బ్రతుకు బాట ..!!--(బడిబాట)--రామశాస్త్రి.ఎన్.--హన్మకొండ.

 నాకు అక్షరాభ్యాసం  ఎప్పుడైందో యాదికిలేదు గాని నా మొదటి టీచరు రామాచారిగారు మాత్రం యాదికూన్నడు.ఎందుకంటే నా పేరు మార్చింది ఆయనే. మానాన్నకు స్నేహితుడైన రెడ్డిదొరవారు,తన పిల్లలకు చదువుచెప్పటం కోసం ఒక శ్రీవైష్ణవ ఉపాధ్యాయుడిని పిలిపించిండు. "పద్మయ్యబావా --(ఊర్లల్లో అట్లనే పిల్చుకునేవారు)--మీవోణ్ణికూడా తోలరాదు.... మాఇంటికి మామనుమలతో కలిసి చదువుకుంటడు" అన్నడు  ఆదొరగారు .తన ఇంట్లనే రామాచారిగారికి ఠికాన ఏర్పాటుచేసి తనింట్లనే ఒక హాల్ల పిల్లలను కూచుండబెట్టుకొని చదువు  జెప్పుడు. మంచి రోజు చూసి బడి మొదలైంది.ఆరోజు రామాచారిగారు పూజచేసుకొని శొంఠిపొడిల శర్కర కలిపి ప్రసాదం అందరికీ పెట్టి  పాఠాలు మొదలు పెట్టిండు.ఆ క్రమంలో అందరి పేర్లూ అడిగిచెప్పించిండు.అందరూ ఆ ఇంటి పిల్లలే.నేనొక్కణ్ణే బయటివాడిని.కొద్దిగ వేరేకూచున్న. "ఆపిల్లగాడు మాఅయ్యగారి కొడుకు "అని ఒక పిల్లగాడు చెప్పిండు ."ఆ! ఏమయ్యా శాస్త్రీ  మీనాయన గారి పేరేమిడిది" అన్నడు.నేనన్న "నా పేరు రామచంద్రయ్య అండీ మానాయన పద్మనాభయ్య గారు" అని చెప్పంగనే ఆయన "రామచంద్రయ్య అయితేమిడ్ది.ఇవాళనించి నిన్ను శాస్త్రి రామశాస్త్రి అనే పిలుస్త "అన్నడు.మిగిలిన పాల్లలందరూ నన్ను బనాయించుడు మొదలు బెట్టిన్రు శాస్త్రి శాస్త్రి అని.అసలు నా పేరు మాతాత గారి పేరు రామచంద్రయ్య అని పెట్టిన్రు మా నాయన. కానినామొట్టమొదటి టీచరు నాపేరును ఇట్ల మార్చి నాజీవితాంతం తనను గుర్తుంచుకునేటట్టు చేసిండు.
రోజూ తను పూజచేసుకొని పిల్లలందరికీ ప్రసాదమిచ్చి గాని పాఠాలు మొదలు పెట్టకపొయ్యేది.అదిగూడా 'సరస్వతీ నమస్తుభ్యంవరదే కామరూపిణీ... 'అన్న సరస్వతీ ప్రార్థన చేయించినాంకనే.
ఆయన సుమతీ శతకం  వంటి శతకాల పద్యాలు కూడికలు ,తేసివేతలు ,(అదే అప్పుడు జమాఖర్చులు అనేవారు.) చెప్పేవాడు.ఉచ్చారణ సరిగ్గాలేకపోతే దండననే.అట్లా దొరగారి మనుమని చెవులు పిండిండనే కారణం తోటి ఆటీచరును వెళ్ళ గొట్టిండు దొర.అప్పుడు ఆయన వెళ్ళిపొయ్యేరోజు మా ఇంటికి వచ్చి "మీపిల్ల వాడు మంచిగచదువుతున్నడు బడిబందుజేయకున్రి  ఎట్లనన్న చదివిచ్చున్రి "అని మానాయనకు చెప్పి పోయిండు.
  ఆతరువాత మా ఊర్లనే అళగరయ్య గారని  చాత్తాద వైష్ణవుని బడి కిపోయిన .పెద్ద తెలివిగలవాణ్ణి కాకపోయినా మొద్దును మాత్రం కాదు. అక్కడ అక్షరాలు, ఒంట్లు ఎక్కాలు,బొట్లిరుసు ,గిద్దెలిరుసు .జమాఖర్చులేగాక గుణకారం భాగహారం లెక్కలూ నెలల పేర్లు అరవై సంవత్సరాల పేర్లూ నేర్పించేది.పొద్దున్నేసారు అక్షయప్త్ర కని బయటికి ఊళ్ళెకు పోయేటోడు .జరుగుబాటుకోసం .గృహిణులు సారు పచ్చిండని పావుశేరో అద్దశేరో బియ్యం అక్షయపాత్రలో పోసేవాళ్ళు..ఆయన వచ్చి భోజనానికి కూర్చునే ముందు మమ్ములనూ తిండికి వదిలి పెట్టేవాడు .తిని వచ్చినాక ఎక్కాలు బట్టీపట్టడం ఒక పిల్లవాడు నిలబడి చెప్తుంటే మిగిలినఅందరూ తిరిగి అనాలె."ఒక్కెక్కామొక్కటి.ఒక్కరెండు రెండూ."ఇట్లా ఇరవైయవ ఎక్కంవరకు .కిందినించిమీదికి  ,మీదినించి కిందికి.
పొద్దున బడికి పోయేటప్పుడు పలక  ( slate) సంచిల పెట్టి పట్కపోయేది.కొంత కాలం చెక్క పలకలుండేది .ఆ పలక కు అలం ఆకును దంచి పూసి బొగ్గుపొడి పూసేవాండ్లం పైన.  బలపం సరిగ్గాపడాల్నని  రాయాల్నని.చెక్క పలకకు ఒకవైపుముక్కోణాకారంలో చిన్నగా చెక్కి దానికి చిన్న రంధ్రం ఉండేది.ఆ రంధ్రంలో ఒక దారం కట్టి చంకకు తగిలించుకునేది.
అక్షరాలు సరిగ్గా దిద్దని పిల్ల గాండ్లకు కింద ఉశ్కెపోసి చూపుడు వేలుతో దిద్దించేటోళ్ళు.
పొద్దున బడికి ఎవరు ముందర వస్తే వాడు-- సిరి.తర్వాత వచ్చిన వాడు --చుక్క.తర్వాత దెబ్బనే ఆలస్యంగా వచ్చిన మొదటి వానికి ఒక్క దెబ్బ తర్వాతవానికి రెండు ఇట్ల.
ఒక పెబ్బె ఉండెటోడు .సీనియరనుకోండి .వాడు పొద్దున వచ్చేటప్పుడేరెండు చింత బరిగెలు తెచ్చి సారు బల్ల మీద పెట్టాలె. బరిగెలు తేని రోజు పెబ్బెకు దెబ్బలే. దసరా పండుగ నాడు సారు అందరు పిల్లలను తీసుకొని అందరి ఇండ్లల్లకు పొయ్యి  పిల్లలతోటి దసరా పద్యాలు చదివించి కానుకలు పొందేవారు."పిల్లవాండ్లకు చాలు పప్పుబెల్లాలు అయ్యవారికి చాలు ఐదువరహాలు".అని చదివేవాండ్లం.
 అళఖరయ్య గారి తరువాత వారి పెద్దకొడుకు చంటయ్య గారుమాకు చదువు చెప్పిన్రు .ఇంగ్లీషు కూడా రావాలె అని ఒక క్రిస్టియన్ సారు వచ్చిండు కాని ఎక్కువ రోజులు చెప్పలేదు.
తరువాత నేను సర్కారి బళ్ళో మూడో తరగతిల షరీకైన.. అప్పటికి మా ఊళ్ళో నాలుగువరకే ఉండె.ఎంబరుమానార్ గారని ఒకాయన పెద్ద సారు ఉండె.అయిదో తరగతికే  బయటికివపోవాలసి వస్తద
నుకున్నంకాని అయిదవతరగతిఅయింది.
 నాసోపతిగాండ్లు  వెంకటయ్య.పాపిరెడ్డి.ముకుందరెడ్డి . భద్రయ్య .నారాయణ. మొగిలి.మొండయ్య. సర్వయ్య..ఇట్ల.అందరి పేర్లూ దాదాపు యాదికున్నై.సర్కారి బడిసంగతి మళ్ళొక్కసారి చెప్త. అట్ల రామచంద్రయ్య అనే నేను 'రామశాస్త్రి' గా మారిన వైనం. నా పేరుకు కారణమైన రామాచారి గారికి నాజీవితాంతం రుణపడివుంట.
 ఆరోజుల్లో బడినుంచి రాన్గనే బడిబట్టలు విడిచి ఇంటిముందర చిలక్ఖొయ్యకు తలిగించి బస్తసంచి కట్టుకొని కాళ్ళు కడుక్కొని ఇంట్లకుపొయ్యి ,వేరే బట్టలు కట్టుకోవల్సి వచ్చేది. (అది నాటి ఆచారమేఅనున్రి,దాని వెనుక వున్న పరిశుభ్రత ఆలోచనేఅనుకోన్రి) .

కామెంట్‌లు