మేఘం.మబ్బులు లేదా మేఘాలు ; - డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వర రావు .చెన్నై
 భూమిపై వర్షాలకు మూలం.మేఘాల్లో రకాలు.
అష్టమేఘాలు,కుక్కగొడుగు మేఘం.
క్యుములోనింబస్ మేఘాలు.
క్యుములోనింబస్‌' మేఘాలకు మేఘరాజు అనే పేరు కూడా ఉంది. భూమి మీద ఏటా 44 వేల క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడతాయని అంచనా. భారీ
 ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ ఎక్కువగా చేరడం, వాతావరణంలో అస్థిరత వంటి పరిస్థితుల్లో ఏర్పడతాయి. బొగ్గు, గ్రానైట్‌, కొండలు వంటివి ఉన్న ప్రాంతాల్లో ఇవి చాలా ఎత్తుకి ఎదుగుతాయి. రుతుపవనాల సమయంలో ఏర్పడే మేఘాలు భూ ఉపరితలం నుంచి 3-4 కి.మీ. ఎత్తు వరకు మాత్రమే వెళతాయి. కానీ క్యుములోనింబస్‌ మేఘాలు మాత్రం 12-15 కి.మీ. ఎత్తు వరకు వెళ్తాయి. విస్తీర్ణం 10-25 చ.కి.మీ. వరకు ఉంటుంది. భూమిపై ఐదున్నర కిలోమీటర్లు దాటిన తర్వాత వాతావరణం మైనస్‌ డిగ్రీల్లోకి మారుతుంది. దాంతో క్యుములోనింబస్‌ మేఘాల్లోని నీటి బిందువులు మంచు స్ఫటికాలుగా ఘనీభవిస్తాయి. ఇవే వడగళ్లుగా కురుస్తాయి.
క్యుములోనింబస్‌ మేఘాలు రెండు మూడు గంటల వ్యవధిలో ఏర్పడి గంటా గంటన్నరసేపు భీకర వర్షాన్ని కురిపించి వెళ్లిపోతాయి. ఈ కొద్ది వ్యవధిలోనే భారీ నష్టం జరుగుతుంది. సాధారణ మేఘాల్లో గాలుల తీవ్రత సెకనుకి సెంటీ మీటర్ల స్థాయిలో ఉంటే వీటిలో మాత్రం సెకనుకి 15-20 మీటర్ల వేగంతో విజృంభిస్తాయి. అందుకే ఈ మేఘాలు ఏర్పడినప్పుడు గంటకు 50 కి.మీ.కు మించిన వేగంతో పెనుగాలులు వీచి చెట్లు కూలిపోవడం వంటివి జరుగుతాయి. క్యుములోనింబస్‌ మేఘాల్లో పుట్టే రుణ, ధనావేశాల కణాల సమూహాల వల్ల మెరుపులు, ఉరుములు ఏర్పడి పిడుగులూ పడతాయి. గంటన్నర వ్యవధిలో గరిష్ఠంగా 25-30 సెం.మీ. వర్షం కురుస్తుంది.వీటిని ఈశాన్య భారతంలో 'కాలబైశాఖి' 'నార్వెస్టర్స్‌' అంటారు.
అష్టమేఘాలు అనగా ఎనిమిది రకాల మేఘాలు. మేఘమాలికా శాస్త్రములో, మేఘాలను ఎనిమిది రకాలుగా నిర్ణయించినట్లు ఉంది.
పుష్కలావరక మేఘాలు: యెక్కువగానూ, మిక్కిలి వింతగాను వర్షిస్తాయి. కుంభవృష్టి (కుండలతో దిమ్మరించే విధముగా వాన కురవటం)ని కురిపించే మేఘాలివే.
మధుమేఘాలు: తేనె రంగు కలిగి ఉంటాయి. పదిహేను ఆమడల పొడవు వ్యాపించి నాలుగు తూముల వర్షం కురిపిస్తాయని చెబుతారు.
వాయు మేఘాలు లేదా వాయుమండల మేఘాలు: ఈ మేఘాలు గోరోచనపు రంగులో ఉంటాయి. ఇత్తడి రంగుగా కనబడతాయి. ఇవి కనిపిస్తే వర్షం కురవదంటారు. దీనినే జానపదులు పులిచారల మబ్బు అంటారు. అవి పన్నెండు ఆమడల పొడవు వ్యాపించుననియూ, గాలి యొక్కువగా ప్రకోపించి, ప్రధానంగా ఉంటే స్వల్పవర్షం కురుస్తుందని చెబుత్తున్నారు.
రాజమేఘాలు: నల్లని, తెల్లని మబ్బులలో రాగి వలెను, దాసాని పువ్వు వలెను మెరుపులు కనిపిస్తే, ఆ మబ్బులో రాజమేఘాలున్నాయని అనుకోవచ్చు. ఈ మేఘాలు ముఖ్యంగా వింధ్యకు ఉత్తర ప్రాంతాలలో గంగా తీర సీమలలో వర్షిస్తాయి.
బ్రాహ్మణజాతి మేఘాలు: కమలముల వన్నె కలిగి ఉంటాయి. ఇవి గాలిపాటును బట్టి వర్షిస్తాయని చెబుతారు.
క్షత్రియజాతి మేఘాలు: ఎర్రని రంగు కలిగి, గంభీరాకారముతో ఉంటాయి.
శూద్ర జాతి మేఘాలు: నల్లని రంగు కలిగి ప్రశాంతముగా ఉంటాయి.
నీలిమేఘాలు: ఇంద్ర నీలమును పోలిన రంగు కలిగి, నిప్పురంగు మెరుపులు ఈ మేఘముల నుండే కలుగుతాయని అంటారు. ఇవి వింధ్యా పర్వతాలకు దక్షిణ ప్రాంతములలో, గోదావరీ నది సముద్రములో కలిసే ప్రదేశములలో వర్షిస్తాయని ప్రతీతి.

కామెంట్‌లు