను ఆ పేరుతోనే బొమ్మలు గీస్తే నేను పని చేస్తున్న సినిమా పబ్లిసిటీ సంస్థలో ఉద్యోగం పోతుందని భావించాను. కుముదంలో నెలకు ఒకసారి మాత్రమే అవకాశమిస్తానన్నారు. నేను అప్పటికే ఉద్యోగం చేస్తున్న బిల్డింగ్ పేరు మారుతీ ఫార్మసీ బిల్డింగ్. మా నాన్న ఆంజనేయస్వామి భక్తుడు. దాంతో నేను మారుతీ అనే పేరుతో బొమ్మలు గీయడానికి నిర్ణయించుకున్నాను. ఆ పేరుతోనే నేను గీసిన బొమ్మ అచ్చయ్యింది. ఆ కథ పేరు "అయ్యో పావం(పాపం). నిజం చెప్పాలంటే నా పరిస్థితీ అయ్యో పాపంలాగానే ఉండేది. ఓ పత్రికలో నేను గీసిన బొమ్మ అచ్చవడం అదే తొలిసారి. కొంతకాలానికే పబ్లిసిటీ ఇఫీసులో ఉద్యోగం మానేసి ఎస్.ఎ.పి. ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాను.
అదే సమయంలో ఆయిల్ పెయింటింగ్ కూడా నేర్చుకున్నాను. చిత్రకారుడు మాధవన్ ని కలిసి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఆయన బంధువు నటరాజన్ బ్యానర్లు గీసేవారు. నటుడు శివకుమారుకి ఆయనే గురువు.
యాథృచ్ఛికంగా ఆయనను కలిసాను. నేను విడిగా నీకు నేర్పలేను కానీ నేను గీస్తున్నప్పుడు వాటిని చూసి నేర్చుకో అన్నారాయన. రోజూ ఆయన వద్దకు వెళ్ళి ఆయన గీసే తీరుని గమనిస్తూ రాత్రుళ్ళు ఇంట్లో ప్రాక్టీస్ చేసేవాడిని. ఈరోజు నేను గీసై శైలి మాధవన్, నటరాజన్ వంటివారిదే. వీరిద్దరూ ప్రత్యక్ష గురువులు. క్రమంగా పలు పత్రికలు, కామిక్స్ పుస్తకాలకూ బొమ్మలు గీసాను. ఎన్నో ప్రముఖ పత్రికలకు బొమ్మలు గీసాను. ప్రముఖ తమిళ రచయిత జయకాంతన్ రచనలకు బొమ్మలు గీసే అవకాశం రావడం నా భాగ్యం. ఆయన రచనలు నాకెంతో ఇష్టం. అలాగే ప్రముఖ రచయిత సుజాతా (కలం పేరు) రాసిన పత్తు సెకండ్ ముత్తం అనే సీరియల్ కి బొమ్మలు గీసాను.
బొమ్మలు గీయడం అనేది ఓ తపస్సు. ధ్యానం. ఈ కళ పరిమాణం డబ్బు కాదు. డబ్బు అవసరమే. కాదనను. కానీ ఓ బొమ్మ గీసినప్పుడు, గీసిన బొమ్మను ఒకరు ఆస్వాదించినప్పుడు కలిగే మానసికతృప్తి దాని పరిమాణం. అందుకే డబ్బుతో ఓ బొమ్మను కొలవలేం.
నా వృత్తికి ఎటువంటి ఇబ్బందులూ రాకుండా చూసుకోవడంలో నా భార్య విమల ఎంతగానో సహకరించేది. నేనీ రోజు ఉంటున్న ఇల్లు జర్నలిస్ట్ కోటాలో రావడానికి కారకులు వలంపురి జాన్. ఆయనకు నా ధన్యవాదాలు అంటూ మారుతి ఓ ముఖాముఖిలో చెప్పారు.
ఇటీవల కొన్ని తమిళ పత్రికలు తిరగేస్తుంటే వాటికి మారుతీ అందించిన ముఖచిత్రాలు నన్ను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఆయన గురించి తెలుసుకోవాలనిపించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలలో కొన్నింటితో ఈ నాలుగు మాటలూ రాశాను.

కామెంట్‌లు